కాంగ్రెస్ ఎన్నికల హామీల గురించి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలను విన్నప్పుడు, ఆయన ఎంత నిజాయితీగా మాట్లాడారో కదా అనిపించవచ్చు. కానీ, తనకు ఎంతమాత్రం నిజాయితీ లేదని రెండు విషయాలను గమనించినప్పుడు అర్థమవుతుంది. ఒకటి, సరిగా మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అక్కడ మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని నిలిపివేసే అవకాశమున్నట్లు సూచించటంతో, ఆ ప్రభావం ఈ రెండు రాష్ర్టాలలో తామిచ్చిన హామీల విశ్వసనీయతపై ఎక్కడ ప్రభావం చూపగలదోనని ఆయన భయపడుతున్నారు. అంతే తప్ప, అబద్ధపు హామీలు ఇవ్వటం పట్ల యథాతథంగా అభ్యంతరమేమీ లేదు. రెండు, బడ్జెట్‌కు వీలుపడని హామీలివ్వటం సరికాదనే అభిప్రాయం ఆయనకు నిజంగానే ఉన్నట్లయితే, ఆ మాట హిమాచల్, కర్ణాటక, తెలంగాణ, హర్యానా ఎన్నికల సమయంలోనే గాక, ప్రస్తుత మహారాష్ట్ర, ఝార్ఖండ్ మ్యానిఫెస్టోల విషయంలోనూ అది ముందుగానే కన్పించేది. ఖర్గే నిజాయితీ లేని నాయకుడనటం అందువల్లనే.
ఆ విధంగా తప్పన్నది బడ్జెట్లకు అలవికాని హామీలు ఇవ్వటంలో లేదు. వాటిని ఉపయోగించుకొని అధికారానికి రావటంలో లేదు. అమలు చేయకుండా ప్రజలను మోసగించటంలో లేదు. ఒకవైపు మోసగిస్తూనే మరిన్ని అలవికాని అబద్ధపు హామీలు హర్యానాలో ఇవ్వటంలో లేదు. అక్కడ అవి పని చేయకున్నా మహారాష్ట్ర, ఝార్ఖండ్లలో పని చేయవచ్చునని ఆశించటంలో లేదు. పోలింగుకు కొద్దిరోజుల ముందు శివకుమార్ అట్లా మాట్లాడటంలో మాత్రమే ఎక్కడ లేని తప్పంతా వచ్చిపడింది. ఇంతకు ముందటి అలవికాని హామీలు తమకు అధికారాన్ని తెచ్చిపెట్టినందున పార్టీ అధ్యక్షునికి ఎంతో సంతృప్తి కలిగింది. అటువంటి హామీల అమలు సాధ్యం కాదని ఎంతో అనుభవజ్ఞుడైన ఆయన అప్పుడే అర్థం చేసుకోలేదని నమ్మలేం. పైగా, సాధ్యం కాదన్న అంచనాలను ఆర్థిక నిపుణులు అప్పుడే వేసి హెచ్చరించారు కూడా. అయినప్పటికీ ఆయనగాని, తమ అధినేతలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గాని అటువంటి మోసాలు తగదని నివారించలేదు. పైగా అటువంటి మ్యానిఫెస్టోలను ఆశీర్వదించి, గ్యారెంటీ పత్రాలను బహిరంగ సభలలో స్వయంగా విడుదల చేసి, బాండ్ పేపర్లపై ఇంటింటికి పంపిణీ చేయించారు.
అదంతా ఎందుకు? ఏమి చేసైనా సరే అధికారానికి వచ్చి తీరాలన్న కోరిక తమను దహించివేస్తున్నది గనుక. పార్టీని రాజమార్గంలో నడిపి ప్రజల విశ్వాసాన్ని పొందే సమర్థత, నిజాయితీ తమకు ఎప్పటినుంచో లేవు గనుక. ఇప్పటికీ ఆ లక్షణాలను తిరిగి సంపాదించలేదు గనుక. ఇప్పుడు హామీలు తిరగబడి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కల్లోలం చేస్తున్నట్లు ఖర్గే స్వరాష్ట్రమైన కర్ణాటకలో కొంతకాలం నుంచే అర్థమవుతున్నది. ఆ విషయమై స్వయంగా అక్కడి ప్రభుత్వ బాధ్యులే తరచూ మాట్లాడుతూ వస్తున్నారు. శివకుమార్ అన్నది ఆ క్రమంలో తాజాది మాత్రమే. తెలంగాణ పరిస్థితి కూడా అదే. అందరి మాటల సారాంశం ఒకటే. అలవికాని హామీలను అమలుపరచలేకపోతున్నాము.
అందుకు తగిన నిధులు లేవు. ఈ ఖర్చుల వల్ల అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగటం లేదని. ఇదంతా ఢిల్లీలో అందరికీ తెలుసు. అయినప్పటికీ తోడుదొంగల వలె, లేదా తేలు కుట్టిన దొంగల వలె, ఇంతకాలం కిక్కురుమనలేదు. ఇప్పుడు ఝార్ఖండ్‌ను అట్లుంచినా మహారాష్ట్ర ప్రతిష్టాత్మకంగా మారింది. అక్కడి పరిస్థితులు కాంగ్రెస్‌కు అనుకూలంగా కనిపిస్తున్నాయి. అందుకే, హిమాచల్‌లో 10, కర్ణాటకలో 5, తెలంగాణలో 6 తరహాలో అక్కడ 5 గ్యారెంటీలు ప్రకటించారు. సరిగా ఆ దశలో శివకుమార్ మాటలు పిడుగు వలె వచ్చి పడ్డాయి. హిమాచల్, కర్ణాటక, తెలంగాణ హామీలు అమలు కావటం లేదన్న ప్రచారం హర్యానాలో ఓటర్లపై ప్రభావం చూపినందున, అదే ప్రచారం ఇప్పుడు మహారాష్ట్రను ప్రభావితం చేయగలదన్న జంకు ఖర్గేకు ఏర్పడినట్లు తన మాటలు స్పష్టంగా చెప్తున్నాయి. ఒకవేళ అక్కడివారు నమ్మి మోసపోయేందుకు సిద్ధపడి తమను గెలిపిస్తే మాత్రం ఆయనకు ఎటువంటి ఆక్షేపణ ఉండదు. ఇవే మోసాలు మునుముందు ఇతర ఎన్నికలలో చేయగలమనే ధీమా లభిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే కాంగ్రెస్ అధ్యక్షునిది కేవలం వంచన.
కాంగ్రెస్ గ్యారెంటీల వంచనలు తెలంగాణ ప్రజలకు అర్థం కావటం ఇప్పటికే మొదలైనందున, ఇతర రాష్ర్టాలలో జరుగుతున్నదేమిటో వారికి ఇంకా బాగా అర్థం కాగలదు. ఇక్కడ అధికారానికి కాంగ్రెస్ వచ్చి కేవలం మరి రెండు రోజుల్లో (డిసెంబర్ 7) పదకొండు నెలలు పూర్తవుతాయి. ఏడాది అయ్యేందుకు ఒకే నెల మిగిలి ఉంటుంది.
కాంగ్రెస్ గ్యారెంటీల వంచనలు తెలంగాణ ప్రజలకు అర్థం కావటం ఇప్పటికే మొదలైనందున, ఇతర రాష్ర్టాలలో జరుగుతున్నదేమిటో వారికి ఇంకా బాగా అర్థం కాగలదు. ఇక్కడ అధికారానికి కాంగ్రెస్ వచ్చి కేవలం మరి రెండు రోజుల్లో (డిసెంబర్ 7) పదకొండు నెలలు పూర్తవుతాయి. ఏడాది అయ్యేందుకు ఒకే నెల మిగిలి ఉంటుంది. 100 రోజుల గ్యారెంటీతో బాండ్ పేపర్లపై వారు ఇంటింటికి తిరిగి మరీ పంచిన హామీ పత్రాలను, ఏడాది గడువుతో ఇచ్చిన వాటినీ ఒకసారి ఎదుట ఉంచుకొని చూస్తే, వివిధ తరగతుల ప్రజలకు కనిపించేదేమిటి? ఇచ్చిన హామీలన్నీ తు.చ. తప్పకుండా అమలు కావాలనటం లేదు. ప్రయత్నించినా కొన్ని చేయలేకపోవచ్చు.
