చరిత్రను సృష్టించిన మహనాయకుడు కేసీఆర్. ఆ చరిత్రను మలినం చేయాలని, కేసీఆర్ ప్రతిభను తగ్గించాలని చూసిన చరిత్రహీనులు విఫలమయ్యారు. ఒక ప్రజాశక్తితో ఎదిగిన నాయకుడు కేసీఆర్. కేసీఆర్ పరపతిని తగ్గించాలనుకోవడం ప్రత్యర్థులకు ఒక చిలిపి వికృతక్రీడ మాత్రమే. కేసీఆర్ రాజకీయ ప్రయాణం ఒక సాధారణ రాజకీయం లెక్క కాదు. తెలంగాణ అస్తిత్వమే ప్రశ్నార్థకంగా ఉన్న కాలంలో.. ‘తెలంగాణ రాష్ట్రం రావాలి’ అని స్పష్టంగా, ధైర్యంగా చెప్పిన అరుదైన నాయకుడు. ప్రజలను చైతన్యపరిచారు. ఉద్యమాన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్లారు. సకల జనులను ముందుండి నడిపించారు. నిర్లక్ష్యానికి గురైన ప్రాంతానికి రాజకీయ అస్తిత్వాన్ని సాధించారు. రాష్ర్టాన్ని సాధించి, ఉద్యమ నాయకుడే పాలకుడిగా మారిన అరుదైన ఉదాహరణగా నిలిచారు. రాష్ర్టావతరణ తర్వాత కూడా తెలంగాణ ఆత్మను పాలనలో ప్రతిబింబించేందుకు పాటుపడ్డారు. నీటి ప్రాజెక్టులు, సాగు విస్తరణ, రైతు సంక్షేమం, సంక్షేమ, అభివృద్ధి పథకాలెన్నో. ప్రజల అవసరాల నుంచి పుట్టిన విధానాలే.
బీఆర్ఎస్ పాలనలో (2014-2023) తెలంగాణ రాష్ట్రం ఆర్థిక, వ్యవసాయ, సాగునీరు, సాంకేతిక రంగాలలో గణనీయమైన ప్రగతిని సాధించింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పదేండ్ల కాలంలో జరిగిన ప్రధాన అభివృద్ధి పనులు, సాధించిన విజయాలు చరిత్రలో సుస్థిరంగా నిలిచే ఉంటాయి. హైదరాబాద్ నడిమధ్యన కేసీఆర్ నిర్మించిన అత్యంత విశాలమైన సచివాలయ భవనంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి పాలన చేస్తున్నారంటే ఆయనకు కేసీఆర్‌ను విమర్శించే అర్హత లేదు. అంతే కాకుండా కేసీఆర్ పాలనలో సాధించిన ప్రగతి ఫలాలను కాంగ్రెస్ సర్కార్ అనుభవిస్తూ తమ పాలనలోనే అభివృద్ధి జరిగిందని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉన్నది.
తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం 2014-15లో రూ.1,24,104 ఉండగా, 2023-24 నాటికి రూ.3,47,714కు పెరిగింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ రూ.5.05 లక్షల కోట్ల నుంచి రూ.14.61 లక్షల కోట్లకు పెంచిన చరిత్ర బీఆర్ఏస్దే. తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వపాలనలో ఐటీ ఎగుమతులు రూ.56,000 కోట్ల నుంచి రూ.2.41 లక్షల కోట్లకు చేరాయి. ఐటీ ఉద్యోగాలు 3.23 లక్షల నుంచి 10 లక్షలకు పైగా పెరిగాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాలు హైదరాబాద్‌లో తమ అతిపెద్ద క్యాంపస్‌లను కేసీఆర్ పాలనలోనే ఏర్పాటు చేయడం విశేషం. ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీస్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా పరిగణించే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన అపరభగీరథుడు కేసీఆర్ రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు దేశంలోనే మొదటిసారిగా రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది. రెడు పంటలకు కలిపి ఎకరాకు రూ.10,000 చొప్పున వేలాది కోట్ల రూపాయలను రైతులకు కేసీఆర్ అందజేశారు. రైతు కుటుంబాలకు భరోసా కల్పించేందుకు రూ.5 లక్షల ఉచిత రైతు బీమా సౌకర్యం కల్పించిన ఆపద్భాంధవుడు కేసీఆర్.
ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలపడం కేసీఆర్ ఘనతనే. మిషన్ భగీరథ కింద రాష్ట్రంలోని కోటి గృహాలకు సురక్షితమైన తాగునీరు అందించే లక్ష్యం పూర్తి చేసిన మానవీయ పాలకుడు కేసీఆర్. మిషన్ కాకతీయలో భాగంగా చిన్న తరహా నీటిపారుదలలో చెరువులను పునరుద్ధరించడం ద్వారా భూగర్భ జలాలను పెంచారు. కల్యాణలక్ష్మి / షాదీ ముబారక్ పథకం కింద నిరుపేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహం కోసం ఆర్థిక సాయం అందించారు. ఆరోగ్య రంగంలో బస్తీ దవాఖానాలు, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ వంటి పథకాలతో సేవలను ప్రజలకు చేరువ చేశారు. 24 గంటల కరెంటు సరఫరాతో వ్యవసాయానికి, గృహ అవసరాలకు నాణ్యమైన విద్యుత్తు
టీ-హబ్ (T-Hub): హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ సెంటర్ (T-Hub) ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో తెలంగాణ ఒక వెనుకబడిన రాష్ట్రం నుంచి దేశంలోనే అత్యధిక వృద్ధి రేటు సాధించిన రాష్ట్రంగా ఎదిగిందని ఈ గణాంకాలు చెప్తున్నాయి. కేసీఆర్ అనే మూడు అక్షరాలు జై తెలంగాణ యుద్ధ నినాదం, దశాబ్దాల ఆకాంక్షల ప్రతిధ్వని, తెలంగాణ ఆత్మగౌరవ గర్జన. కేసీఆర్ అంటే.. ఉద్యమ స్ఫూర్తికి ప్రతిరూపం, తెలంగాణ ప్రజల గుండెల్లో నిత్య సూర్యోదయం. ఉద్యమంలో, పాలనలో సాధించిన ఫలితాలే నిదర్శనం.
కేసీఆర్ ఒక ఉద్యమం, ఒక విజన్, యుగ ప్రభంజనం.ఆయన పాలన ఒక చరిత్ర. రాజకీయాలు ఉన్నంతవరకు కేసీఆర్ పాలన చరిత్ర ఎప్పటికీ నిలిచే ఉంటుంది. తెలంగాణ ప్రజల హృదయాల్లో కేసీఆర్ ఉంటారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనను చెరిపివేయడమనేది ఎవరికీ సాధ్యం కాదు. యావత్తు తెలంగాణను ఏక తాటిపై నడిపి, ఉద్యమం నడిపించి, ఆ ఉద్యమాన్ని రాష్ట్ర ఆవిర్భావంగా తీర్చిదిద్దిన దృఢసంకల్పం. ఆయన అడుగులు ఆత్మగౌరవ పోరాటానికి దారులు చూపాయి. ఆయన ఆలోచనలు అణగారిన గుండెలకు ఆత్మబలాన్ని అందించాయి. కేసీఆర్ వ్యూహాలు ఆధిపత్య శక్తుల కుట్రల్ని పటాపంచలు చేశాయి. పోరాట పట్టుదల, పరిణతి, నిబద్ధత, నిర్భీతి తరతరాల వివక్షా విద్రోహాల నుంచి తెలంగాణను విముక్తి చేశాయి.
