Terrorism | రెండు దశాబ్దాలుగా తగ్గుముఖం పట్టిన పాక్ ప్రేరేపిత కశ్మీర్ ఉగ్రవాదం మళ్లీ జడలు విప్పుతున్నది. రోజు విడిచి రోజు అన్నట్టుగా ఉగ్రదాడులు జరుగుతున్నాయి. భద్రతాదళ జవాన్లు తరచుగా ఈ దాడుల్లో అమరులవుతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. సాయుధ బలగాలే కాకుండా సామాన్య పౌరులనూ ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన రోజే కశ్మీర్లోని రియాసీ జిల్లాలో ఉగ్రవాదుల దాడిలో 9 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. టెర్రరిస్టుల్లో అమానుషత్వం లోలోతుల్లోకి పడిపోతున్నట్టు ఇది సూచిస్తున్నది. ఎడతెరిపి లేకుండా దాడులతో తెగబడుతూ భద్రతా దళాలకు ఉగ్రవాదులు సవాల్ విసురుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.
1990-2000 సంధికాలంలో కశ్మీర్లో టెర్రరిజం పెట్రేగిపోయిన సంగతి తెలిసిందే. 2003లో ఆపరేషన్ సర్ప వినాశ్తో దాన్ని అణచివేశారు. దాదాపుగా అణగిపోయిందనుకున్న ఉగ్రవాదం మళ్లీ ఇటీవలి కాలంలో ఎలా, ఎందుకు విజృంభిస్తున్నదనే ప్రశ్న దేశ ప్రజలను వేధిస్తున్నది. భద్రతా నిపుణులు ప్రధానంగా ఇందుకు రెండు కారణాలు ఎత్తి చూపుతున్నారు. మొదటిది, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరగడంతో సైనిక దళాల మోహరింపు ఆ వైపు అధికమై కశ్మీర్లో తగ్గిపోవడం. ఇది నిఘా, గూఢచార వ్యవస్థపైనా ప్రభావం చూపిందని అంటున్నారు. రెండవది, అంతర్గత సమస్యల వల్ల పాకిస్థాన్లో నిస్పృహ పెరిగిపోతూ ఉండటంతో కొత్త కొత్త ఉగ్రవాద సంస్థలు పుట్టుకురావడం. సరిహద్దులకు ఆవల నుంచి వచ్చేవారే కాకుండా స్థానిక యువతను కూడా ఉగ్రవాదులుగా మారుస్తున్నట్టు వినవస్తున్నది. సైనిక వాహనాలపై పొంచి ఉండి దాడులు చేస్తుండటంతో జవాన్లు అధిక సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. కట్టుదిట్టమైన నిఘా మధ్య తిరిగే ఈ వాహనాలపై గురితప్పకుండా దాడి చేయడం అంత చిన్న విషయమేమీ కాదు. ఏదేమైనప్పటికీ ఉగ్రదాడుల్లో నిత్యం సుశిక్షితులైన సైనికులు, అమాయక పౌరులు మరణిస్తుండటం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు.
కశ్మీర్ ఉగ్రవాదాన్ని అణివేసేందుకు బలగాలను పెంచడంతో పాటుగా బహుముఖ వ్యూహాన్ని అమలు చేయాల్సి ఉంటుందని చెప్పక తప్పదు. ఇందుకు అన్నిస్థాయుల్లో సత్వర, నిర్ణయాత్మక కార్యాచరణ రూపొందించుకోవడం తక్షణావసరం. ప్రామాణికమైన ఆచరణ నియమావళిని కఠినంగా పాటించాల్సి ఉన్నది. అదేవిధంగా పాక్ సరిహద్దుల్లో ఎక్కడైనా చిన్నాచితకా నిఘా లోపాలుంటే వాటిని సరిదిద్దేందుకు తక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంది. 370 అధికరణం రద్దుతో కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని కోల్పోయింది. అంతేకాకుండా రాష్ట్ర హోదా కూడా రద్దయిపోయి, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోయింది. లడఖ్ పోను మిగిలిన జమ్మూకశ్మీర్ ప్రాంతానికి తిరిగి రాష్ట్ర హోదా కల్పిస్తామన్న హామీ ఇప్పటికీ నెరవేరలేదు. అసెంబ్లీని ఏర్పాటుచేసి, ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో తెలియదు. ఇది స్థానిక ప్రజల్లో కొంత అసంతృప్తికి దారితీసే అంశమే. భద్రతా యంత్రాంగాన్ని బలోపేతం చేయడంతో పాటుగా భాగస్వాములందరినీ కలుపుకొని పోతే గానీ ఉగ్రవాద సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదు.