ఆ మలేషియా ఏజెంట్ మీద మన్నువడా.. ఆన్ని నమ్ముకొని వోయినందుకు నా బతుకు పెనం మీంచి పొయ్యిల వడ్డట్టయ్యింది. పొయ్యంటే మతికొచ్చింది, మలేషియాలోని మలాక సిటీనే నా ఇలాక. అక్కడ అల్యూమినియం కంపెనీల పన్జేసేటోన్ని. నేను పొయ్యి కింద మంటవెడ్తనే పైన అల్యూమినియం కరిగి నీళ్ల లెక్క అయ్యేది. పొయ్యి నుంచి అచ్చే శెకకు నేన్గూడ మాడి మసయ్యేటోన్ని. ఆ కంపెనీలనే బువ్వ దిని, ఆ కంపెనీలనే నిర్దవోయేటోన్ని. పొద్దుగాళ్ల పోవుడు, పొయ్యిల కొర్కాసులు ఎగదోసుడు, పొద్దూకి రూంకు వచ్చి ఇంత సల్లవడి నడుమాల్సుడు. రోజిదే పని.
ఎప్పట్లెక్కనే ఆ రోజు గూడ అదే పనికి వొయిన. మజ్జాన్నం మూడు గొడ్తున్నది. అక్కడి సీఐడీ పోలీసులట, మా కంపెనీల దొంగలు వడ్డట్టే ఉర్కచ్చిర్రు. ఏ మన కోసం గా పోలీసులెందుకస్తరని నా పని నేన్జేసుకుంటున్న. ఖతం రానే అచ్చిర్రు నా దగ్గరికి పోలీసులు. ‘గురిజాల రాజేశ్వర్ నువ్వేనా’ అని మలయి భాషలడిగిర్రు. ‘నేనే’ అన్జెప్పిన. అంతే..‘పోదాం పా’ టేషన్కు అని నన్ను వట్కపోయిర్రి. నేనేం దొంగతనం జెయ్యలె, లేకుంటే మలేషియా మనిషిని మర్డర్ జెయ్యలె. మరె, పోలీసులు నన్నెందుకు వట్కపోయిర్రో తెలుసా..? దొంగ వీసా మీద అక్కడ బతుకుతున్ననట. ఆ విషయం అప్పటిదాన్క నాగ్గూడ తెల్వదు. ఏజెంటును నమ్ముకొని డబ్బు వేల రూపాలు ఆయన శేతిల వెడ్తే ఈ పనికి కుదిరిపిచ్చిండు.
నేనేం జెప్పినా పోలీసులు ఇన్లేదు. వాళ్లనుకున్న పన్జేసిర్రు. ఆ రోజు నాత్రంతా పోలీస్టేషన్లనే పండుకున్న గనీ నిర్దవడితే ఒట్టు. నా పెండ్లాం సత్తవ్వ, కొడుకు వినయ్, బిడ్డ మానసలే గుర్తురావట్టిర్రు. ‘మన కొడుక్కు పానం మంచిగలేదు, డాక్టర్లు ఆప్రీషన్ జేస్తనే మంచిదంటున్నరు’, ‘డాక్టర్లకన్న మనకెక్కువ ఎరుకనా? నేన్ పైసల్ పంపిస్తా, నువ్వేం రందివడకు. ముందుగాళ్ల వాన్నైతె దావకాన్ల షరీఖ్ జెయ్యి’మని అదేరోజు పొద్దున ఫోన్ల సత్తవ్వతోని జెప్పిన ముచ్చట యాదికొచ్చి కండ్ల పొంటి నీళ్లు వట వటా రాలవట్టినయి. నాత్రంత నిలవడ్డ కన్లు నిలవడ్డట్టే ఉన్నయి గని నిర్ద మాత్రం వట్టలె. కతం, తెల్లారనే తెల్లారె..
అరెస్టయిన ముచ్చట ఒక్కపారి ఫోన్జేసి చెప్తే మంచిగుండని పానం ఇంటిమొకాన గుంజింది. కనీ, మనకు ఫోన్ ఇచ్చేటోళ్లెవ్వల్లేరాయె! ఇంతల, దేవునిలెక్క రానే అచ్చిండు ఓ పెద్ద మనిషి. ఆ పెద్దాయన ఫోన్లకెళ్లి వినయ్‌కి ఫోన్జేసిన. ‘నాన్న.. ఇగొ, ఇప్పుడే ఆప్రీషన్ రూంలకు వోతున్న’ అని నా అరెస్టు ముచ్చట చెప్పకముందే వాడు, వాని గురించి చెప్పవట్టిండు. పోరడు బెంగటీలదిక్క అని ‘ఏం గాదు బిడ్డ, ధైర్నంగుండు, ఫోన్ అమ్మకియ్యి’మన్న. ఫోన్దీసుకున్న సత్తవ్వకు.. ‘నేను ఫోన్జేత్తలేనని రందివెట్టుకోకు, పోరగాండ్లు జాగర్త’ అని నేను అరెస్టయిన ముచ్చట జెప్పిన. ఆ ఫోన్లనే ఏడ్వవట్టింది సత్తవ్వ. ‘ఎహ్హె ఊకో.. ఏం గాదు, ఎందుకేడుస్తున్నవ్’ అని ధైర్నం జెప్పంగనే పోలీసాయన అచ్చి ఫోన్ గుంజుకున్నడు. తీస్కపొయి లాకప్లేసిండు.
మలేషియాల కేసు ఫైలయ్యేదాన్క లాకప్లేస్తరు. కేసు ఫైలయినంక జైలుకు పంపుతరు. లాకప్ నుంచి కోర్టుకు, కోర్టు నుంచి లాకప్‌కు పోలీసులు పదిహేడు రోజులు తిప్పిర్రు. ఒక లాకప్‌ల ఎనిమిది మంది ఉంటరు. లాకప్ మొత్తం శిమ్మశీకటి, ఒగని భాష ఒగనికి రాదు. పదిహేడు రోజుల తర్వాత కేసు ఫైలైంది. మమ్మల్ని ఇడ్శిపెడ్తదనుకున్న కోర్టు జైలుకు పంపింది. అమ్మో… అసొంటి కట్టం పగోనిగ్గూడ రావద్దు. ఆ జైలు ఎట్లుంటదంటే..? కోళ్ల ఫారం కన్న అటీనముంటది. శిమ్మశీకటి, గొర్లను గదా ఏసినట్టు ఒక్క ఫారంల ఎనభై మందినేసిర్రు. తిండీ, గిండీ అన్ని అన్లనే. నీళ్ల లెక్క ఉండే సాస్తోని రోజుకు రెండు పూటల బువ్వ సగం కడుపుకే వెట్టిర్రు. అన్ల కొంచెం ఎక్కువ బలమున్నోడు పళ్లెం గుంజుకొని తిన్నా మనం జేసేదేం ఉండదు. నేనొక్కన్నే గాదు, మొత్తం ఆరుగురుం, ఆర్నెళ్లు ఆ జైళ్లనే గడిపినం. ఐదుగురం నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూరోళ్లమైతే, పక్కూరు ఒకతనిది.
