తెలంగాణ ఉద్యమంలో చేనేత వర్గం కీలకంగా పనిచేసింది. గ్రామీణ జీవన విధానంలో వ్యవసాయరంగం తర్వాత ప్రధానమైన జీవనోపాధిగా చేనేత వెలుగొందుతున్నది. తెలంగాణ అస్తిత్వంలో పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట, దుబ్బాక, వరంగల్, కరీంనగర్ చేనేత వస్ర్తాలు విడదీయలేని అనుబంధాన్ని కలిగి ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం చేనేత రంగాన్ని ఒక ప్రధాన ఆర్థిక వ్యవస్థగా గుర్తించి అప్పటి కేసీఆర్ ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేసింది. చేనేత శాఖను కేటీఆర్ సమర్థవంతంగా నిర్వహించి చేనేత మరమగ్గాల రంగాల రెండింటిని అభివృద్ధి పరిచారు. కానీ, ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు రంగాలను పూర్తిగా విస్మరించి చేనేత కార్మికుల ప్రయోజనాలను కాలరాస్తున్నది. గత కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు మించి ఒక పథకం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తదాన్ని తీసుకురాలేదు.
చేనేత కార్మికులకు రుణమాఫీ రూ.లక్ష వరకు చేస్తామని చెప్పి నేటికీ అమలుచేయని దుస్థితి. నూలు సబ్సిడీ స్థానంలో చేనేత కార్మిక కుటుంబాలకు ఏటా రూ.24 వేల చొప్పున ఇస్తామని ప్రకటించినప్పటికీ నేటికీ అమలుకు నోచుకోలేదు. ఈ పథకం ప్రతిపాదనలు గత ప్రభుత్వంలోనివే. చేనేత కార్మికుల త్రిఫ్ట్ ఫండ్ పథకాన్ని మూడేండ్ల కాలవ్యవధి నుంచి రెండేండ్లకు కుదించారు. గత ప్రభుత్వంలో విడుదల చేసిన త్రిప్ట్ ఫండ్ పథకంలోని నిధులను తాము విడుదల చేసినట్టుగా చెప్పుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లింది. చేనేత దినోత్సవ సందర్భంగా నిపుణులైన చేనేత కార్మికులకు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుతో అవార్డులను ప్రవేశపెట్టింది గత కేసీఆర్ ప్రభుత్వం.
పద్మశాలి సమాజం కోసం కోకాపేటలో రెండున్నర ఎకరాలు, ఆత్మగౌరవ భవనం కోసం రూ.5 కోట్లను గత కేసీఆర్ ప్రభుత్వం కేటాయించింది. నేటికీ ఈ భవనం నిర్మాణం మొదలు కాలేదు. శాసనసభ, శాసనమండలిలలో టీఆర్ఎస్ పక్షాన చేనేత వర్గానికి చెందిన వ్యక్తులు ఇద్దరు సభ్యులుగా ఉన్నారు. సామాజిక న్యాయం మాట్లాడే కాంగ్రెస్ పార్టీ పద్మశాలి సమాజానికి ఏ విధమైన ప్రాతినిధ్యం కల్పించలేదు. అవకాశం ఉన్న చేనేత మరమగ్గాల కార్పొరేషన్లకు కనీసం చైర్మన్లను కూడా నియమించలేదు. అట్టహాసంగా పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించి ఏడాది కావస్తున్నా నేటికీ నిధులను కేటాయించలేదు. సరి కదా చైర్మన్ నియామకం కూడా జరగలేదు.
ఇదంతా చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం నోటి మాటలతోనే సానుభూతిని చూపిస్తుంది తప్ప చేనేత వర్గాల అభ్యున్నతి కోసం పనిచేస్తున్న దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. ఇక ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తామని, టెస్కోకు పాలక మండలి ఎన్నికలు నిర్వహిస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ మ్యానిఫెస్టో ఏమైందో చేనేత మంత్రి చెప్పాలి. ప్రాథమిక చేనేత సహకార సంఘాల నుంచి నేత కార్మికులు ఉత్పత్తి చేసిన వస్ర్తాలను కొనుగోలు చేయడంలో టెస్కో పూర్తిగా విఫలమైంది. చేనేత కార్మికులు ఉత్పత్తి చేసిన వస్ర్తాలలో కనీసం 50 శాతం ప్రభుత్వం కొనుగోలు చేసి వారి ఉపాధికి
భద్రత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
ఇదిలా ఉంటే సిరిసిల్లను ఉరిసిల్లగా మారుస్తున్నది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం. గత ప్రభుత్వం ఆత్మహత్యలకు నిలయమైన సిరిసిల్ల మరమగ్గాల రంగాన్ని పునర్నిర్మించి అభివృద్ధిపరిచేందుకు అనేక పథకాలను అమలుచేసింది. ఆత్మహత్యలు లేని సిరిసిల్లగా తీర్చిదిద్దింది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతోమంది నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు.
బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇవ్వడంలో ఆలస్యం చేయడం వల్ల అనేకమంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. మరమగ్గాల రంగానికి సబ్సిడీతో కూడిన విద్యుత్తు సరఫరా ఆపివేయడంతో నేడు సిరిసిల్లలో సగానికి పైగా మరమగ్గాలు పనిచేయడంలేదు. వర్కర్ టు ఓనర్ పథకాన్ని ప్రవేశపెట్టి రూ.వందల కోట్ల నిధులతో షెడ్లు నిర్మించింది గత ప్రభుత్వం. ఈ పథకాన్ని అమలుచేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారన్న ఒకే ఒక కారణంతో సిరిసిల్లలో చేనేత కార్మికుల మీద కక్ష తీర్చుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకున్నది.
తనను గెలిపించలేదని అక్కడి కాంగ్రెస్ ఇంచార్జ్ మరమగ్గాల రంగం అభివృద్ధి కోసం ఏ ఒక్క పథకం ప్రవేశపెట్టకుండా అడ్డుపడుతున్నారు. నేడు సిరిసిల్లలో ఉపాధి లేక చేనేత కార్మికులు తిరిగి మహారాష్ట్రకు, గుజరాత్‌కు వలసలు పోయే పరిస్థితి దాపురించింది. నిజంగా చేనేత కార్మికుల మీద చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి సిరిసిల్ల నేత కార్మికుల సమస్యల మీద హౌజ్ కమిటీని ఏర్పాటుచేసి పరిష్కరించాలి.
-వ్యాసకర్త: బీఆర్ఎస్ నాయకులు) కర్నాటి విద్యాసాగర్, 94913 93999