రాష్ట్ర గీతంగా ‘జయ జయహే తెలంగాణ’ను ఎంపిక చేయడంపై ఎవరికీ అభ్యంతరం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ గీతాన్ని రాష్ట్ర గీతంగా నిర్ణయించకముందే తెలంగాణ ప్రజానీకం ఈ పాటకు ప్రాణం పోశారు. అనేక సందర్భాల్లో నిత్యం పాడుకుంటున్నారు. వివాదం ఏమంటే మన పాటకు పరాయి స్వరాలు కూర్చడం. ‘ఆత్మలను పలికించేదే అసలైన భాష, ఆ విలువ కరువైపోతే అది వట్టి కంఠశోష’ అని అన్నారు మహాకవి సినారె. మన పాట మన నోట మన స్వరంలో పలికితే దాని అందం, దాని ఉద్దేశం వేరుగా ఉంటుంది. కవిగా అందెశ్రీ, సంగీత దర్శకునిగా కీరవాణి ఎవరికి వారు గొప్పవారు సందేహం లేదు. ఇది రాష్ట్ర గీతం. దీనికి స్థానికత, మట్టి పరిమళం, గుండెల్లో భక్తిభావం ఉట్టి పడాలి. పాట వింటుంటే నరనరాలు ఉప్పొంగి హృదయం ఆత్మగౌరవ పతాకై రెపరెపలాడాలి. ఇది ప్రధానోద్దేశం.
మరోటి ఏమంటే విభజన స్పష్టంగా జరిగిపోయింది. దశాబ్దం గడిచిపోయింది. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ తరం ఇంకా కనుమరుగు కాలేదు. అవమానాల గుర్తులు చెరిగిపోలేదు. అందెశ్రీని ఉద్యమకాలం నుంచి భుజాలకెత్తుకున్నది తెలంగాణ ప్రజలే. రేపు రాష్ట్ర గీతం అయినంక తరాలు మారిన తర్వాత ఆనాడు తెలంగాణలో సంగీతవేత్తలు కరువై మనవాడిని బాణీలు కూర్చమని అర్థించారని పాఠ్యపుస్తకాల్లో రాస్తారు. మన అందెశ్రీ కీర్తి, తెలంగాణ వైభవం ఏమైతుందో ఆలోచించాలి. ఇది ఏ పార్టీల సమస్య కాదు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష. పట్టింపులకు పోకుండా వివేకంతో ఆలోచించాలి. పరాయిని నమ్మితే పరాభవం తప్పదు.
– కోట్ల వెంకటేశ్వర రెడ్డి, 94402 33261