కేసీఆర్.. మూడు అక్షరాలు. తెలంగాణ గడ్డ ఉన్నంతకాలం తరం నుంచి తరానికి పారాడే పేరు కేసీఆర్. తెలంగాణ ఆత్మగౌరవాన్ని సమున్నత శిఖరంగా ఎగరేసిన మహానేత కేసీఆర్. రెండున్నర దశాబ్దాలుగా ఆయన పేరు తలచుకోకుండా తెలంగాణ బిడ్డలు, ఆయన నామస్మరణ చేయకుండా ప్రత్యర్థులు ఒక్కరోజు వెల్లదీయలేకుండా ఉండలేని అనివార్యతను సృష్టించారంటే అతిశయోక్తి కాదు. ఉమ్మడి రాష్ట్రంలో ద్వితీయశ్రేణి ప్రాంతంగా ఉన్న తెలంగాణను… ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉన్న తెలంగాణ ప్రజలను… అసలే శ్రేణో తెలియకుండా ఉన్న రాజకీయ నాయకులను ‘ఇదిరా తెలంగాణ’ అని గల్లా ఎగురవేసి నిలిపిన ధీశాలి ముమ్మాటికీ కేసీఆరే. ఇది ఆయన ప్రత్యర్థులు సైతం కాదనలేని సత్యం.
KCR | తెలంగాణలోని సబ్బండ వర్గాల ఆత్మగౌరవమే తన ఆత్మగౌరవంగా నిలిపిన మార్గదర్శి. కాటగలిసిన తెలంగాణను 14 ఏండ్ల సుదీర్ఘకాలం ఉద్యమించి ‘రాష్ట్రం’గా ఆవిర్భవించేలా అవిరళ కృషిచేసిన పోరాటయోధుడిగా నిలిచి.. సాధించిన తెలంగాణను అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దిన దార్శనిక పాలకుడిగా చరిత్ర సృష్టించి మహానేతగా నిలిచారు కేసీఆర్.
ఆరున్నర దశాబ్దాలపాటు ఆశలన్నీ అడుగంటిపోయి నిశ్శబ్ధ నిశీధిలో కాలం వెళ్లదీస్తున్న తెలంగాణకు కేసీఆర్ వెలుగుదివ్వెగా మారారు. 2001 ఏప్రిల్ 27వ తేదీన తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఒక రాజకీయ పార్టీని స్థాపించి జాతిపిత మహాత్మాగాంధీ అనుసరించిన అహింసా సిద్ధాంతంతో బయలుదేరారు. తెలంగాణ కోసం మహామహులే ఏమీచేయలేక చతికిలపడితే ‘గీ బక్కపలచని మనిషి ఉపప్రాంతీయ పార్టీని స్థాపిస్తే ఆయన వెనుక ఎవరు నడుస్తారు?’ అని ఈసడించుకున్న కాలాన్ని తన కార్యదీక్షాదక్షతలతో నమ్మికను కుదిర్చి తన వెంట నడవకుండా ఉండలేని అనివార్యతను సృష్టించారు. తెలంగాణలో పుట్టిన ప్రతీబిడ్డా తెలంగాణ కోసం గళమెత్తి ‘జై తెలంగాణ’ అని దిక్కులు పిక్కటిల్లేలా నినదించేలా చేశారు. తెలంగాణ అంతటా పక్షిలాగా తిరిగారు. ప్రజలను జాగృతం చేశారు. ప్రతీ రాజకీయ పార్టీ తలుపు తట్టారు. ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యూ దాకా, ప్రాంతీయ పార్టీల నుంచి జాతీయ పార్టీల దాకా ప్రతిఒక్కరూ తెలంగాణకు అనుకూలంగా విధాన నిర్ణయం తీసుకునేలా చేసిన వ్యూహకర్త కేసీఆర్. ఎన్నికల్లో పొత్తులైనా… ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలైనా.. రాష్ట్ర సాధనలో అస్త్రంగా మలిచిన పదునైన వ్యూహచతురత కేసీఆర్‌దే. 14 ఏండ్ల సుదీర్ఘ పోరాటంలో ప్రతీ మనిషిని తెలంగాణ ఆయుధంగా తీర్చిదిద్దారు. తుదకు దగాపడ్డ తెలంగాణను దరికి చేర్చారు.