నెల.. రెణ్నెళ్లు.. మూణ్నెళ్లు… చూసీ చూసీ మా ఇంటి ఆడోళ్ల కండ్లు కాయలు గాసినట్టున్నయి. ఊరి లీడర్లను వట్టుకొని రాష్ట్రంల ఉన్న కాంగ్రెస్ పార్టీ, సంటర్ల ఉన్న బీజేపీ నాయకుల సుట్టు తిరిగీ తిరిగీ కాళ్ల చెప్పులనరిగినయట గనీ, వాళ్ల కండ్లళ్ల నీళ్లు మాత్రం కారుడాగలె. కాంగ్రెస్ మంత్రి సీతక్క, బీజేపీ ఎంపీ గోడం నగేశ్‌ల దగ్గరికి వొయి దరఖాస్తులు వెట్టుకుంటే, ఆ వార్త అన్ని పేపర్లల్ల అచ్చిందట గనీ, మేం మాత్రం మా ఇంటికి రాలె, మావోళ్లు మా కండ్లకు కనవడలె. ఇగ మా ఆడోళ్లకు వశపడక కేటీఆర్ సారైతనే మమ్మల్ని ఇంటికి తీస్కొస్తడని నమ్మి భూక్యా జాన్సన్ నాయక్ సార్ దగ్గర్కి వోయిర్రట. నాయక్ సార్ వీళ్లను కేటీఆర్ దగ్గర్కి తీస్కవోతే.. ‘మీవోళ్లను తెలంగాణకు తీస్కచ్చే బాధ్యత నాది’ అని కేటీఆర్ సార్ ఇమ్మతిచ్చిండట.
ఆర్నెళ్లు జైళ్ల గడిపినందుకో, ఏమో నా ఆరోగ్యం మొత్తం కరాబైంది. ఓ రోజు పొద్దున్నుంచి వెడితే మజ్జాన్నం దాన్క ఒగ కక్కుడు గాదు. బీపీ 190 దాకా వెర్గింది. మా పనైపోయింది. ఇగ సచ్చుడే గావచ్చు. మమ్మల్ని మావోళ్లకన్న సూపెడుతరో, సూపెట్టరో అని రోజు కుమిలి కుమిలిపోతున్నం. ఇంతల.. 2025 మార్చి 5వ తారీఖు నాడు మలేషియా జైళ్ల ఉన్న మా దగ్గర్కి జాన్సన్ నాయక్ సారొచ్చిండు. ఆయనను సూడంగనే మా ఆరుగురికి దుక్కమాగలె. ఏడ్సుకుంటచ్చి అమాంతం ఆయన కాళ్ల మీద వడ్డం. ‘రాజేశ్వరన్నా.. గిదేం పనే. మీరు గిట్లేడుస్తరా? మనకు కేటీఆర్ సారున్నడు. మిమ్మల్ని తెలంగాణకు తీస్కరమ్మని ఆయనే నన్ను మీ దగ్గర్కి తోలిండు’ అని చెప్పవట్టిండు. పాపం నాయక్ సార్ మా కోసం మలేషియాకు నాలుగు మాట్ల అచ్చిండట. ఎవ్వల్ని కల్సిర్రో, ఎంత కర్సు వెట్టుకున్నరో మాకేం తెల్వదు. మేం మాత్రం 2025, ఏప్రిల్ 17 నాడు జైళ్లకెళ్లి బైటికచ్చినం.
2025, మే 21 నాత్రి రెండు గంటలకు శంషాబాద్ ఏర్పోర్టుకు శేరుకున్నం. ఆ నాత్రి హోటళ్ల పండుకున్నం. సీన్ కట్జేస్తే.. మజ్జాన్నం ఒంటిగంట కొడుతున్నది. మా కారొచ్చి సక్కగ నందినగర్ల ఆగింది. మేం దిగంగనే నా పెండ్లాం పిల్లలొచ్చి మీదవడి ఒక్కటే ఏడ్సుడు. అందరం గల్సి కేటీఆర్ సార్ దగ్గర్కి వోయి రెండుజేతులా దండం బెట్టినం. కేటీఆర్ సార్ మమ్మల్ని గుండెలకత్తుకున్నడు. మా అవ్వతోడు జెప్తున్నా… మేం బతికి మళ్ల బట్టకడుతమని మాత్రం అనుకోలె. మాకు పునర్జన్మనిచ్చింది మాత్రం కేటీఆర్ సారే. అదే 2025, మే 21నాడు నాత్రి అందరికందరం ఇంటికి చేరుకున్నం.
-గడ్డం సతీష్ ,99590 59041