కొడుకుల మీద ఆశలు వదిలేసి
ఆసరా పింఛన్ కోసం
ఆనందంగా ఎదురు చూస్తున్నారంటే
మన తెలంగాణ కల నెరవేరినట్టే!
దీనంగా మేఘాలకేసి చూడకుండా
నీళ్ళు నిత్యం పక్కనే పారుతున్నాయన్న
భరోసాతో రైతులున్నారంటే
మన మట్టి కల నెరవేరినట్టే!
అప్పుల కోసం ఎవరినీ వేడుకోకుండా
రైతుబంధుతో నిశ్చింతగా ఉన్నారంటే
ఆత్మహత్యలు లేని పంటలతో
మన బతుకు కల సాకారమైనట్టే!
ఏ రోగమొచ్చినా
డబ్బుల గురించి కాకుండా
ఆసుపత్రులున్నాయన్న గుండెధైర్యంతో
మనగలుగుతున్నారంటే
మనల్ని బతికించే కల నెరవేరినట్టే!
గూడు లేని పక్షులకు
ఇంటి కలను నిజం చేసి
నిన్నటి దిక్కులేనితనాన్ని చెరిపేసి
నేడు కొత్త జీవితాన్ని అందిస్తే
అమరుల ఆశయం నెరవేరినట్టే!
ఎలా బతకాలో అని ఆలోచించకుండా
అందరికీ ఏదో ఒక రూపంలో
ప్రభుత్వమే అండగా ఉంటుందంటే
పోరాట ఫలం చేతికందినట్టే!
పథకాలు ఎన్ని ఉన్నా
ఆపదలో ఆదుకునే ప్రతిసారి
తెలంగాణ తల్లి ఆనందబాష్పాలుగా
దీవెనలు అందిస్తూనే ఉంటుంది!
తొమ్మిది నెలలుగా కాపాడిన బిడ్డ
తల్లి గర్భం నుంచి బయటపడినట్టు
తొమ్మిదేండ్ల ప్రయాణంలో
ఇక తెలంగాణ రెక్కలు విదిల్చి
ప్రపంచంలో కీర్తి కిరీటమై నిలుస్తుందని
ప్రతి గుండె స్పందనగా వినిపిస్తుంది!
పుట్టి గిరిధర్: 94949 62080