హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దిన ప్రయాణం గురించి మాట్లాడితే, రెండు పేర్లు తప్పనిసరిగా వినిపిస్తాయి. ఒకటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, రెండు పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ, ఐటీ, పరిశ్రమలశాఖ మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత హైదరాబాద్ కేవలం ఒక చారిత్రక నగరంగానే కాకుండా, ప్రపంచ పెట్టుబడిదారులకు గమ్యస్థానంగా నిలిచే సిటీగా మారింది. ఈ మార్పు ఒక్క రోజులో రాలేదు. అది స్పష్టమైన విజన్, ధైర్యమైన నిర్ణయాలు, నిరంతర కృషి ఫలితం. కేసీఆర్ కలలు కన్న బంగారు తెలంగాణలో హైదరాబాద్‌ను గ్లోబల్ బ్రాండ్‌గా మలిచే బాధ్యతను కేటీఆర్ తన భుజాలపై వేసుకొని ముందుకు నడిపించారు. తాను నిర్వర్తించిన మంత్రిత్వ శాఖలను తెలంగాణ భవిష్యత్తును నిర్మించే సాధనాలుగా చూశారు. అందుకే నేడు ప్రపంచ టెక్ దిగ్గజాలు హైదరాబాద్‌ను భారతదేశంలో అత్యంత విశ్వసనీయ గమ్యస్థానంగా గుర్తించాయి. అందుకే కేటీఆర్ హైదరాబాద్ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్కిటెక్ట్, హైదరాబాద్ గ్లోబల్ సిటీ అర్కిటెక్ట్ అని ఐటీ రంగం నుంచి ప్రశంసలు అందుకున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కేసీఆర్ విజన్ కార్యరూపం దాల్చేలా కేటీఆర్ అద్భుతమైన చురుకుదనం చూపించారు. హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టి సారించి, స్టార్టప్ స్టేట్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దారు. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్‌ను ఒక ప్రాధాన్యతా గమ్యస్థానంగా మార్చడమే లక్ష్యంగా అనేక అంతర్జాతీయ సమ్మిట్లు, కాన్ఫరెన్సులు నిర్వహించి, పాలసీలను సరళీకృతం చేశారు. ఫలితంగా 2014 నుంచి 2023 వరకు హైదరాబాద్ ఆర్థికం, సాంకేతికత, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో అపూర్వమైన వృద్ధిని సాధించింది.
కేటీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ ఐటీ రంగం అద్భుతంగా ఎదిగింది. ఐటీ ఎగుమతులు కొన్ని వేల కోట్ల స్థాయి నుంచి లక్షల కోట్ల స్థాయికి చేరాయి. 2014లో ఐటీ ఎగుమతులు సుమారు రూ.57,000 కోట్లుగా ఉంటే, 2023 నాటికి అవి రూ.2,72,000 కోట్లకు చేరుకున్నాయి. ఇది సుమారు ఐదు రెట్ల పెరుగుదల. ఉద్యోగాల సంఖ్య కూడా 3.23 లక్షల నుంచి 10 లక్షలకు పెరిగింది.
ఈ విప్లవాత్మక మార్పునకు ప్రధాన కారణం టీఎస్-ఐపాస్ పాలసీ. ఈ సింగిల్ విండో సిస్టమ్ ద్వారా పెట్టుబడిదారులు 15 నుంచి 30 రోజుల్లోనే అన్ని అనుమతులు పొందేవారు. ఈ పాలసీని కేటీఆర్ సరైన విధంగా అమలు చేయడం ద్వారా తెలంగాణను ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్‌లో దేశంలోనే ఉత్తమ స్థానంలో నిలిపారు. ప్రపంచ కంపెనీలు హైదరాబాద్ వైపు చూడడంతో అక్కడి నుంచి వేగం పెరిగింది. నీతి ఆయోగ్ కూడా ఈ పాలసీని దేశానికి ఉత్తమ మాడల్‌గా ప్రశంసించింది.
అమెజాన్ కంపెనీ ప్రపంచంలోనే అతి పెద్ద క్యాంపస్‌ను హైదరాబాద్‌లో స్థాపించింది. గూగుల్, మెటా, ఆపిల్, సేల్స్‌ఫోర్స్, ఉబెర్, మైక్రోసాఫ్ట్ వంటి గ్లోబల్ దిగ్గజాలు తమ అతి పెద్ద క్యాంపస్‌లను ఇక్కడే నిర్మించాయి. ఈ సంస్థలు తమ విస్తరణకు హైదరాబాద్‌ను ఎంచుకోవడానికి కారణం హైదరాబాద్‌పై ఏర్పడిన ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని కలిగించిన శక్తి కేటీఆర్.
ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేయడంలో కేటీఆర్ చేసిన కృషి అపూర్వమైనది. కేవలం ఐటీ మాత్రమే కాదు, స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను కూడా కేటీఆర్ కొత్త స్థాయికి తీసుకెళ్లారు. టీ-హబ్, వీ-హబ్, టీ-వర్క్స్ వంటి సంస్థలు యువతలో ఆవిష్కరణ శక్తిని పెంచాయి. జాబ్ కోసం వెతికే యువత కాదు, జాబ్‌లు సృష్టించే యువత కావాలి అని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ ప్రోత్సాహంతో టీ-హబ్ ప్రపంచంలోనే అతి పెద్ద టెక్నాలజీ ఇన్‌క్యుబేటర్‌గా ఎదిగింది. ఇది స్టార్టప్‌లకు మెంటార్షిప్, ఫండింగ్, అధునాతన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందించి వందలాది యూనికార్న్ కంపెనీలను సృష్టించింది.
స్కైరూట్ ఏరోస్పేస్, డార్విన్‌బాక్స్, జెనోటి, హైరేడియస్ వంటి సంస్థలు హైదరాబాద్‌లో పుట్టి ప్రపంచ స్థాయికి ఎదిగాయి. వీ-హబ్ ద్వారా మహిళా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సహించారు. టీ-వర్క్స్ ప్రోటోటైపింగ్ సదుపాయాలు దేశంలోనే అతిపెద్దవిగా మారాయి. టాస్క్ ద్వారా యువత స్కిల్స్ డెవలప్మెంట్కు తోడ్పడి ఉద్యోగాలకు సంసిద్ధులను చేశారు. ఈ అన్ని కార్యక్రమాలు కలిసి హైదరాబాద్‌ను అత్యంత విజయవంతమైన స్టార్టప్ స్టేట్ క్యాపిటల్‌గా మార్చాయి. కేటీఆర్ ప్రయత్నాలు యువతను ఉద్యోగులుగా కాకుండా ఉద్యోగాలు సృష్టించేవారిగా మార్చాయి.
మౌలిక సదుపాయాల కల్పనలో కూడా హైదరాబాద్ కొత్త రూపాన్ని చూసింది. మెట్రో రైలు, ఔటర్ రింగ్‌రోడ్డు, ఫ్లైఓవర్లు, లింక్ రోడ్లు, అండర్‌పాస్‌ల వంటి నిర్మాణాలు నగరాన్ని ఆధునిక మహానగరంగా తీర్చిదిద్దాయి. న్యూ హైదరాబాద్ అనే ఆలోచనతో నగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లాలని కేటీఆర్ ప్రయత్నించారు. సైక్లింగ్ ట్రాక్‌లు, సస్టెయినేబుల్ అర్బన్ ప్లానింగ్, గ్లోబల్ ఈవెంట్స్ ఇవన్నీ ఆయన ఆలోచనల్లో భాగం.
ఈ రోజు కేసీఆర్, కేటీఆర్ అధికారంలో లేకపోయినా, హైదరాబాద్‌పై ఆయనకు ఉన్న అంకితభావం తగ్గలేదు. ఇప్పటికీ ప్రపంచ దేశాలు తిరుగుతూ, పెట్టుబడిదారులతో సమావేశాలు నిర్వహిస్తూ, హైదరాబాద్ పేరు వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. అధికారంలో లేకపోయినా నగర భవిష్యత్తు గురించి మాట్లాడే నాయకులు చాలా అరుదు. కానీ కేటీఆర్ మాత్రం హైదరాబాద్‌ను తన వ్యక్తిగత బాధ్యతగా భావిస్తున్నట్టు కనిపిస్తున్నారు. విదేశీ వేదికలపై తెలంగాణ అవకాశాలను వివరించడం, గ్లోబల్ కంపెనీలతో సంబంధాలు కొనసాగించడం, యువతతో టెక్నాలజీ, భవిష్యత్తు పరిశ్రమల గురించి చర్చించడం కేటీఆర్‌లోని దీర్ఘకాలిక దృష్టికి నిదర్శనం.
ఇప్పుడు హైదరాబాద్ క్షీణత వైపు పయనిస్తున్నట్టు కనిపిస్తున్నది. ఒకప్పుడు వేగంగా పరుగెత్తిన హైదరాబాద్, ఇప్పుడు ట్రాఫిక్ సమస్యలు, నీటి కష్టాలు, పెట్టుబడుల మందగమనం, ఐటీ వృద్ధి నిలిచిపోవడం వంటి సమస్యలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా మార్చడం ఒక రాజకీయ నినాదం కాదు. అది ఒక దీర్ఘకాలిక నిర్మాణ ప్రక్రియ. ఇందులో కేటీఆర్ ఒక కీలక ఆర్కిటెక్ట్‌గా నిలిచారు. యువతతో కలిసిపోయే ఆయన శైలి, పెట్టుబడిదారులకు నమ్మకం కలిగించే కమ్యూనికేషన్, భవిష్యత్తును అంచనా వేసే దృష్టి ఆయనను ప్రత్యేక నాయకుడిగా నిలబెట్టాయి. అందుకే నేడు కూడా హైదరాబాద్ అభివృద్ధి గురించి చర్చ వస్తే, ఈ నగరాన్ని గ్లోబల్ బ్రాండ్‌గా మలచిన నాయకత్వం మళ్లీ అవసరం అనే భావన ప్రజల్లో వినిపిస్తున్నది. హైదరాబాద్ అభివృద్ధిలో కేటీఆర్ పాత్ర కేవలం ఒక మాజీ మంత్రిగా కాదు, నగరాన్ని భవిష్యత్తు వైపు నడిపించిన రూపకర్తగా నిలిచింది.
– మహేంద్ర తోటకురి