ఎంత పాత తెలుగు సినిమాలోనైనా నగలు తాకట్టు లేదా కొనే దుకాణాన్ని చూపే సన్నివేశంలో తలపై టోపీ పెట్టుకొని, వచ్చి రాని తెలుగు మాట్లాడే మార్వాడీనే చూపిస్తారు. అంటే తెలుగు ప్రేక్షకుడు ఆ వ్యాపారంలో మరొకరిని అంగీకరించడనే భావన అప్పుడే సినిమావాళ్లలో ఏర్పడింది. మద్రాస్ వీధుల్లో చిత్రీకరించిన తెలుగు సినిమాలో ఇలా ఉందంటే సుమారు వందేండ్ల క్రితమే మార్వాడీలు ఈ రెండు రాష్ర్టాల్లో అలా స్థిరపడ్డారన్నమాట.
డబ్బు, పెట్టుబడితో ముడిపడి ఉన్న సకల వ్యాపారాల్లో వారు బ్రిటిష్ కాలంలోనే మార్వాడీలు దేశమంతా విస్తరించారు. తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు కూడా ఆ విస్తరణకు లోబడిన ప్రాంతాలే. యాభై, అరవై ఏండ్ల క్రితమే హైదరాబాద్‌లోని కోఠి ప్రాంతంలో ‘మార్వాడీ భోజనాలయ్’ ఉండేది. అందులో కేవలం ఉత్తరాది వంటకాలు వడ్డించినా అందరూ తినేవారు. ఆ హోటల్‌కు ఒక జాతిని తెలిపే పేరు పెట్టడంలో ఎన్నో అర్థాలున్నాయి.
ఇప్పుడైతే దేశంలో మార్వాడీ అంటే తెలియనివారు ఉండరని చెప్పవచ్చు. ఆ పదాన్ని కొన్ని సందర్భాల్లో విశేషణంగా కూడా వాడతారు. అధిక వడ్డీతో తీరని అప్పును ‘అది మార్వాడీ వడ్డీ’ అని చెప్పుకొంటారు. వ్యాపార విషయాల్లో సాటి మనుషులతో మార్వాడీ నిర్దయగా, నిరంకుశంగా ఉంటాడనడానికి ఇవి తార్కాణాలు. అయితే ఈ కారణాలతో జాతి మొత్తాన్ని ఒక్క గాటన కట్టలేము. ఎందుకంటే దేశంలో ఎన్నో పరిశ్రమలు స్థాపించిన బిర్లా, మిట్టల్, దాల్మియా, బజాజ్, జిందాల్ కుటుంబాలు కూడా మార్వాడీ సంతతే. అయినా సరే, దేశంలోని వివిధ ప్రాంతాల్లో మార్వాడీలకు వ్యతిరేకంగా లేవనెత్తిన ఉద్యమాలను కూడా తప్పుపట్టలేము. మార్వాడీల్లోని కొత్త తరం దూకుడు వల్ల కొంతకాలంగా స్థానికుల్లో అసహనం, వ్యతిరేకత గూడుకట్టుకున్నాయి. ‘మా నేలపై మీ వ్యాపార పెత్తనమేమిటి?’ అనే ప్రశ్నలు రాజుకుంటున్నాయి.
అసోం రాష్ట్రంలో ఆగస్టు 13న ఒక మార్వాడీ యువకుడు 17 ఏండ్ల అస్సామీ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించడంతో స్థానిక అస్సామీ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. రాజీపడిన ఆ యువకుడి కుటుంబం మోకాళ్లపై కూర్చోని బహిరంగ క్షమాపణ చెప్పక తప్పలేదు. ఇంతటితో ఆగకుండా అస్సామీ సంఘాలు కొన్ని డిమాండ్లను కూడా మార్వాడీల ముందుంచాయి. స్థానికుల భూములు కొనవద్దని, దుకాణాల్లో 90 శాతం అస్సామీలకే ఉద్యోగాలు ఇవ్వాలని, దుకాణాల బోర్డులను హిందీలో కాకుండా స్థానిక భాషలో ఏర్పాటు చేయాలని పట్టుబట్టారు. అంటే ఆ సంఘటన మాధ్యమంగా స్థానికుల్లో ఉన్న ఇన్నేళ్ల అసహనం బయటపడింది.
2023 డిసెంబర్లో బెంగళూరులోని చిక్కపేటలో మార్వాడీలు దుకాణాల బోర్డు విషయంలో కన్నడ భాషను పట్టించుకోవడం లేదని, నామమాత్రంగా చిన్న అక్షరాలు వాడుతున్నారని కన్నడ సంఘాలు గొడవకు దిగాయి. చివరకు ఇంగ్లిషులో చిన్న, కన్నడంలో పెద్ద అక్షరాలతో దుకాణాల బోర్డులు మార్చక తప్పలేదు. ఇక్కడ కూడా ఇది కేవలం భాషకు సంబంధించిన చిన్న విషయంగా కొట్టిపారేయలేము. స్థానికులకు మార్వాడీల పట్ల ఉన్న వ్యతిరేకతను ఈ విధంగా వ్యక్తపరిచారని కూడా అనుకోవచ్చు. పదేండ్ల క్రితం ఒడిశాలో ఓ సంఘటన మూలంగా మార్వాడీల ఆస్తుల ధ్వంసమే జరిగింది.
వరద బాధితుల సహాయార్థం విరాళాల సేకరణకు వెళ్లిన యువకులతో ఓ మార్వాడీ దుకాణాదారు అవమానకరంగా మాట్లాడటంతో ఈ గొడవ మొదలైంది. దాంతో స్థానికులపై పట్టింపులేని మార్వాడీలు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలనే నినాదం మార్మోగింది. మొఘలుల కాలంలో ఆ ప్రాంతానికి వలస వచ్చిన మార్వాడీలు మొత్తం వ్యాపారాలను కైవసం చేసుకొని అధిక ధరలు, నాణ్యతలేని సరుకులతో ప్రజల రక్తాన్ని పీల్చుకుంటున్నారని స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సెగ బీహార్, పశ్చిమ బెంగాల్‌కు కూడా పాకే ప్రమాదాన్ని రాజకీయ ప్రమేయంతో నిలువరించారు.
2021లో మెదక్ జిల్లా తూప్రాన్‌లో ‘మార్వాడీ హటావో, తూప్రాన్ బచావో’ అనే ఆందోళన మొదలవగా స్థానిక అగర్వాల్ సంఘ నేతలు దీన్ని సామరస్యంగా పరిష్కరించారు. తెలంగాణ అభివృద్ధిలో తాము భాగమని, సమాజానికి తిరిగివ్వడం తమ బాధ్యత అని చెప్పి స్థానికులను వారు శాంతింపజేశారు. తిరిగి ఇప్పుడు అమనగల్‌లో మార్వాడీలకు వ్యతిరేకంగా ఆందోళన మొదలైంది. రాజస్థాన్, గుజరాత్ రాష్ర్టాల నుంచి వచ్చినవారు స్థానికుల వ్యాపారాలను దెబ్బతీస్తున్నారు, సగానికి పైగా నాణ్యత లేని వస్తువులను అమ్ముతున్నారని వారు అంటున్నారు. నాసిరకం సరుకు తక్కువ ధరలకు అమ్మి, మడిగెల కిరాయిలు పెంచి స్థానిక వ్యాపారుల షాపులు మూతబడేలా చేస్తున్నారన్నది వారి వాదన. దీనికి నిరసనగా స్థానిక వ్యాపారస్థులు ఈ నెల 18న తలపెట్టిన అమనగల్ బంద్ అందరి దృష్టిలో పడింది. అయితే వివిధ కారణాల వల్ల బంద్‌ను వాయిదా వేసినట్టు వారు ప్రకటించారు.
ఈ మధ్య సికింద్రాబాద్‌లో పార్కింగ్ విషయంలో వచ్చిన గొడవలో మార్వాడీ వ్యక్తులు ఒక యువకుడిపై చేసిన దాడి మరో వివాదానికి మూలమైంది. వివిధ స్థానిక అస్తిత్వ సంఘాలు, ఉద్యమకారులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి మొత్తం మార్వాడీ సమాజాన్ని లక్ష్యంగా చేసుకొని ప్రకటనలు ఇస్తున్నారు. స్థానికుల్లో పెల్లుబుకిన ఈ విమర్శ, అసహనం నుంచి మార్వాడీలను కాపాడేందుకు బీజేపీ నేతలు, హిందుత్వవాద సంఘాలు ముందుకువచ్చాయి. మార్వాడీలపై అసహనానికి వాస్తవ కారణాలేంటి, వాటిని ఎలా సద్దుమణిగేలా చేయాలనే దిశలో బీజేపీ నేతలు ఆలోచించకుండా, వివాదాన్ని పెంచి స్వార్థ రాజకీయ ప్రయోజనాలు సాధించుకోవడానికి ప్రయత్నించడం విషాదకరం.
స్థానిక హిందూ సంఘాల పెద్దలు, బీజేపీ నేతలు కొందరు ఈ మార్వాడీ వ్యతిరేకతను పాకిస్థాన్ సృష్టి అంటున్నారు. కమ్యూనిస్టులు దీనికి వంతపాడుతున్నారని చెప్తున్నారు. రోహింగ్యాల ప్రస్తావన తెస్తున్నారు. ఈ మాటలతో అసలు సమస్యను పక్కదారి పట్టించడమే వారి ఉద్దేశం.
– బద్రి నర్సన్