‘గ్రీన్ సిటీ ఆఫ్ ద వరల్డ్: హైదరాబాద్’, ‘గ్రీన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్-యాదాద్రి’ తెలంగాణ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా… ప్రపంచంలోని వివిధ దేశాల ప్రముఖ నగరాలైన ప్యారిస్, మాంట్రియల్, మెక్సికోసిటీ, మెల్బోర్న్ మొదలైన 57 ప్రపంచ నగరాలను జయించి.. మన ‘హైదరాబాద్’ నగరానికి ‘గ్రీన్ సిటీ ఆఫ్ ద వరల్డ్’ అవార్డు దక్కింది. అట్లాగే తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి 2022-2025 సంవత్సరాలకు గాను ప్రముఖ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ వారు ‘గ్రీన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్’ (ఆధ్యాత్మిక హరిత పుణ్యక్షేత్రం) అవార్డును ప్రదానం చేశారు. ఇదెలా సాధ్యమైంది? దీనివెనుక ఎవరి నిర్విరామ కృషి దాగి ఉన్నది? ఇంకెవరు? ఒకే ఒక్కడు కేసీఆర్!
పలు రాష్ర్టాల మీదుగా నిత్యం రాకపోకలు సాగించే లారీ డ్రైవర్లు సైతం తెలంగాణ రాష్ట్రంలోకి రాగానే ఇక్కడ రోడ్డు పక్కన ఆహ్లాదకరంగా ఉండే చెట్ల రమణీయతను చూసి లారీలను ఆపుతున్నారు. చెట్ల కింద సేద తీరుతున్నారు. తెలంగాణ ఎంతటి పచ్చదనాన్ని పరుచుకున్నదో దీని ద్వారా అర్థమవుతున్నది.
ఈ అవార్డులు రావడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా, ఓ ప్రకృతి ప్రేమికుడిగా ఎంతో మేధో మథనంతో, అకుంఠిత దీక్షతో పట్టువదలని విక్రమార్కుడిలా రేయింబవళ్లు శ్రమిస్తేనే సాధ్యమైంది. యావత్ దేశం గర్వించే కేసీఆర్ క్యాబినెట్లో మంత్రిగా.. ఆయనకు అత్యంత దగ్గరగా మెదిలే గొప్ప అవకాశం కలిగిన వ్యక్తిగా.. సమస్త మానవాళి క్షేమం కోసం పరితపించే కేసీఆర్ ఆలోచన విధానం ఈ సందర్భంగా మీతో పంచుకుంటున్నా.
ఓట్ల కోసం మాత్రమే కార్యక్రమాలు రూపొందించే పాలకులనే మనం ఎక్కువగా చూస్తాం. కానీ, సమస్త మానవాళి మనుగడకు, భావితరాల భవిష్యత్తు కోసం దూరదృష్టితో ఆలోచించి కార్యక్రమాలు చేసే నాయకులు మనకు చరిత్రలో అరుదుగా కనిపిస్తారు. నేను నా స్వీయ అనుభవంలో చూసిన అట్లాంటి గొప్ప నాయకుడు కేసీఆర్. ఎందుకంటే ఆయన చేపట్టిన ‘హరితహారం’, ‘అడవుల పునరుద్ధరణ’ వంటి కార్యక్రమాల వల్ల ఓట్లు రాలవు. వాటికోసం వెచ్చించిన మేధస్సు, శ్రమ, సమయం, డబ్బు, వేరే ప్రజాకర్షక కార్యక్రమాలకు వెచ్చిస్తే పుష్కలంగా ఓట్లు పొందవచ్చు. కానీ ఓట్లు, అధికారం కంటే మానవ మనుగడ ముఖ్యమని భావించే నాయకుడు కేసీఆర్. ఆయన ప్రకృతిని ప్రేమించినంతగా ఇంకెవ్వరూ ప్రేమించలేరంటే అతిశయోక్తికాదు. పచ్చదనాన్ని, పెరుగుతున్న మొక్కను చూసి పసిపిల్లాడిలా మురిసిపోయే ఆయన్ను చూస్తే ఎంతో సంబురం అనిపిస్తది. ‘ఏ మనిషి అయినా తన పిల్లలకు, వారసులకు ఆస్తులు, అంతస్తులు ఇవ్వాలనే భ్రమలో ఉంటాడు. కానీ, వాటిని అనుభవించడానికి ఆరోగ్యకరమైన పచ్చని ప్రకృతిని, మంచి గాలిని అందించాలనే కనీస సోయి ఉండదు. అది అత్యంత బాధాకరం’ అని పెద్దాయన తరచూ అనే మాటలు ఎప్పుడూ నా మదిలో మెదులుతూనే ఉంటాయి.
కేసీఆర్ రోడ్డుపై ప్రయాణిస్తున్న సమయాల్లో రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను, మొక్కలను నిశితంగా గమనిస్తారు. ఏదైనా మొక్క వాడిపోయినా, చెట్టుకు ఏమైనా అయినా వెంటనే కారు నుంచే సంబంధిత అధికారులకు ఫోన్ కలిపి మాట్లాడిన సందర్భాలెన్నో.. హెలికాప్టర్లో ప్రయాణిస్తుంటే పైనుంచి అడవులను క్షుణ్ణంగా పరిశీలిస్తరు. ఏమైనా లోటుపాట్లు ఉంటే ఇంటికి రాగానే ఆయన చేసే మొదటిపని అధికారులతో మాట్లాడి తగు సూచనలు ఇవ్వడం.
యావత్ ప్రపంచం ‘గ్లోబల్ వార్మింగ్‌తో తల్లడిల్లుతుంటే ‘వృక్షో రక్షతి రక్షితః’ అంటూ ఒక్క మొక్క నాటి ఫొటోలకు ఫోజులిచ్చి మమ అనిపించే నాయకులు నినాదాలకే పరిమితమయ్యారు. ఆ నినాదాన్ని ఆచరణలో పెట్టి చూపించింది మాత్రం ఒక్క కేసీఆరే. 2015లో ‘హరితహారం’ అనే బృహత్తర కార్యక్రమం చేపట్టిన ఏడేండ్లలో 270 కోట్ల మొక్కలు నాటి, వాటిని సంరక్షించడం, అడవులను పునరుద్ధరించడం వల్ల రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో తెలంగాణ గ్రీన్ కవరేజ్ 24 శాతం ఉంటే ఇప్పుడు రికార్డు స్థాయిలో గ్రీన్ కవరేజ్ 31 శాతానికి పెరిగింది. అంటే అదనంగా 7 శాతం పెరిగింది. ఇలా ఈ దేశంలో, ఏ రాష్ట్రంలోనూ జరగలేదు. బహుశా ప్రపంచంలో కూడా నేమో! ఇది ‘సెంట్రల్ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా’ అధికారికంగా వెల్లడించిన గణాంకాలు. ‘గ్లోబల్ వార్మింగ్’ నుంచి గట్టెక్కాలంటే, పర్యావరణ సమతుల్యత కాపాడాలంటే.. ఈ భూమ్మీద 33 శాతం పచ్చదనం ఉండాలి. అందుకు అనుగుణంగానే, దూరదృష్టితోనే కేసీఆర్ తెలంగాణలో పచ్చదనం పెంచారు. అదనంగా గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు, పట్టణాల్లో, నగరాల్లో అర్బన్ పార్క్‌ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టి సఫలీకృతమవుతున్నారు.
హైదరాబాద్ నగరానికి ‘వరల్డ్ గ్రీన్ సిటీ’ అవార్డు దక్కిందంటే కేసీఆర్ నగరం నలువైపులా నాటించిన సుమారు 18 కోట్ల మొక్కలే కారణం. నగరానికి మణిహారంలా ఉన్న 158 కిలోమీటర్లు విస్తరించిన ఔటర్ రింగురోడ్డు చుట్టూ 250 హెక్టార్ల విస్తీర్ణంలో 6.50 కోట్ల మొక్కలతో గ్రీన్ కారిడార్ పచ్చని అడవిని తలపిస్తున్నది. హైదరాబాద్ నగరంలో దాదాపు 881 కిలోమీటర్ల అవెన్యూ ప్లాంటేషన్, 56 లక్షల మొక్కలతో కాలనీ ప్లాంటేషన్, కోటిన్నరకుపైగా ఇన్ట్సిట్యూషనల్ ప్లాంటేషన్ చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. వీటితోపాటు చెరువుల సుందరీకరణలో భాగంగా నగరంలో 24 చెరువులు, కుంటల కట్టలపై చేపట్టిన గ్రీనరీ పెంపకం, 1,087 అర్బన్ పార్క్‌లు, 600 నర్సరీలు, 57 థీమ్ పార్కులు, 12.5 హెక్టార్ల ల్యాండ్ స్కేప్ గార్డెనింగ్, జపాన్ టెక్నాలజీ మియావాకీ అడవుల పెంపకంతో రికార్డు స్థాయిలో గ్రీనరీ నిండిపోయింది. 2014కు ముందు 33.15 చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉన్న గ్రీన్ కవర్, 2022 నాటికి ఏకంగా 81.81 చదరపు కిలోమీటర్లకు చేరుకున్నది. ఈ కార్యక్రమాలన్నీ కేసీఆర్ ఆలోచనల మేరకు, దేశంలోనే అత్యంత ప్రతిభావంతుడైన మంత్రి కేటీఆర్ పర్యవేక్షణలో జరిగిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
కేసీఆర్ ప్రయత్నం వల్ల తెలంగాణలో పెరిగిన పచ్చదనం కీర్తిప్రతిష్టలు ఇవాళ దేశమంతా తెలిసిపోయింది. ఎలా అంటే.. హైవేలో ప్రయాణించే ఏ లారీ డ్రైవర్‌ను అడిగినా ‘మేం ప్రయాణించే ఏ రాష్ర్టాల్లో కూడా రోడ్డు పక్కన ఇంత చక్కటి పచ్చదనం ఉండదు. మేం ఎక్కడికి ప్రయాణం సాగించినా తెలంగాణ ప్రాంతంలోకి రాగానే ఈ చెట్లకింద ఆగుతాం’ చెప్పే మాటలివి. అంటే పలు రాష్ర్టాల మీదుగా నిత్యం రాకపోకలు సాగించే లారీ డ్రైవర్లు సైతం తెలంగాణ ప్రాంతంలోకి రాగానే ఇక్కడి ఆహ్లాదకరమైన రోడ్డు పక్కన ఉండే చెట్ల రమణీయతను చూసి సేదతీరడానికి ఇష్టపడుతున్నారంటే తెలంగాణ ఎంతటి పచ్చదనాన్ని పరుచుకున్నదో అర్థమవుతున్నది.
కేసీఆర్ నాయకత్వంలో కొట్లాడి సాధించుకున్న తెలంగాణ, ఆయన నాయకత్వంలోనే… ఎనిమిదేండ్ల అతి తక్కువ కాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలిచింది. అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే నెంబర్ వన్‌గా ఎదగడమే కాకుండా, ఏ రాజకీయ లాభాపేక్ష లేకుండా, ఓటుతో సంబంధం లేకుండా పచ్చదనం పెంచి భావితరాలకు మంచి చేయాలి, సమస్త మానవాళి మనుగడకు తోడ్పడాలనే సంకల్పం ఒక్క కేసీఆర్ లాంటి లోక నాయకునికే సాధ్యం. అటు ఆధ్యాత్మికత హరిత పుణ్యక్షేత్రం అయిన యాదాద్రి గుడి లాంటి గొప్ప నిర్మాణాలే కాకుండా, అత్యంత వేగంగా పచ్చదనం పెంచడంలో కూడా ప్రపంచ దృష్టిని ఆకర్షించిన నేతగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు. గొప్ప సాంస్కృతిక, సంప్రదాయాల మిళితమైన భారతదేశాన్ని పాలించడానికి అన్నిరకాల లక్షణాలున్న అరుదైన నాయకుడు కేసీఆర్. దేశానికి నాయకత్వం వహించాల్సిన అసలైన లోకోద్ధారక నాయకుడు కేసీఆర్.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే తెలంగాణ రాష్ట్రం అనతికాలంలోనే ఎంతటి కీర్తిని ఆర్జించిందో.. దేశ ప్రధాని కూడా అయితే ప్రపంచం ముందు భారతదేశాన్ని గర్వించే స్థాయిలో… కీర్తి ప్రతిష్టలు గడించేలా తీర్చిదిద్దుతారని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. జై తెలంగాణ..! జై కేసీఆర్..! జై భారత్..!
(వ్యాసకర్త: రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి)
ఓట్ల కోసం మాత్రమే కార్యక్రమాలు రూపొందించే పాలకులనే మనం ఎక్కువగా చూస్తాం. కానీ, సమస్త మానవాళి మనుగడకు, భావితరాల భవిష్యత్తు కోసం దూరదృష్టితో ఆలోచించి కార్యక్రమాలు చేసే నాయకులు మనకు చరిత్రలో అరుదుగా కనిపిస్తారు. నేను నా స్వీయ అనుభవంలో చూసిన అట్లాంటి గొప్ప నాయకుడు కేసీఆర్. ఎందుకంటే ఆయన చేపట్టిన ‘హరితహారం’, ‘అడవుల పునరుద్ధరణ’ వంటి కార్యక్రమాల వల్ల ఓట్లు రాలవు. వాటికోసం వెచ్చించిన మేధస్సు, శ్రమ, సమయం, డబ్బు, వేరే ప్రజాకర్షక కార్యక్రమాలకు వెచ్చిస్తే పుష్కలంగా ఓట్లు పొందవచ్చు. కానీ ఓట్లు, అధికారం కంటే మానవ మనుగడ ముఖ్యమని భావించే నాయకుడు కేసీఆర్.
వేముల ప్రశాంత్‌రెడ్డి