ప్రతి తరానికి ఒక టార్చ్‌బేరర్ ఉంటారు. తెలంగాణకు టార్చ్‌బేరర్ కేసీఆరే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు అవుతున్నది. అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే పాలనను గాలికొదిలేసి రాష్ట్ర సాధకుడు కేసీఆర్‌పై ఎలా కక్ష తీర్చుకోవాలనే దృష్టితోనే రేవంత్‌రెడ్డి ఉన్నారు. అంతేతప్ప ఆరు గ్యారెంటీలను అమలు చేయాలనే ఆలోచన చేయడంలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అసత్య ప్రచారాలు చేసిన రేవంత్ సర్కార్‌కు ఇటీవలి హైకోర్టు తీర్పు చెంపపెట్టులాంటిది. రేవంత్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేయడం మినహా పాలనలో సాధించినది జీరో అనే చెప్పాలి. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుపై అక్రమ కేసులు బనాయించిన కాంగ్రెస్ సర్కార్ పైశాచిక ఆనందం పొందుతున్నది. పదేండ్ల పాలనలో కేసీఆర్ అందించిన సంక్షేమ ఫలాలు తప్ప రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన సంక్షేమం శూన్యం. కాంగ్రెస్ పాలనలో ఏడాదిలోనే రాష్ట్ర రాజకీయం గిర్రున తిరిగింది. రెండున్నరేండ్లు కావొస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రతిపక్షం బలాన్ని పెంచుకుంటుంటే, అధికార పార్టీ ప్రజావ్యతిరేకతను, ప్రజాగ్రహాన్ని మూట గట్టుకుంటున్నది. రేవంత్ సర్కార్ ఇబ్బందులు పెట్టాలని ఎ న్ని చిల్లర పనులు చేస్తున్నా మొక్కవోని ధైర్యంతో ఎదుర్కొంటున్న నిప్పులాంటి మనిషి కేసీఆర్.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసే విమర్శల భాష జుగుస్సాకరం. రేవంత్ విమర్శలను చూసి తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకుంటున్నది. మైకు దొరికితే చాలు.. ‘పండబెట్టి తొక్కుతా.. చీరుతా.. చింపుతా.. సంపుతా.. గుడ్లు పీకి గోటీలాడుతా.. యాప శెట్టుకు కట్టేసి లాగుల తొండలిడుస్తా..’ అంటూ తీవ్రమైన పదజాలంతో రేవంత్‌రెడ్డి చెలరేగిపోవడాన్ని తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారు. కాంగ్రెస్ నేతలు దిగజారి ‘బుల్డోజర్తో తొక్కిస్తం.. మానవ బాంబులై చంపేస్తం..’ అని హింసాత్మక ధోరణిలో మాట్లాడుతూ రెచ్చగొడుతున్నారు. కాంగ్రెస్ నేతల మాటలను ప్రజలు తీవ్రంగా తప్పు పడుతున్నారు.. ‘నా కొడకల్లారా.. ఒక్కొక్కన్ని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతా’ అని ముఖ్యనేతనే ఉన్మాదిలా మాట్లాడడం సిగ్గుచేటు. రాజకీయ పరిభాషను దిగజార్చడంలో రేవంత్‌రెడ్డి రోజురోజుకకు దిగజారి ప్రవర్తిస్తున్నారు. బాధ్యతగల ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి తన కంటే వయస్సులో పెద్ద అయిన కేసీఆర్ కీడును కోరుకుంటూ మాట్లాడుతున్నారంటే కాంగ్రెస్ పాలనలో రాజకీయాలు ఎంత నీచస్థాయికి దిగజారిపోయాయో స్పష్టమవుతున్నది.
పవర్ఫుల్ వెపన్ మౌత్‌టాక్. దాన్ని నిలువరించడం ఎవ్వరి వల్ల కాదు. నిజానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి సొంత నియోజకవర్గం మల్కాజ్గిరి ఎంపీని కొల్పోవడంతో మొదలైన కాంగ్రెస్ పతనం పంచాయితీలు, మున్సిపల్ ఎన్నికల్లో తారా స్థాయికి చేరింది. అటు సొంత పార్టీలో, సొంత ప్రభుత్వంలో రేవంత్‌రెడ్డిపై అంతర్గత వ్యతిరేకత పెరిగింది. హైదరాబాద్‌లో హైడ్రా ఆగడాలు, ఖమ్మంలో పేదల ఇండ్ల కూల్చివేతలతో వ్యతిరేకత ఇంకా ఎక్కువయింది.
రైతులు, యువత, విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగుల్లో కాంగ్రెస్‌పై అసంతృప్తి కట్టలు తెంచుకొన్నది. ధర్నాలు, రాస్తారోకోలు, సమ్మెలు, నిరవధిక నిరాహర దీక్షలతో తెలంగాణ మొత్తం అట్టుడుకుతున్నది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు పెరుగుతున్నాయి. సంఘటిత, అసంఘటిత కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనబాట పడుతున్నారు. రాస్తారోకోలు, చలో సెక్రటేరియట్, చలో బస్‌భవన్, చలో విద్యుత్తు సౌధ, చలో విద్యశాఖ అంటూ రాష్ట్రంలో అన్ని ప్రధాన శాఖల ఆఫీసులను ప్రజలు, ఉద్యోగులు ముట్టడిస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో నరకం చూస్తున్న ప్రజలు.. కేసీఆర్ పాలన గొప్పదనాన్ని తలుచుకుంటున్నారు. విశ్వసనీయ, ప్రేరణకు మారు పేరైన ప్రియతమ నేత కేసీఆర్ మళ్లీ పాలన పగ్గాలు చేపట్టాలని కోరుతున్నారు.
(వ్యాసకర్త: బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి)
– కోలేటి దామోదర్