సాయం అంటే సాయం కాదు
ఒక అయ్యకు పిల్లల బడి పీజు
ఒక అన్నకు ఇంటి కిరాయి
నేసి నేసి కష్టమంతా అప్పుల పాలైతే
కమ్మటి బువ్వకు కాలం కరువయ్యింది
నాలుగేండ్లుగా కడుపులోని బకాసురుడు
అరుస్తూనే ఉన్నడు
వాడిని ఊరడించడం పెద్ద గండమయితున్నది
సాయం అంటే సాయం కాదు
ఈ జేబులో పడ్డ ప్రభుత్వ ఖజానా
ఆకలి వేళ మెతుకు కళ్ళకద్దుకొని
ముద్ద లాగించడమే తెలిసిన నా కార్మికులకు
అన్నం తినడమూ ఒక కళే అని
నేర్పుతున్న తీరిక పాఠం
సాయం అంటే మామూలు సాయం కాదు
పప్పులో ఉప్పయిన సాయం
వేన్నీళ్ళకు చన్నీళ్ళు తోడయినట్టు
కొంత బరువు ఎత్తుకోవడానికి
ఎదురయిన కొడుకు సాయం.
(సెప్టెంబర్ 1న చేనేత మిత్ర పథకం
ప్రారంభమైన సందర్భంగా)