‘కే..సీ..ఆర్..’ అనే ఈ మూడచ్చరాలు ఏం జేసినా అది పెద్ద వార్తనే అయితది. అదేంది, ఆయన ముఖ్యమంత్రి గదా, ఆయన కూసున్న కుర్సీ అసొంటిది. ఆ కుర్సీల ఎవ్వల్గూసున్నా, ఏం మాట్లాడినా వార్త రాసుడే మీ పని గదా అని మీరడుగవచ్చు గూడ! కానీ ముఖ్యమంత్రి కుర్సీ వేరు. ఆ కుర్సీల కూసున్న వ్యక్తి కేసీఆర్ వేరు… కేసీఆర్ అసొంటొళ్లు అరుదుగా, పాలపిట్టోలె కనవడ్తరు.
నాకు బుద్ధి తెలిసినప్పటికే కేసీఆర్ నాయకుడు. నాయకుడంటే ఆషామాషీ నాయకుడు గాదు, ఉద్యమ నాయకుడు. అప్పుడు ఆయనేం ప్రకటన జేసినా నాలుగు కోట్ల మంది ఆయన వెంట నడిసిండ్రు. అంతమందిని ఒక్కతాటికి మీదికి తీసుకచ్చుడంటే ఉత్త ముచ్చట్నా? అంతెందుకు మన పక్కింట్ల ఉన్న ఇద్దరన్నదమ్ముల్నే సూడరాదుర్రి. తలో మాట మాట్లాడ్తరు. చిన్నోడంటే పెద్దోనికి గిట్టదు, పెద్దోడంటే చిన్నోనికి గిట్టదు. గని ఏండ్ల తరబడి ఇంతమందిని ఒకేతాటిమీద నిలబెట్టి రాష్ర్టాన్ని సాధించటమంటే మామూలు ముచ్చటనా..? అందుకే ఆయన కేసీఆర్ అయ్యిండు. కేసీఆర్ను పాలపిట్టతోనే ఎందుకు పోల్సిన్నంటే… పాలపిట్ట ఎంత సచ్ఛమైనదో మనకెరుకే.. అసొంటి పాలపిట్టలు ఎన్కట మస్తు కనవడ్తుండెనని పెద్దలు ముచ్చట చెప్పంగ ఇనింటిని. కానీ పాలపిట్టలు ఇప్పుడెక్కువున్నయా, లేవు. అక్కడోటి, అక్కడోటి కనవడ్తున్నది..!
కేసీఆర్ ఆలోచనలను, ఆయన తీసుకునే నిర్ణయాలను ఉద్యమం కాన్నుంచి సూత్తున్న. వాళ్లీళ్లను జూసి కాపీ కొట్టిందొక్కటుంటే ఒట్టు. కానీ ఆయనొక్క మాట మాట్లాడితే తెలంగాణ జనాలకు అది ఆణిముత్యం లెక్క. ఆయన పాడే పద్యాలైనా, ఆడే కైతికాలైనా సుతిల్ బాంబులెక్కనే పేల్తయి గని ఉత్తగనే తుస్సుమనయి. ఆయన మాటలు కొన్నొద్దులు జనం నోట్లె నానుతయి. అసొంటి అరుదైన కేసీఆర్ ముచ్చట్లను కొన్ని యాజ్జేసుకుందాం.
