శతాబ్దాల తరబడి తెలంగాణ భాష వివక్షకు గురైంది. నన్నయ కాలం నుంచి మొదలుకొని 2014 వరకు తెలంగాణ భాష మనకు కాకుండాపోయింది. మన భాష, సంస్కృతి, చరిత్ర అణచివేతకు గురైంది. కాళోజీ, దాశరథి రంగాచార్యులు, బీఎస్ రాములు, అల్లం రాజయ్య, వేముల ఎల్లయ్య, భూతం ముత్యాలు వంటి రచయితలు తమ రచనల్లో తెలంగాణ భాషను వినియోగించినా తగిన ఆదరణ దక్కలేదు. తెలంగాణ భాషకు, సాహిత్యానికి పాఠ్య పుస్తకాల్లో చోటు లభించకపోవడమే అందుకు కారణం. స్వరాష్ట్రం ఏర్పడ్డాక తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మన భాష, యాస, సాహిత్యానికి పెద్దపీట వేశారు. పాఠశాల స్థాయి నుంచి కళాశాల వరకు పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ పదాలు, సామెతలు, జాతీయాలను చేర్పించారు. అంతేగాక తనే స్వయంగా తెలంగాణ భాషలో మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించారు. నుడికారం, జాతీయాలు, సామెతలతో ఆయన మాట్లాడే భాషామాధుర్యాన్ని తెలంగాణ ప్రజలందరూ ఆస్వాదించారు.
కేసీఆర్ విద్యాభ్యాస కాలం అంతా ఉర్దూ, ఆంధ్రా భాషలో సాగినా ఆయనకు తెలంగాణ యాస మీద మక్కువ తగ్గలేదు. తెలంగాణ వెనుకబాటుతనాన్ని, భాషను హేళన చేయడాన్ని కళ్లారా చూసిన కేసీఆర్.. భాషను బతికించాలనే దృఢ సంకల్పంతో మన భాషపై పట్టు సాధించారు. ‘బడి పలుకుల భాష గాదు.. పలుకుబడుల భాష కావాలె’ అని నినదించిన కాళోజీ మాటల్ని నిజం చేయడానికి కేసీఆర్ పూనుకున్నారు. విజయం సాధించారు కూడా. వాక్చాతుర్యంతో, నుడికారంతో, భాషా నైపుణ్యంతో రాజకీయ ఉద్దండులను ఎదుర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు దగ్గరయ్యారు.
సామాన్యుల నుంచి మేధావుల వరకు అందరికీ సులభంగా అర్థమయ్యేలా చమత్కారంతో, మాటతీరుతో, భాషా సౌందర్యంతో ఆకట్టుకున్నారు. పరిపాలనా రంగంలో ప్రత్యేకమైన మార్క్‌ను సృష్టించారు. తెలంగాణ ప్రజాప్రతినిధులు, నేతలు కేసీఆర్ మాట్లాడినట్టు తెలంగాణ భాషలో మాట్లాడాలి. ఆ దిశగా ప్రయత్నించాలి. భావితరాలకు తెలంగాణ భాషా సౌందర్యం, మాధుర్యాన్ని అందించే బాధ్యత మనందరిపై ఉందని గ్రహించాలి. తెలంగాణ భాషా సాహిత్యంపై మరిన్ని పరిశోధనలు జరిపి, భవిష్యత్తు తరాలవారికి అందించే ప్రయత్నం చేద్దాం.
-కాళేశ్వరం కృష్ణమూర్తి, 97051 96097