నాకు కావలసింది తెలంగాణ రాష్ట్రం. మీరు ఏ మంత్రిత్వ శాఖ ఇస్తారనేది నాకు ప్రధానం కాదు. ఏదిచ్చినా సంతోషంగా స్వీకరిస్తా. కానీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వండి’
‘దూరం నుంచి చూసినవారే కాదు.. కొన్ని సందర్భాల్లో దగ్గరి నుంచి మా లాంటివాళ్లమూ కేసీఆర్‌ను ముక్కుసూటి నాయకుడు, ముక్కోపి నేత అనుకుంటాం. కానీ, వారి మనసు వెన్న. సాయం చేయటంలో ఎముకలేని చేయి’ అని మొదటి నుంచి కేసీఆర్‌ను చూసినవాళ్లు చెప్తుంటారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో… రాష్ట్ర సాధన అనంతరం అనేక సందర్భాల్లో కేసీఆర్ ఆ అభిప్రాయాన్ని అక్షరాలా ఆవిష్కరించారు. దేశంలో ప్రతిఒక్కరూ అనుసరించేలా మార్గం వేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నాటి టీఆర్ఎస్ (నేడు బీఆర్ఎస్) పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ ‘కూలీ’ పని చేయాలనే నిర్ణయం తీసుకొని కదిలినప్పుడు.. పార్టీ అధినేతగా కేసీఆర్ కూలీ పనిచేశారు. అలా కూలీపని చేస్తున్న సమయంలో హన్మకొండలో ఒక జువెల్లరీ షాప్‌లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక కుటుంబం తన కూతురు పెండ్లి కోసం నగలు కొనుగోలు చేస్తున్నారు. ఆ షాప్‌లో కేసీఆర్ కూలీ పనిచేస్తే వచ్చిన సొమ్ముతో సదరు పెండ్లి కూతురుకు బంగారు ఆభరణం (నెక్లెస్) కొనిచ్చారు.
అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో బిడ్డ పెండ్లి కోసం కొన్న నగలు, డబ్బులు అగ్నిప్రమాదానికి బుగ్గిపాలై ఓ తండ్రి (పెండ్లి కుమార్తె పేరు కల్పన) కన్నీరుమున్నీరుగా విలపిస్తుంటే విషయం తెలుసుకున్న కేసీఆర్ ఆర్థికసాయం అందించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత తొలి మంత్రివర్గంలో ఆడబిడ్డ పెండ్లికి కల్యాణలక్ష్మి అనే పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. సిద్దిపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ‘సైకిల్ కొనివ్వలేదని అల్లుడు బిడ్డను తోల్కపోతలేడు’ అనే విషయం తెలుసుకొని తన డబ్బులతో సైకిల్ కొనిచ్చారు. పంటకోతల సమయంలో కూలీలు దొరకక రైతులు ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న కేసీఆర్ ఊరు ఊరంతా వంతులవారీగా వరికోతలు చేసేలా ఆ సమయంలో తానూ కొడవలి పట్టుకొని పొలం కోసే సహజీవన పని సంస్కృతిని అమలు చేశారు. ఇలా తన రాజకీయ జీవితంలో… ఉద్యమ జీవితంలో ప్రజల బాధలను తన బాధలుగా స్వీకరించి వాటిని దూరం చేసేందుకు బాటలు వేసిన ఆత్మగల్ల సుట్టంగా కేసీఆర్‌ను ప్రజలు గుర్తిస్తారు.
కేసీఆర్ వ్యక్తిగా ఉదార స్వభావి. రాజకీయాల్లో మాత్రం అగ్రెసివ్. యుద్ధతంత్రంలో ఆయనొక సుంజూ. శత్రువు ఊహించని వ్యూహరచనతో హోచిమిన్లా విరుచుకు పడగలరు. అహింసా ఉద్యమకారుడిగా ఆయనలో ఒక గాంధీ, ఒక మార్టిన్ లూథర్‌కింగ్ దర్శనమిస్తారు. తమ దేశాన్ని ప్రేమించడంలో ఫిడెల్ కాస్ట్రో, ఆంగ్‌సాన్ సూకీలను గుర్తుకుతెస్తారు.
తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం పదేండ్ల కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వినూత్నంగా ప్రవేశపెట్టి, విజయవంతంగా అమలు చేసిన సంక్షేమ పథకాలను దేశమే అనుసరించాల్సిన అనివార్యతలు ఏర్పడ్డాయి. తెలంగాణ ప్రజల పట్ల కేసీఆర్‌లో ఉన్న మానవీయ దర్శనానికి నిదర్శనం.. ఆసరా పింఛన్లు మొదలుకొని కంటివెలుగు దాకా, కేసీఆర్ కిట్ మొదలుకొని కేసీఆర్ న్యూట్రీషియన్ కిట్ దాకా, రైతుబంధు మొదలుకొని నీటితీరువా రద్దు దాకా, చేనేత, కల్లుగీత కార్మికుల బీమా మొదలుకొని రైతు బీమా దాకా, గొర్లపెంపకం మొదలుకొని చేపల పెంపకం దాకా.. ఇలా కేసీఆర్ అమలు చేసిన ప్రతీ పథకంలో ప్రజల సంక్షేమం ఉన్నది. ప్రతీ విధానంలో తెలంగాణ గతిని మార్చిన నినాదం ఉన్నది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రజలను కలవలేదనేది రాజకీయంగా చేసే విమర్శే తప్ప వాస్తవం కాదని ఆయన పదేండ్ల పాలనే నిదర్శమని తన ప్రత్యర్థి పార్టీల నేతలు సైతం పేర్కొన్న సందర్భాలు అనేకం ఉన్నాయి. పారిశుద్ధ్య కార్మికులతో, అంగన్వాడీ, ఆశావర్కర్లతో సహపంక్తి భోజనాలు చేసినా… ‘సఫాయి అన్నా…! నీకు సలాం’ అన్న మానవీయతను చాటిన సందర్భాలను ఆయా వర్గాలు గుర్తుచేసుకుంటాయి.
కేసీఆర్ ఉద్యమ నాయకుడు. ఆవేశపరుడే అనుకున్నాం. కానీ, కేసీఆర్‌లో విన్స్టన్ చర్చిల్‌కు (సంక్లిష్ట సమయంలో సంయమనంతో వ్యహరించి గమ్యాన్ని చేరిన బ్రిటన్ మాజీ ప్రధాని) ఉన్నంత దార్శనికత ఉంది. తన లక్ష్యమైన తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి, దేశంలోనే అగ్రగామిగా తెలంగాణను నిలిపేందుకు కేసీఆర్ ప్రదర్శించిన చొరవ అనితర సాధ్యమైనది
నాటి ప్రగతి భవన్లో జనహితహాల్ను నిర్మించారు. కేసీఆర్ జన్మదినోత్సవం నాడు ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. జనహిత హాల్ ప్రారంభోత్సవం సందర్భంగా ‘మరణించిన జర్నలిస్టు కుటుంబ సభ్యులను ఆదుకునే కార్యక్రమం నిర్వహిద్దామని కేసీఆర్ అధికారులకు చెప్పారు. అయితే, మొదటి కార్యక్రమమే వారితో ఎందుకనే యోచనలో అధికారులు తర్జనభర్జన పడుతూ ఈ విషయాన్ని ఎలా చెప్పాలో తోచక వారు మౌనం దాలిస్తే.. వారి స్థితిని గమనించిన కేసీఆర్ ‘ఆదుకోవటం, అండగా ఉంటాం అనే ధైర్యం ఇవ్వటం కన్నా పవిత్ర కార్యం ఏమి ఉంటుంది. అదే కార్యక్రమం చేద్దాం’ అని అధికారులను ఆదేశించారు. కేసీఆర్ హయాంలో ఆయనను దగ్గరి నుంచి చూసినవారు లెక్కలేనన్ని సంఘటనలను ఉదహరిస్తారు. మొత్తానికి కేసీఆర్ అంటే తెలంగాణ.. తెలంగాణ అంటే కేసీఆర్. ఇది తెలంగాణ ఉన్నంతకాలం ఎవరు అంగీకరించినా.. అంగీకరించకపోయినా శిలాసదృశ్యంగా నిలిచి ఉంటుందనటంలో అతిశయోక్తి లేదు.