2018 అసెంబ్లీ ఎన్నికలు ముగిసినయి. మళ్లా సీఎం కుర్సీ మీద కూసున్నడు కేసీఆర్. అసెంబ్లీ సాక్షిగా ఓసారి కాంగ్రెస్ నేతలనుద్దేశించి ‘మీకు తెల్వద్.. మా దగ్గరో ఇంకో రెండు పథ కాలున్నయి, అవిగినా అమలైతే ఇగ మీ పని కతమే…’ అని నవ్వుకుంటా ఓ తూటా ఇడ్సిండు. అంతే ఆ సభల కూసున్నోళ్లంతా పగలబడి నవ్విర్రు. ఆఖరికి స్పీకర్ గూడ నవ్వాపుకోలేదంటే కేసీఆర్ మాటల్లో ఎసొంటి చమత్కారం ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఆ రెండు పథకాలేంటియో… ఎంత గింజుకున్నా ఎవ్వరికి అర్థం కాలేదు. కాంగ్రెస్ నాయకులైతే కొన్నొద్దులు నెత్తి గోక్కున్నరనుకో. ఇప్పటికి ప్రతిపక్ష నాయకులు ‘మేం అధికారంలకు అస్తే అది జేస్తాం, ఇది జేస్తామంటూ ‘కొత్త సీసాల పాత సారా పోసినట్టే..’ కేసీఆర్ అమలుచేసిన పథకాలను కాపీ కొడుతూ పాత ముచ్చట్లే చెప్తరు గని ఒక్కటన్న కొత్త ముచ్చటుంటదా..? ప్రజల బాగు కోసం, ప్రజల మంచి కోరేటోళ్లకు కొత్త కొత్త ఆలోచనలు పుట్టుకొస్తయి గని, ఎప్పుడెప్పుడు అధికారంల కూసుందామా అని ఆరాటపడేటోళ్లకు ఆలోచనలు పుడ్తయా?
‘ఓసారి గిట్లనే.. కొంగరకలాన్ల జరిగే పెద్ద మీటింగుకు పిలుపునిచ్చిండు కేసీఆర్. రాష్ట్ర నలుమూలల నుంచి ఉర్కచ్చిర్రు జనాలు కేసీఆర్ మళ్లేం ముచ్చట చెప్తడోనని. ఆ సభల అన్ని మంచి ముచ్చట్లే జెప్పిండు గని, ఆఖరికి కాంగ్రేసొల్లను మాత్రం ‘త్పూ.. మీ బత్కు జెడ’ అన్నడు. అంతే ఆ మాట అప్పట్నుంచి మాంచి హిట్టయింది. ‘ఓ లచ్చ రూపాలిద్దామంటవా..’, ‘ఆడోడు, ఈడోడు మోపైనారు..’ లాంటి ఎన్నో ముచ్చట్లు ఇట్లా కేసీఆర్ నోట్లె నుంచి వచ్చుడే లేటు అవి ఆణిముత్యాలై ఫేస్బుక్, వాట్సాపులల్ల తిరుగుతనే ఉంటయి.
ఇదంతా ఇప్పుడెందుకు చెప్తున్ననంటే… మొన్న రాత్రి తొమ్మిదింటికి ఇంటికి వోంగ కాయగూరలు కొందామని దుకాన్లకు వోయ్న. అక్కడ మొత్తం కేసీఆర్ ముచ్చటే.. ‘రేపు పదింటికి కేసీఆర్ ఏమో చెప్తుడట గదా..? అందర్ని టీవీల ముందట కూసోమన్నడట గదా..?’ బెండకాయలిర్సుకుంటా ఇద్దరు పిలగాండ్లు ముచ్చట వెట్టుకుంటున్నరు. నిన్న పొద్దున్న ఎక్స్ రే కోసమని నిమ్స్ దవాఖానకు వోయ్న. అక్కడగూడ అదే ముచ్చట. ఓ కాంట్రాక్టు ఉద్యోగి ఉర్కచ్చి ఎక్స్రే కౌంటర్ మీద కూసున్నాయ్నకు ‘కాంట్రాక్టు ఉద్యోగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు’ అని టీవీలొస్తున్న స్క్రోలింగ్ సూపెడుతున్నడు. ఆ ఇద్దరి మొహాలళ్ల నవ్వులు కనవడ్డయి. మొన్న వనపర్తిల ‘నిరుద్యోగులంతా రేపు పొద్దున టీవీల ముందు కూసోవాలె’ అని కేసీఆర్ చెప్పిన ముచ్చటతోని రాష్ట్రంల జరుగుతున్న చర్చలన్నీ పక్క తొవ్వ వట్టినయి. ఆఖరికి ప్రపంచంల నడుస్తున్న ‘ఉక్రెయిన్-రష్యా’ చర్చ గూడ మాయమైంది. అదీ కేసీఆర్ అంటే.. అట్లాని కేసీఆర్ చెప్పిన ముచ్చట సిన్నదేం కాదు గదా..? దగ్గెర దగ్గెర లక్ష కుటుంబాలు, వారి తరాలు కూడా బాగుపడే ముచ్చట.
– అజ్జిరం, 91827 77252