కోల్కతా ప్రభుత్వ వైద్య విద్యాసంస్థ ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ ఆవరణలో అత్యాచారం, ఆపై హత్య జరగడం అత్యంత శోచనీయం. కామాంధుల కర్కశత్వానికి ఓ యువ వైద్యురాలు బలైంది. చట్టాలు పదునెక్కినా దారితప్పిన మగవారి నుంచి మహిళలకు భద్రత లభించని పరిస్థితులు ఇంకా మన సమాజంలో తచ్చాడుతూనే ఉన్నాయని ఈ సంఘటన సూచిస్తున్నది. సమాజం తలదించుకోవాల్సిన ఈ ఘటనపై సహజంగానే తీవ్రస్థాయిలో ప్రతిస్పందనలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా బెంగాల్లో నిరసనలు పెల్లుబుకుతున్నాయి. ఒక వ్యక్తి మాత్రమే లైంగికదాడిలో పాల్గొన్నాడని ముందుగా వార్తలు వెలువడ్డాయి. వైద్యపరీక్షల్లో సామూహిక లైంగిక దాడి జరిగినట్టు ఆధారాలు లభించడంతో జనాగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. నిరసనలు చాలావరకు శాంతియుతంగానే జరుగుతున్నప్పటికీ అక్కడక్కడా హింసాకాండ చోటుచేసుకున్నది.
ఘటనా స్థలంలో వైద్యులు బీభత్సం సృష్టించడంతో పోలీసులు లాఠీచార్జీ, బాష్పవాయు గోళాలు ప్రయోగించాల్సి రావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నది. దాడిలో ఎమర్జెన్సీ వార్డు పూర్తిగా ధ్వంసమైంది. ఈ దాడిలో నేరస్థలంలోని కీలక సాక్ష్యాధారాలకు నష్టం వాటిల్లినట్టు పోలీసులు చెప్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై రాజకీయాల నీలినీడలు ప్రసరించడం శోచనీయం. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల పాతవైరానికి కొత్త ముడిసరుకుగా ఈ ఘటన మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. మమత నేతృత్వంలోని బెంగాల్ ప్రభుత్వానికి ఈ ఉదంతం ఓ అగ్నిపరీక్షలా మారింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి, రాష్ట్రంలోని తృణమూల్ సర్కారుకు మధ్య సంబంధాలు ఉప్పు-నిప్పులా కొనసాగుతున్న నేపథ్యంలో హత్యాచార ఉదంతం ఆ వైరానికి ఆజ్యం పోస్తున్నది. రాష్ట్ర పోలీసులు గడువులోగా కేసును పరిష్కరించకపోతే కేసును సీబీఐకి అప్పగిస్తానని సీఎం మమత ప్రకటించిన నేపథ్యంలో ఆ గడువు కంటే ముందుగానే హైకోర్టు జోక్యంతో కేసు కేంద్ర సంస్థ చేతుల్లోకి పోయింది.
ఈ ఘటన విషయంలో ప్రభుత్వం, పోలీసులు స్పందించిన తీరు, నిరసనకారులతో టీఎంసీ నేతలు వ్యవహరిస్తున్న శైలి ఏ మాత్రం ఆమోదయోగ్యంగా లేదనే విమర్శలు వినవస్తున్నాయి. పోలీసులు సకాలంలో స్పందించలేదనే ఆరోపణలూ వచ్చాయి. చివరికి కేసు కేంద్ర దర్యాప్తు సంస్థ చేతికి వెళ్లడం కీలక మలుపు. దీంతో టీఎంసీ ప్రభుత్వం మొత్తంగా, విశేషించి సీఎం మమత ఆత్మరక్షణలో పడ్డట్టుగా కనిపిస్తున్నది. బెంగాల్లో పట్టుకోసం కేంద్రంలోని బీజేపీ సర్కారు దొరికిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ ఉదంతం విషయంలోనూ అదే జరుగుతున్నది. ప్రధాని మోదీ ఎర్రకోట ప్రసంగంలో మహిళలపై జరిగే నేరాలను ప్రస్తావించడం గమనార్హం. జరిగిన ఘటన ఘోరాతిఘోరమైనదనే విషయంలో రెండో అభిప్రాయానికి తావులేదు. ఘటనతో సంబంధమున్న నేరస్థులందరినీ పట్టుకుని, న్యాయస్థానంలో నిలబెట్టి శిక్షలు వేయించాల్సిన అవసరమున్నది. సీబీఐ సకాలంలో పారదర్శకంగా, నిష్పాక్షికంగా దర్యాప్తు జరిపితేనే అది సాధ్యమవుతుంది. మరి సీబీఐకి అలాంటి చరిత్ర ఉన్నదా?