Kaloji | నిర్భీతికి నిదర్శనం కవి కాళోజీ. జనం గుండె చప్పుళ్లు అక్షరాలై సాక్షాత్కరిస్తే.. అవే కణకణ మండే అగ్నికణాల కవితలైతే.. ఆ కవితలకు చిరునామా కాళోజీ. అణువణువునా తెలంగాణ పదం పలికించి, ప్రజా బాహుళ్యాన్ని జాగృతపరిచిన వైతాళికుడు మహాకవి కాళోజీ. అతడొక ప్రజాకవి. తెలంగాణ ప్రజల గుండెలొక్కటై ఆవిష్కరించిన ఆయుధం కాళోజీ.
మన కాళన్న కవితను ఖడ్గంగా మలిచి నిరంకుశత్వాన్ని, పరాయి పాలనను నిరసించిన సునిశిత విమర్శకుడు. సమాజంలోని సమస్త కోణాలను సమదృష్టితో వీక్షించిన కవి విమర్శకుడు. నిష్పాక్షికంగా, నిర్మొహమాటంగా మన తరాన చరించిన మహానుభావుడు మన కాళోజీ. ప్రజా ఉద్యమం ప్రతిధ్వనిస్తే పరాయి పాలన నిరాకరిస్తే నిరంకుశత్వాన్ని నిరసిస్తే… కలం ఉప్పెనై ఉప్పొంగుతుంటే ఆ గళం పేరు కాళోజీ. జనం గుండె చప్పుళ్లు.. అక్షరాలై సాక్షాత్కరిస్తే ఆ కవితల చిరునామా కాళన్న. మన యాసను, మన భాషను మన ధ్యాసను, మన గోసను నా గొడవంటడు కాళన్న..
‘మన కొంపలార్చి.. మన స్త్రీల చెరచిన మన పిల్లలను చంపి.. మనల బంధించిన మానవాధములను మరచిపోకుండగా గురుతుంచుకోవాలే కసియారిపోకుండ బుసకొట్టు చుండాలెకాలంబు రాగానే కాటేసి తీరాలె’.
కాళోజీ కవిత్వంలో నిబద్ధత, నిరాడంబరతే తప్ప పద గాంభీర్యమో, పదాడంబరమో కనిపించవు. చెప్పదలచుకున్నది సూటిగా, మనసుకు హత్తుకునేలా చెప్పడం ఆయన శైలి. పెద్దాయన చివాట్లు పెడుతున్నట్టు అనిపించినా ఆయన అంతఃకరణ శుద్ధి ఆవిష్కృతమవుతుంది. యాభైయ్యవ దశకం నుంచి దాదాపు మూడు, నాలుగు దశాబ్దాల పాటు సాగిన ఆయన కవితా ప్రస్థానం అనేక సందర్భాల్లో ప్రోత్సాహరూపకంగా, విమర్శనాత్మకంగా, ప్రబోధాత్మకంగా సాగిపోయింది. సమాజంలోని అన్ని కోణాలు స్పృశించి అవసరం ఉన్నచోట వేలెత్తి చూపించి సన్మార్గాన్ని కవితలుగా ప్రబోధించిన బోధిసత్వుడు.
‘జరిగినదంతా చూస్తూ ఎరగనట్లు పడి ఉండగ సాక్షీభూతుణ్ణిగాను-సాక్షాత్తు మానవుణ్ణి’ అంటూ మానవత్వాన్ని నిర్వచిస్తాడు. సమకాలీన సమాజంలోని అవకతవకలను సవరించే ఆ ప్రయత్నం లేదా ఆ సవరించేవారికి సహకరించే ప్రయోజనాత్మక క్రియాశీల ప్రయోగమే ఆయన కవితల దండయాత్ర.
