Mahesh Babu | సూపర్ స్టార్ మహేష్ బాబు-దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వారణాసి’ పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ గురించి దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుండగా, తాజాగా మహేష్ బాబు ఇచ్చిన ఇంటర్వ్యూ మరింత ఆసక్తిని రేకెత్తించింది. సుమారు రూ.800 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే సంవత్సరం ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. హాలీవుడ్ మార్కెట్‌ను కూడా లక్ష్యంగా పెట్టుకుని ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేయాలని రాజమౌళి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’తో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందిన రాజమౌళి, ఈ సినిమాను మరింత విస్తృత స్థాయిలో తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఇటీవల ‘వారణాసి’ గ్లింప్స్ విడుదల సమయంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్‌లతో కలిసి రాజమౌళి హాలీవుడ్లో ప్రత్యేక ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు.
ఆ ఇంటర్వ్యూల్లో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ముఖ్యంగా కథ ఎలా ప్రారంభమైందన్న అంశంపై మహేష్ బాబు చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. మహేష్ బాబు మాట్లాడుతూ, “ఇంతకుముందు రాజమౌళి గారు నాతో ఎప్పుడూ కథ గురించి చర్చించలేదు. దాదాపు 15 ఏళ్లుగా మేమిద్దరం కలిసి పనిచేయాలని అనుకుంటున్నాం. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత కూడా దాదాపు ఒక సంవత్సరం పాటు ఆయన నుంచి ఎలాంటి స్టోరీ డిస్కషన్ జరగలేదు. ఆ తర్వాత ఒకరోజు తన ఆఫీస్‌కు పిలిచి ఈ కథను నేరేట్ చేశారు. ఆ కథ విన్న వెంటనే నేను ఆశ్చర్యపోయాను” అని తెలిపారు.
ఈ సినిమాలో యాక్షన్, అడ్వెంచర్, మైథాలజీ, టైమ్ ట్రావెల్ వంటి విభిన్న అంశాలు మిళితమై ఉంటాయని మహేష్ వెల్లడించారు. “రాజమౌళి గారికి నేను పెద్ద అభిమాని. ఆయన దర్శకత్వంలో ఇలాంటి విభిన్నమైన కథలో నటించడం నాకు చాలా ఆనందంగా ఉంది. సినిమా ప్రాసెస్‌లో నన్ను పూర్తిగా ఇన్వాల్వ్ చేయడం మరింత ప్రత్యేకం” అని చెప్పారు. ఈ వ్యాఖ్యలు సినిమా మీద ఉన్న అంచనాలను మరింత పెంచాయి. అత్యాధునిక టెక్నాలజీ, విజువల్ ఎఫెక్ట్స్, అంతర్జాతీయ స్థాయి నిర్మాణ విలువలతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మహేష్ బాబు కెరీర్లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్‌గా నిలుస్తున్న ‘వారణాసి’ గ్లోబల్ బాక్సాఫీస్‌ను లక్ష్యంగా పెట్టుకుని రూపొందుతుండటంతో, ఈ సినిమా భారతీయ సినిమాకు మరో మైలురాయిగా నిలుస్తుందనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.