చిహ్నాలు, పేర్లు మారిపోతున్న యుగంలో మనం జీవిస్తున్నాం. మద్రాస్ పేరు చెన్నైగా, అలహాబాద్ ప్రయాగరాజ్గా, కలకత్తా కోల్కత్తా గా మారిపోవడం మనం చూశాం. అయితే వీటివెనుక రాజకీయ అం శాలు ఉండటమూ తెలిసిందే. కానీ, తాజాగా న్యాయవ్యవస్థకు ప్రతీక లాంటి న్యాయదేవత రూపురేఖలు, అంటే విగ్రహం రూపురేఖలు మారిపోయాయి. న్యాయస్థానాల అలంకరణలో భాగమైపోయిన ఈ విగ్రహం భారతీయ సంస్కృతిలో పదే పదే ప్రస్తావనకు వచ్చే అంశంగా మారింది. ప్రజల నిత్య వ్యవహారంలో ‘చట్టానికి కళ్లు లేవు’ వంటి వ్యక్తీకరణలు అందులో భాగమే. ఇప్పుడా విగ్రహం గత చరిత్ర అయిపోయే సూచన లు కనిపిస్తున్నాయి. సరికొత్త విగ్రహం తెరమీదకు రావడమే అందుకు కారణం. ఈ మార్పు వెనుక రాజకీయాలు గానీ, తీర్మానాలు గానీ లేవు.
సుప్రీంకోర్టు ఆవరణలో సీజేఐ డీవై చంద్రచూడ్ ఇటీవల ఆవిష్కరించిన నూతన న్యాయదేవత విగ్రహం మారుతున్న ఆలోచనా ధోరణులకు అద్దం పట్టింది. న్యాయదేవత ఆహార్యం, హస్త భూషణాలు మారిపోయాయి. ప్రాచీన యూరప్ తరహా వస్త్రధారణ పోయి అచ్చమైన భారతీయతకు ప్రతీక లాంటి చీరకట్టు వచ్చిచేరింది. ఒక చేతిలో త్రాసు అలాగే ఉన్నప్పటికీ రెండో చేతిలో ఉండే కత్తి రాజ్యాంగ గ్రంథంగా మారిపోయింది. అన్నింటికన్నా కొట్టొచ్చినట్టు కనిపించే మార్పు కండ్ల గంతలు కనుమరుగై పోవడం. మనకు పాత న్యాయదేవత విగ్రహ భావన బ్రిటిష్ వలస పాలకుల నుంచి వారసత్వంగా సంక్రమించింది. బ్రిటిషు వారు దానిని రోమన్ పురాణాల నుంచి తీసుకున్నారు. జస్టీషియా అనే దేవతకే రూపమిచ్చి న్యాయస్థానాల్లో నిలిపారు వారు. కండ్లకు గంతలు సమభావనకు ప్రతీక అని అంటారు. నిజానికి న్యాయవ్యవస్థ గుడ్డిదనే మధ్యయుగాల విమర్శల నుంచి గంతలు వచ్చాయనే వాదన ఉంది. ఇక త్రాసు ఇరుపక్షాల వాదనలను నిష్పాక్షికంగా తూకం వేసి తీర్పు చెప్పాలన్న భావనకు ప్రతీక. కత్తి అనేది న్యాయవ్యవస్థకు శిక్షించేందుకు గల అధికారాన్ని సూచిస్తుంది. కొత్త విగ్రహంలో కత్తి స్థానంలో రాజ్యాంగం రావడం అనేక అర్థాలు తెలియజేస్తున్నదని చెప్పవచ్చు. న్యాయ వ్యవస్థకు రాజ్యాంగమే సర్వోన్నతమనే భావన అందులో ఇమిడి ఉన్నది. ప్రస్తుత పరిస్థితుల్లో దీని ప్రాముఖ్యం ఏమిటో అందరికీ తెలిసిందే. ఇక గంతలు పోవడం విషయానికి వస్తే ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టు ‘మేం అన్నీ గమనిస్తున్నాం’ అని పదే పదే జారీ చేస్తున్న హెచ్చరికలకు సూచన కావచ్చు. ఇక ఎవరూ ‘న్యాయం గుడ్డిది’ అని అలవోకగా అనజాలరు.
స్వదేశీయతకు పెద్దపీట వేస్తూ తెచ్చిన మార్పులను స్వాగతించాల్సిం దే. అయితే, ప్రతీకల మార్పు కన్నా న్యాయవ్యవస్థ స్ఫూర్తిని సంరక్షించాల్సిన అవసరం ఎంతో ఉన్నది. పెండింగ్ కేసుల బెడద వెంటాడుతూనే ఉన్నది. అమాయకులైన అండర్ ట్రయల్స్ లక్షలాది మంది జైళ్లల్లో మగ్గుతున్నారు. సర్వోన్నత న్యాయస్థానం ఎంతగా నొక్కిచెప్తున్నా బెయి లు కన్నా జైలు వైపే వ్యవస్థ మొగ్గుతున్నది. న్యాయం సంపన్నులకే దక్కుతుంది, పేదోళ్లకు అందని పండుగానే ఉండిపోతున్నదనే విమర్శలూ ఉన్నాయి. ఇలాంటి జాడ్యాల తొలగింపు దిశగా అడుగులు పడితేనే మారిన విగ్రహానికి సార్థకత ఏర్పడుతుంది. విగ్రహం చేతిలో రాజ్యాంగం ఉన్నట్టుగానే ఆ రాజ్యాంగం సమకూర్చిన హక్కులకు అన్నివిధాలా రక్షణ లభించే రోజులు వస్తే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది?