భారత స్వాతంత్య్ర పోరాటం సాగుతున్న రోజుల్లో తెలంగాణలో పత్రికలు నిర్వహించిన పాత్ర అనుపమానమైనది. ‘అక్షరరూపం దాల్చిన ఒక సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’ అన్న కాళోజీ మాట పత్రికలు, ప్రజాస్వామ్య మనుగడకు ఆధారమవుతున్నది. తొలి తరంలో బ్రిటిష్ ప్రభుత్వం, ఆ తర్వాత నిజాం సర్కార్ల వల్ల పత్రిక నిర్వహణలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొవాల్సి వచ్చింది.
స్వేచ్ఛ, స్వాభిమానాలను కోల్పోకుండా కత్తి మీద సాములా పత్రికా నిర్వహణ చేస్తూ ఒకవైపు దేశ స్వాతంత్య్రం కోసం, మరోవైపు నిజాం పాలనను అంతమొందించడంలో పత్రికలు కీలకభూమిక పోషించాయి. అదేవిధంగా సామాజిక జీవనంలో విలువలను ప్రతిష్టించడంలోనూ, సమాజ గమనాన్ని నిర్దేశించడంలోనూ కృషి చేసిన పత్రికా ప్రముఖులెందరో ఉన్నారు. ఈ క్రమంలో తెలంగాణలోని పత్రికలు, పాత్రికేయుల అవిరళ కృషి చిరస్మరణీయమైనది.
తెలంగాణ చరిత్ర, సాహిత్య, సాంస్కృతిక వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో వరంగల్ ప్రధాన పాత్ర నిర్వహించింది. కాకతీయుల పౌరుష ప్రాభవాలకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన రాజధాని నగరమిది. వరంగల్ జిల్లా పత్రికారంగ చరిత్ర సింగిడిని తలపిస్తుంది. అన్ని తత్త్వాలను, అన్ని ఇజాలను, ఎన్నో నిజాలను తనదైన శైలిలో ప్రజలకు అందించి, చైతన్యాన్ని రగిలించిన ఘనత వరంగల్ జిల్లా పత్రికారంగానిది. వరంగల్ జిల్లా పత్రికారంగానికి ప్రథములు ‘తెనుగు’ పత్రికను వెలువరించిన ఒద్దిరాజు సోదరులు. వీరిని ఆదర్శంగా తీసుకొని వరంగల్ జిల్లాలో దాదాపు 175 పత్రికలు వెలువడటం గర్వకారణం. అలాంటి పత్రికల్లో ‘కాకతీయ’ వార పత్రిక చేసిన కృషి అజరామరమైనది.
పాములపర్తి సదాశివరావు, పీవీ నరసింహారావుల ఆధ్వర్యంలో 1948, సర్వధారి నామ సంవత్సరం దీపావళి రోజున జాతీయ వార పత్రికగా ‘కాకతీయ’ వెలువడింది. ఈ పత్రికకు సదాశివరావు సంపాదకులుగా వ్యవహరించగా, వరంగల్‌లోని కాకతీయ ప్రెస్‌లో ముద్రించేవారు. ఇది రాజకీయ నేపథ్యంతో వెలువడిన పత్రిక. 1949, జూలై 17 నాటి సంచిక ముఖచిత్రంపై ‘ప్రేమించండి ఒకరికొకరు సాయపడండి’ అనే సూక్తి కనిపిస్తుంది. బహుశా ఇది వీరి ధ్యేయ వాక్యమై ఉండవచ్చు.
పత్రిక వెల 20 పైసలు. ఈ పత్రికలో రాజకీయ, చారిత్రక, సామాజిక, సాంస్కృతిక, సాహిత్య అంశాలతో పాటు వ్యంగ్యాత్మకమైన కార్టూన్లు కూడా కనిపిస్తాయి. అక్కడక్కడ ప్రకటనలు ప్రకటితమయ్యేవి. ప్రజా సమస్యలకు అద్దం పడుతూ పత్రికారంగ చరిత్రలో ఒక గొప్ప రాజకీయ వారపత్రికగా నిలిచిపోయింది ‘కాకతీయ’. 1949 నాటిది అయినప్పటికీ, నేటి ప్రముఖ పత్రికలకు దీటైన రీతిలో నాడే వెలువరించడం నిర్వాహకుల కృషికి తార్కాణం. ఇది 1955 వరకు వెలువడింది. చలసాని ప్రసాదరావు, పి.ఎన్.స్వామి, జగదీశ్వర్‌రావు, పెండెం శ్రీనివాసరావు ఇందులో పనిచేశారు.
1949, అక్టోబర్ 21 నాటి సంచికలో ‘మనవి- నివేదన’ శీర్షికన వెలువడిన సంపాదకీయంలో ఈ పత్రిక ఉద్దేశం, లక్ష్యం సుస్పష్టమయ్యాయి. ‘అక్షరాస్యతకు మొహం వాచి దారిద్య్ర, అజ్ఞానాలతో అలమటించి కుమిలి కుమిలి తుదకు అశేష త్యాగాలతో దాస్యశృంఖలాలను పటాపంచలు చేసి ప్రజాతంత్ర చైతన్యంతో ఇప్పుడిప్పుడే ప్రజ్వలిస్తున్న తెలంగాణ, ఈ నూతన స్వాతంత్య్ర వాటిక హైదరాబాదు, ఒక్క సంవత్సరంగా అవిరామంగా కృషి చేస్తూ, ఇంకా స్వరాజ్యాన్ని చేపట్టలేక వినూతనాశారేఖలతో భవిష్యత్తును చిత్రితం చేసుకుంటున్న మా అభిమాన సోదర పౌరకోటి. ఈ పరిసరాల్లో మేము కాకతీయ పత్రిక ద్వారా హృదయ పూర్వకం గా చేస్తున్న కించిత్సేవ వల్ల లేశమైన ప్రజాప్రయోజ నం సాధన అవ్వగలిగిందంటే మా ఉద్యమం ఫలించినట్లు భావించి మేమెంతో ఆనందిస్తాము’. ఈ విధంగా కాకతీయ పత్రిక తన ఉద్దేశాన్ని, లక్ష్యాన్ని నిర్భయంగా, నిజాయితీతో ప్రకటించిన తీరు ఆ పత్రి క పురోగమనానికి మరింత దోహదపడినట్టు తెలుస్తున్నది.
ఈ సంపాదకీయం నాటి తెలంగాణ సామాజిక స్థితిని గోచరింపజేస్తుంది. ఈ పత్రిక నడిచినంత కాలం సమకాలీన సమాజానికి సమాచార సేవ చేసింది. చైతన్యపూరితమైన ఆలోచనలను ప్రేరేపించింది. ఎంతో మంది జర్నలిస్టులను తయారు చేసింది. నిజాం వ్యతిరేకోద్యమ సందర్భంలో పోలీసు చర్య తర్వాత మిలిటరీ అధికారి సంజప్ప ఆధ్వర్యంలో వరంగల్ జిల్లాలోని పాకాలలో 24 మంది గిరిజనులను కాల్చి వారిని మిలిటరీ ట్రక్కుకు కట్టి ఊరేగించారు. ఆ వార్తను కాకతీయ విలేకరి పి.ఎన్.స్వామి పత్రికకు పంపించగా, అది ప్రచురితమై నిజాం ప్రభుత్వం దృష్టికి వెళ్లింది.
ఆ వార్తను ప్రచురించినందుకు 1948లో పాములపర్తివారికి అప్పటి కలెక్టర్ పళనియప్పన్ నుంచి కబురు అందింది. సమయ పాలనకు ప్రాధాన్యాన్ని ఇచ్చే సదాశివరావు నిర్భయంగా టాంగాలో వెళ్లి 15 నిమిషాలు వేచి చూసినా కలెక్టర్ కార్యాలయానికి రాకపోవడంతో వెనక్కితిరిగి వచ్చేశారు. ఇది వారి ఆత్మ గౌరవానికి ప్రతీక. ఈ విషయం తెలిసిన పళనియప్పన్.. డిప్యూటీ కలెక్టర్‌ను (దువ్వం తాలూకుదారు) పంపించి సదాశివ రావును మళ్లీ పిలిపించారు. ఆ వార్తను ఖండించారు.
మార్క్సిస్టు మేధావి అయిన సదాశివరావు మొదట ముద్రించిన వార్తతోపాటు ఖండనను కలిపి మరోమారు ముద్రించారు. ఈ విధంగా కాకతీయ పత్రిక నిజాల్ని నిర్భయంగా జన సామాన్యానికి చేరవేయడంలో నిర్వహించిన పాత్ర పత్రికారంగానికి మార్గదర్శకమైనది. కాకతీయ పత్రిక వార్తలను ప్రచురించడంలో నిజాయితీ, నిర్భీతి, ముక్కుసూటిదనం, వాస్తవిక ధోరణులను ప్రతిబింబించినట్టు తెలుస్తున్నది.
పత్రికను వెలువరించడమే కష్టతరమైన కాలంలో స్వాతంత్య్ర ఉద్యమ ఘట్టాలను, నిజాం పాలకుల అకృత్యాలను, సమకాలీన సామాజిక రాజకీయ రంగంలోని విశేషాలనే కాకుండా, వివిధ వార్తాంశాలను వ్యంగ్యాత్మక కార్టూన్ల సహితంగా చక్కని సమీక్షలు, విశ్లేషణలతో ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసే విధంగా రాజకీయ వ్యాఖ్యలను అందించడం ఈ పత్రిక ప్రత్యేకత. కార్టూనిస్టు మల్లారెడ్డి వేసిన చిత్రాలు ఈ పత్రికకు మరింత వన్నె తెచ్చాయి.
1949, ఆగస్టు 15 నాటి సంచికలో ‘విజయ’ కలం పేరుతో పీవీ రాసిన ‘గొల్లరామవ్వ’ కథ ప్రచురితమైంది. నాటి (1947- 48) తెలంగాణ ప్రాంత గ్రామీణ స్థితికి ప్రతిరూపంగా వెలువడిన కథ ఇది. ఈ కథలో రజాకార్లతో జరిగిన సాయుధ పోరాటంలో అజ్ఞాతంలో ఉన్న స్వాతంత్య్ర సమరయోధుడిని గొల్ల రామవ్వ తన మరిదిగా చెప్పి రక్షణ కల్పించడం కథా వస్తువు. కథా ప్రక్రియకు ఉండాల్సిన మౌలిక లక్షణాల న్నీ ఈ కథలో ఉన్నాయి. కథకు అవసరమైన సంక్షిప్తత, సంభాషణల్లో ఔచిత్యం, అద్భుత రీతిలో ఉండాల్సిన ముగింపు ఇందులో ఉన్నాయి. తెలుగు కథా సాహిత్యంలో మణిపూస వంటి కథ ‘గొల్లరామవ్వ’. ఆధునిక తెలంగాణ చరిత్రలో 1946- 48 కల్లోల కాలం నాటి రోజులను సమీక్షించుకునేందుకు తెలంగాణ యాసలో రాసిన ‘గొల్లరామవ్వ’ వంటి కథలను ప్రచురించిన ఘనత కాకతీయ పత్రిక ఖాతాలో చేరింది.
రాఘవరెడ్డి, అల్లా దుర్గయ్య, బి.రామరాజు, కాళోజీ, సినారె, సురమౌళి, కోవెల సుప్రసన్న, ధూపాటి సంపత్
కుమారాచార్య, వానమామలై వరదాచార్య, దాశరథి కృష్ణమాచార్య, దాశరథి రంగాచార్య, విద్వాన్ విశ్వం, పొట్లపల్లి రామారావు, ధూపాటి వెంకటరమణ కవులు, విశ్వనాథ సత్యనారాయణ వంటి ప్రముఖులు రాసిన కవితలు, కథలు, వ్యాసాలు కాకతీయ పత్రికలో ప్రచురితమయ్యాయి.
దాశరథి కృష్ణమాచార్య రాసిన ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’, ‘మా నిజాం రాజు జన్మజన్మల బూజు’ అనే కవితలను మొదట కాకతీయ పత్రికలోనే ప్రచురించారు. యువకులను ప్రోత్సహించి వారిలోని సృజనకు పట్టం కట్టింది ఈ పత్రిక. అంతేకాకుండా వారిని దేశం గర్వించదగిన ప్రముఖ కవులుగా, రచయితలుగా తీర్చిదిద్దిన గొప్ప పత్రిక ‘కాకతీయ’.
ఈ పత్రిక సాహిత్యానికి సముచిత స్థానం కల్పించి కవితల పోటీని నిర్వహించేది. సాహిత్యం కోసం ప్రత్యేక పేజీని కేటాయించేవారు. తద్వారా సాహితీ విలువలు కలిగిన పత్రికగా పాఠకలోకాన్ని అలరించింది. పాములపర్తి సదాశివరావు, పీవీ నరసింహారావులు జయ, విజయ, రాజహంస, భట్టాచార్య, రాజా వంటి మారుపేర్లతో పాఠకాదరణకు యోగ్యమైన రీతిలో కథలు, వ్యాసాలు మొదలైనవి రాసేవారు.
-డాక్టర్ నమిల కొండ సునీత ,99084 68171