గత ఎనిమిదేండ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న లోపభూయిష్టమైన, పేలవమైన ఆర్థిక విధానాల కారణంగా దేశ ఆర్థికవ్యవస్థ కోలుకోలేని స్థితికి చేరుకున్నది. రూపాయి విలువ రోజురోజుకూ పతనమవుతున్నది. దీని ప్రభావం మనం దిగుమతి చేసుకునే చమురు, బంగారం, బొగ్గు తదితర వస్తువులపై తీవ్రంగా పడుతున్నది. ఫలితంగా చమురు ధరలు సామాన్య ప్రజలకు అందనంత ఎత్తుకు చేరుకున్నాయి. ఇదిలాగే కొనసాగితే భవిష్యత్తులో మన పొరుగు దేశాలైన శ్రీలంక, పాకిస్థాన్, భూటాన్ తరహాలో మన దేశం కూడా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకునే ప్రమాదం ఉన్నది.
స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి 2014 వరకు ఉన్న ప్రభుత్వాలు రూ.50 లక్షల కోట్ల అప్పులు చేస్తే, మోదీ ప్రధాని అయిన ఈ 8 ఏండ్లలో దాదాపు రూ.వంద లక్షల కోట్లు అప్పు చేశారంటే ఆయన పాలనాతీరును అర్థం చేసుకోవచ్చు. 70 ఏండ్ల నుంచి దేశ ప్రజల సంపద, వారి రెక్కల కష్టంతో నిర్మించుకున్న ప్రభుత్వరంగ సంస్థలైన రైల్వే, ఎల్ఐసీ సహా వివిధ సంస్థలను ప్రైవేటుపరం చేసి మోదీ ప్రభుత్వం సొమ్ము చేసుకుంటున్నది. ఈ సొమ్మును దేశంలో పేద, మధ్య తరగతి ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ఉపయోగించకపోగా, గుజరాత్, దాని చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన పిడికెడు మంది బడా పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం చేకూర్చి, వారి సంపదను వందల రెట్లు పెంచింది.
భారతావని ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు సమర్థ నాయకత్వం అవసరం. దూరదృష్టితో దేశాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక, ముందుచూపు కలిగిన నాయకుడి కోసం దేశం ఎదురుచూస్తున్నది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటికి రూపాయి విలువ డాలర్‌తో సమానంగా ఉండేది. గడిచిన 75 ఏండ్లుగా ఈ దేశాన్ని పాలించిన రెండు ప్రధాన పార్టీలు డాలర్‌ను అమాంతం రూ.80కి చేర్చాయి. అంతర్జాతీయ వాణిజ్యం, రుణాలు, పెట్టుబడులు, దిగుమతులు అన్నీ డాలర్లలో జరుగుతాయి. దాంతో డాలర్‌తో రూపాయి మారకం అనేది దేశ ఆర్థికవ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపెడుతుంది. ఎగుమతుల కన్నా దిగుమతులు అధికంగా ఉండడంతో ఆర్థిక సూచీ తగ్గుతూ వాణిజ్యలోటు క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఎగుమతుల విలువ పదినెలలుగా ప్రతి నెల తగ్గుతూ వస్తోంది.
2012 మే 31న పెట్రోల్ ధర రూ.80కు చేరినందుకు నిరసనగా బీజేపీ దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. అప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో చమురు బ్యారల్ ధర 122 డాలర్లు. ప్రస్తుతం బ్యారెల్ ముడిచమురు ధర 105 డాలర్లు మాత్రమే. కానీ పెట్రోల్, డీజిల్ ధరలు వంద దాటాయి. ఇది భారతీయ జనతా పార్టీ ద్వంద్వనీతికి నిదర్శనం. చమురుపై కేంద్రం పన్నులు విపరీతంగా పెంచడం వల్ల ఆ ప్రభావం వ్యవసాయం, రవాణా, ప్యాకింగ్ తదితర అన్ని రంగాలపై తీవ్రంగా పడింది. గడిచిన ఎనిమిదేండ్లుగా కేంద్రం ఈ దేశ ప్రజల నుంచి సుమారు రూ.28 లక్షల కోట్లు వసూలు చేసింది. ఒక సగటు భారతీయుని సగం సంపాదన కేవలం ఇంధన వినియోగానికి ఖర్చు కావడం కేంద్ర అసమర్థ ఇంధన విధానాన్ని తెలియజేస్తున్నది. మన పొరుగు దేశాల కంటే మన దేశంలోనే ఇంధన ధర ఎక్కువ. చివరికి మన దేశం దగ్గర పెట్రోల్ కొనుక్కొని అమ్ముకునే నేపాల్‌లో కూడా మన కంటే రూ.20 తక్కువగా అమ్ముతారు. గత ఎనిమిదేండ్లుగా మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వ హయాం లో సామాన్యుడి జీవన ప్రమాణం తగ్గుతూ వస్తున్నది. చమురు ధరలను నియంత్రించకపోతే అన్నిరకాల నిత్యావసర వస్తువుల ధరలు అదుపులోకి వచ్చే పరిస్థితి లేదు. ఇదంతా పక్కనబెట్టిన బీజేపీ అధికారంలోకి వచ్చిందే తడవుగా మతం ఆధారంగా ప్రజలను నిట్టనిలువునా విడదీస్తున్నది. వారి సున్నితమైన మనోభావాలను దెబ్బతీసి, ప్రజల మధ్య మత విద్వేషాలను రెచ్చగొడుతున్నది. పలు రాష్ర్టాల్లోని ప్రజలు బీజేపీని తిరస్కరించి ప్రాంతీయ పార్టీలకు పట్టం కడితే ఆ ప్రభుత్వాలను అన్ని విధాలుగా వేధిస్తున్నది. కాబట్టి మనదేశంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.
దేశ ప్రజల మనోభావాలు గమనించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యామ్నాయ రాజకీయ నమూనాను తయా రుచేస్తున్నారు. కేసీఆర్ ప్రత్యామ్నాయ రాజకీయ ఆలోచనా విధానాన్ని దేశంలోని ప్రాంతీ య పార్టీలన్నీ బలపరచాలి. తద్వారా అవినీతి పాల న నుంచి, మతోన్మాదశక్తుల నుంచి దేశ ప్రజలను రక్షించినవారవుతారు. కేసీఆర్ తెలంగాణ భూమి పుత్రుడు. తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించేందు కు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఆ ఉద్యమాన్ని ప్రజాస్వామ్యయుతంగా నడిపించి, సరికొత్త పుంతలు తొక్కించి, చరిత్ర సృష్టించారు. తెలంగాణ ఏర్పాటును ఒక అనివార్యతగా చేసి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించారు. తెలంగాణ ఏర్పాటైన తరువాత ప్రజాభీష్టం మేరకు ముఖ్యమంత్రి పదవి చేపట్టి దేశంలో మునుపెన్నడూ చూడని అభివృద్ధి, సంక్షేమాలను సమపాళ్లలో రంగరించి, ఆదర్శవంతమైన పాలనను కొనసాగిస్తున్నారు. రాష్ట్రం లో విద్యార్థులు, కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, సామాన్య ప్రజలు ఏ విధంగా సంతోషంగా ఉన్నారో అదేవిధంగా దేశ ప్రజలంతా ఉండాలని కేసీఆర్ ఆకాంక్ష.
తన అసమాన పోరాటం ద్వారా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా ప్రజలకు సుపరిచితుడైన ఉద్యమ నాయకుడు కేసీఆర్. ఇటువంటి నాయకుడు ప్రస్తుతం దేశంలో మరే పార్టీకీ లేరు. కేసీఆర్‌కు దేశానికి నాయకత్వం వహించే అవకాశం లభిస్తే డబుల్ ఇంజిన్, సింగిల్ ఇంజిన్ ప్రభుత్వాలు అని చూడకుండా యావత్ దేశాన్ని సమదృష్టి తో చూస్తారు. అధిక ధరలు నియంత్రిస్తారు. ఆయన నేతృత్వంలో అవినీతి, ఆకలిచావులు, అసమానతలు లేని ఒక నవీన అభ్యుదయ భారతదేశ నిర్మాణం జరుగుతుంది. తెలం గాణ రథసారథి భారతదేశ రథసా రథి కావాలి.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటికి రూపాయి విలువ డాలర్‌తో సమానంగా ఉండేది. గడిచిన 75 ఏండ్లుగా ఈ దేశాన్ని పాలించిన రెండు ప్రధాన పార్టీలు డాలర్‌ను అమాంతం రూ.80కి చేర్చాయి. ఒక సగటు భారతీయుని సగం సంపాదన కేవలం ఇంధన వినియోగానికి ఖర్చు కావడం మోదీ సర్కారు అసమర్థ ఇంధన విధానాన్ని తెలియజేస్తున్నది. మన పొరుగు దేశాల కంటే మన దేశంలోనే ఇంధన ధర ఎక్కువ. చివరికి మన దేశం దగ్గర పెట్రోల్ కొనుక్కొని అమ్ముకునే నేపాల్‌లో కూడా మనకంటే రూ.20 తక్కువగా అమ్ముతారు.
– తుంగ బాలు 9985930246 
(వ్యాసకర్త: M.Sc. (Ph.D.), పరిశోధక విద్యార్థి ఓయూ)