అది ప్రజలు అర్థం చేసుకోగలరు. కానీ, వాస్తవంగా జరుగుతున్నదేమిటనేది ప్రశ్న. ప్రజల ఎదుట 6 గ్యారెంటీలలో భాగమైన 13 అంశాలతో పాటు, అధికారానికి వచ్చిన ‘వెంటనే’ రూ.2 లక్షల రుణమాఫీ అనే 14వ అంశం, ఏడాదిలోగా 2 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలనే 15వ అంశం ఉన్నాయి. ఇదిగాక, 2వ గ్యారెంటీలోని పంట బోనస్ అంశాన్ని వారే సవరించి, వరితో పాటు అన్ని పంటలకూ బోనస్ అని ప్రకటించారు. ఏడాది కాలం మరొక నెలలో ముగుస్తున్నందున, ఏడాది గడువుతో గల ఇతర హామీలను చూస్తే, మొదటి ఏడాదిలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బ్యాక్‌లాగ్‌ల భర్తీ, ప్రతి సంవత్సరం జూన్ 2 నాటికి అన్ని శాఖలలోని ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి సెప్టెంబర్ 17లోపు నియామకాల పూర్తి, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేవరకు ప్రతి నెల రూ.4,000 నిరుద్యోగ భృతి, ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లో కులగణన, రిజర్వేషన్లు, ప్రతి ఆటో డ్రైవర్‌కు సంవత్సరానికి రూ.12,000 ఆర్థిక సహాయం, ప్రతి నిరుపేద ఆడబిడ్డ వివాహానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయంతో పాటు ఇందిరమ్మ కానుకగా తులం బంగారం వంటివి ఉన్నాయి.
ఇక 100 రోజుల గడువుతో 6 గ్యారెంటీలలోని 13 అంశాలలో మహిళలకు ప్రతి నెల రూ.2500, రూ.500కు గ్యాస్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రైతులకూ కౌలు రైతులకూ ఎకరానికి రూ.15,000, వ్యవసాయ కూలీలకు రూ.12,000 వరి (ఇతర పంటలకు) క్వింటాలుకు రూ.500 బోనస్, ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఇల్లులేని వారికి ఇంటి స్థలంతో పాటు రూ.5 లక్షలు, ఉద్యమకారులకు 250 చ.గ. ఇంటి స్థలం, విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూళ్లు, పింఛన్లను రూ.4,000కు పెంచటం, రూ.10 లక్షల రాజీవ్ ఆరోగ్య శ్రీ బీమా అనేవి ఉన్నాయి.
ఈ విధంగా గ్యారెంటీలు అనకుండా ఇచ్చిన ఇతర హామీలు ఉన్నాయి గానీ వాటి ప్రసక్తి తేవటం లేదు. ఈ జాబితాలన్నీ సుదీర్ఘమైనవే అయినప్పటికీ ప్రజలకు వెంటనే అందుబాటులో ఉండకపోవచ్చు గనుక, అట్లాగే 100 రోజులు అనే ఒక గడువు దాటిపోయి మరొక 230 రోజులు గడవటం, ఇంకొక నెల దాటితే ఏడాది పూర్తికానుండటం దృష్ట్యా ఈ జాబితాలను ప్రజల పరిశీలన కోసం రాయటం
అవసరమవుతున్నది.
వీటిలో పూర్తిగా అమలైనవి ఏవో, సగం సగం అయినవి ఏవో, అసలు కానివి ఏవో, దేని అమలు గురించి ప్రభుత్వం ఏమి చెప్తున్నదో, అసలేమీ చెప్పకుండా మౌనం వహిస్తున్నదో, అడిగినా దాటవేస్తున్నదో, రోజుకొక విధంగా మాట్లాడుతున్నదో, ముఖ్యమంత్రీ ఇతర మంత్రులూ తలకొక రకంగా ఏమేమి అంటున్నారో, ఏ విషయాలు అని కూడా అనలేదంటున్నారో, అడిగిన ప్రజల పట్ల మంత్రులు, కాంగ్రెస్ నాయకులు, వారి అనుచరులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో అన్నింటినీ తెలంగాణ సమాజం గమనిస్తూనే ఉంది. మాట్లాడుకుంటూనే ఉంది. అందువల్ల ఒక్కొక్క హామీ అమలు వివరాలలోకి ఇక్కడ వెళ్లటం లేదు. హామీలపై ఇప్పుడు జ్ఞానోదయమైనట్లు నటిస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుల వారు, ఇప్పటికీ తమకేమీ తెలియనే తెలియదన్నట్లు దిక్కులు చూస్తున్న సోనియా, రాహుల్, ప్రియాంకలు, హామీల గురించి తెలంగాణ సభలలో ఏమి మాట్లాడారో అప్పటి వీడియోల అద్దంలో తమ ముఖాలు తాము చూసుకోవటం మంచిది.
– టంకశాల అశోక్