తెలంగాణ ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనుల మరణాలను చూసి డబ్ల్యూహెచ్‌వో నాడు హెల్త్ ఎమర్జెన్సీ (విపత్తు ప్రాంతాలు)గా ప్రకటించింది. నక్సలైట్ల పేరుతో అమాయక గిరిజనులను ఎన్కౌంటర్లు చేయడం, దేశంలోనే ఆడ శిశువుల విక్రయానికి కేంద్రంగా మారిన దేవరకొండ లంబాడి గిరిజన తండాలు కరువు కాటకాలు, ఆకలి చావులతో అల్లాడిన పరిస్థితులు. బతుకుదెరువు కోసం మహా నగరాల్లో నడి రోడ్లపై అడవి బిడ్డలు అవస్థలు పడ్డారు. ఇవీ ఉమ్మడి ఏపీలో తెలంగాణ గిరిజనుల దుస్థితి.
తెలంగాణ గిరిజనుల దుస్థితిని చూసి ఆనాడు యునెస్కో, డబ్ల్యూహెచ్‌వో వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా ఆందోళన చెందాయి. రోడ్డు సదుపాయాలు, వైద్య సదుపాయాలు లేక ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలలో నివసిస్తున్న ఆదివాసీలు ఏటా కొన్ని వేల మంది విషజ్వరాల బారినపడి చనిపోయారు. ఏజెన్సీ ప్రాంతాల గిరిజనుల ఆర్తనాదాలను చూసి యావత్ ప్రపంచమే నివ్వెరపోయింది.
గిరిజన సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో 1980 నుంచి 2013 వరకు తెలంగాణ వ్యాప్తంగా అనేక గిరిజన సంఘాలు పుట్టుకొచ్చాయి. ఉమ్మడి ఏపీ ప్రభుత్వాలపై పోరాటం చేశాయి. అయినా పాలకులు ఏనాడూ కనికరించలేదు. ఇంతటి దుర్భర జీవితాన్ని గడిపిన తెలంగాణ గిరిజన ప్రజలకు కేసీఆర్ వంటి మహా నాయకుడు గులాబీ జెండా పట్టుకొని ప్రకృతి వరప్రసాదంగా ముందుకువచ్చాడు. స్వరాష్ట్రంలో తమ అభివృద్ధికి బాటలు వేస్తాడని నాడు గిరిజన ప్రజలు కూడా ఊహించలేదు.
సమస్యల వలయంలో చిక్కుకొని, దిక్కుతోచని స్థితిలో ఉన్న తెలంగాణ గిరిజనులకు గులాబీ జెండా ఆవిర్భావం కొండంత భరోసానిచ్చింది. తెలంగాణ సాధన సంకల్పంతో తన ఉద్యమ జీవితాన్ని మొదలుపెట్టిన నాటి నుంచే గిరిజనుల అభివృద్ధి తో సాధించబోయే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ముడిపడి ఉన్నదని కేసీఆర్ భావించారు. 2002, ఏప్రిల్ నెలలో తెలంగాణ ప్రాంతంలోని ములుగు మండలం రామచంద్రపురం గ్రామపంచాయతీ పరిధిలోని ‘భాగ్య తండా’లో పర్యటించి రాత్రి బస చేశారు.
భానోత్ భీమా నాయక్ తన కూతురి పెళ్లి కోసం దాచుకున్న సొమ్ము కాలి బూడిదకావడంతో కేసీఆర్ చలించిపోయారు. దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న బానోతు భీమా నాయక్‌కు ఆర్థిక సహాయం చేశారు. ఇటువంటి పరిస్థితి తెలంగాణలో ఏ బిడ్డకు రాకూడదనే సంకల్పంతో నాడే ‘కల్యాణలక్ష్మి’ పథకాన్ని రూపొందించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో ఆ పథకం అమలులోకి వచ్చింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ 3,146 తండాలు, గూడేలను గ్రామ పంచాయతీలుగా మార్చారు. తెలంగాణ రాష్ర్టాభివృద్ధికి గిరిజనుల అభివృద్ధి పునాది అని భావించిన కేసీఆర్ 2022 అక్టోబర్ 1వ తేదీ నాడు జీవో నెంబర్ 33 ద్వారా తెలంగాణ గిరిజనులకు రిజర్వేషన్ 10 శాతానికి పెంచి ఇస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు.
ఉమ్మడి ఏపీలో ఏండ్ల తరబడి పరిష్కారం కానీ పోడు భూముల సమస్యను కేసీఆర్ పరిష్కరించారు. అడవి ప్రాంతాల్లో నివసిస్తూ పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులను రైతులుగా గుర్తించి, ఆ భూములకు పట్టాలు పంపిణీ చేశారు. లక్షా యాభై వేల మంది గిరిజన రైతులకు 4 లక్షల పై చిలుకు ఎకరాల పోడు భూములకు పట్టాలను ఇచ్చి వారి జీవితాల్లో వెలుగు నింపారు. అంతేకాదు, రైతుబంధు పథకాన్ని కూడా వర్తింపజేశారు.
అంతేకాదు, కేసీఆర్ గిరిజనుల సంక్షేమం కోసం ‘గిరి పోషణ’ పథకాన్ని ప్రారంభించారు. మైదాన ప్రాంత గిరిజనుల అభివృద్ధికి 2016లో ‘ట్రైకార్’ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. ఏజెన్సీ గిరిజనులకు ఉద్యోగ కల్పనకై గిరిజన అటవీ ఉత్పత్తుల కొనుగోలుకై జీసీసీ కార్పొరేషన్‌ను ఏర్పాటు, గిరిజన విద్యార్థుల కోసం రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 92 గురుకుల పాఠశాలలు, 22 గిరిజన డిగ్రీ కళాశాలలు, దేశంలోనే తొలి గిరిజన లా కళాశాల ఏర్పాటు చేశారు. గిరిజన నిరుద్యోగులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి సీఎంఎస్టీ పథకాన్ని ప్రవేశాపెట్టారు. విదేశీ విద్యను అభ్యసించే గిరిజన విద్యార్థుల కోసం అంబేద్కర్ ఓవర్సీస్ పథకాన్ని ప్రారంభించారు. ఇలా గిరిజనుల కోసం కేసీఆర్ హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు పురుడుపోసుకున్నాయి. గులాబీ జెండా ఆవిర్భావం నుంచే తెలంగాణ గిరిజన సంక్షేమానికి బీజం పడింది. తెలంగాణ గిరిజనులకు గులాబీ జెండా శ్రీరామరక్షగా, కొండంత అండగా నిలిచింది. రజతోత్సవం పూర్తి చేసుకుంటున్న గులాబీ జెండాకు తెలంగాణ గిరిజన జాతి పక్షాన జేజేలు
(వ్యాసకర్త: బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి, ఓయూ)
– శ్రీను నాయక్ దోన్వాన్
85220 18001