కాళోజీ భావజాలంలో గానీ, వ్యక్తిగత ఆచరణలో గానీ ప్రధానంగా గోచరించేది స్వేచ్ఛ. అది ఆయనను ధిక్కార కవిగా, ఉద్యమకారునిగా రూపుదిద్దింది. ‘కాళోజీ కవితలు విన్నాం.. కమ్యూనిస్టనుకున్నాం’ అనే ముద్ర గానీ, నక్సలిజం ఉధృతంగా సాగుతున్నప్పుడు పౌరహక్కుల కోసం గొంతెత్తినా, ఆయనపై ‘నక్సలైటు అభిమాని’ అనే ముద్రగానీ పడలేదు. ప్రజాస్వామ్యంలో నిరంకుశత్వం, నియంతృత్వం ఉండకూడదనే వాదాన్ని, వ్యక్తిస్వేచ్ఛను బలంగా నమ్మి సంకెళ్లు లేని జీవన విధానం ఉండాలని కోరుకున్నాడు కాళోజీ. అది ఇది అని కాక, ఏదైనా మంచిని మంచిగా చెడును చెడుగా దర్శించిన సద్విమర్శకుడు కవి కాళోజీ. కాళోజీ గురువుగా భావించిన గార్లపాటి రాఘవరెడ్డిని అయ్యగారు అని పిలుస్తూ తన కవితలను ఆ రాగన్నకు వినిపించేవారట. ఆ గురుశిష్యుల సంబంధాన్ని తానే ఓ కవితలో…
‘గురువు విరాగి రాగన్న
లఘువు రాగి కాళన్న
అక్షర జగత్తు సాంతం
గురువు లఘువుల సొత్తు’ అని ఆత్మవిశ్వాసంతో చెప్పారు. తన గేయాలను గోలకొండ పత్రికలో ప్రచురించిన సురవరం ప్రతాపరెడ్డిని ‘నా గొడవ ప్రకటింప నాంది అయినవాడు అక్షరాల గోలకొండ కట్టిన వాడు’ అంటూ ప్రశంసించాడు. గూండాగిరీ-దాదాగిరీలను నిరసించిన కాళోజీ తన గర్జనను ఎలా వినిపించాడో చూస్తే అబ్బురమనిపిస్తుంది. ‘అన్యాయాన్నెదిరించడం ద్రోహమైతే ఆ ద్రోహమే నా జన్మహక్కు’ అంటూ నొక్కి వక్కాణించాడొక కవితలో. ఇక మాతృభాషాభిమానం, తెలుగు భాష పట్ల గౌరవం ఆయన కవితల్లో ఇలాగ ప్రతిబింబించింది.
‘తెలుగు బిడ్డవురోరి తెలుగు మాట్లాడుటకు సంకోచ పడియెదవు సంగతేమిటిరా?
అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా?’ అంటూ నిస్సంకోచంగా కడిగి పారేశాడు కాళన్న. మాతృభూమి, మాతృదేశం అంటే ఎంతో భక్తి. తెలంగాణ అన్నా అంతే భక్తి, గౌరవమున్నూ. ‘లాఠీదెబ్బల లక్ష్యమేమి కఠినశిక్షయే కాదు కాదు చావుకైననూ జంకనీయదు మాతృదేశము మాతృదేశమే’ అంటాడు భారతావనిని గౌరవిస్తూ. అలాగే తెలంగాణ సాధన కోసం.. ‘పదరా పదరా పోదాం పదరా దొంగల దూరం కొడదాం పదరా తెలంగాణ సాధిద్దాం పదరా వేరే రాజ్యం చేద్దాం పదరా’ అని నినదించాడు. నాడు తెలంగాణ ప్రాంతాన్ని చిన్నచూపు చూడటాన్ని నిరసిస్తూ..‘తిన్న తిండెవ్వరిదే కోయిలా పాడు పాటెవ్వరిదే కోయిలా’ అంటూ చురకలంటించాడు కూడా. ‘తెలంగాణ వేర్పాటు కాదు, ఏర్పాటు రాజ్యాంగబద్ధం, ప్రజాభీష్టం’ అంటూ మనసా, వాచా, కర్మణా నమ్మి పిడికిలి బిగించినవాడు కవి కాళోజీ.
తెలంగాణ భాషా భాస్కరుడు కాళోజీ అడుగుజాడల్లో కార్యోన్ముఖుడై నడుస్తూ, వారి కలలను సాకారం చేసే ప్రగతి ప్రాకారానికి శ్రీకారం చుట్టి, అనతికాలంలోనే ఆశ్చర్యాద్భుతరీతిలో అన్నిరంగాల్లో తెలంగాణ భాషా సౌరభాలను ప్రసరింపజేసిన ఘనతర చరిత తెలంగాణాధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుదే అనటం నూటికినూరు పాళ్లు నిక్కచ్చి నిజం. తుంగభద్ర నుంచి తుమ్మిడిహట్టి వరకు, కిన్నెరసాని నుంచి కాగ్నా వరకు యావత్తు తెలంగాణ జనగణాలను తన మంత్రముగ్ధ మాండలిక తెలంగాణ గళంతో ఉద్యమాన్ని ఉర్రూతలూగించి, ప్రజాభీష్ట ప్రత్యేక తెలంగాణ ప్రభుత పతాక పరమోన్నత ప్రేరకమై ప్రకాశించి.. అహింసాపథంలో సాధించిన స్వరాష్టంలో కాళోజీ కలలుగన్న పలుకుబడుల భాషను ప్రపంచ తెలుగు మహాసభ ప్రభల వైభవభాషగా మలిచారు. మరుగునపడిన తెలంగాణ ప్రాంగణ స్ఫూర్తి కిరణాలను తేజో తోరణాలుగా అలరింపజేశారు.
కాళోజీ పురస్కార నిరంతర ప్రదానాల పరంపరతో కాళోజీ కీర్తిస్ఫూర్తిని కలకాలం నిలుపుతున్న అభినవ సాహితీ సమరాంగణ సార్వభౌములు బాపు కేసీఆర్. తెలంగాణ శ్వాసగా, ఆశగా, భరోసాగా, కాళోజీ వాస్తవిక వారసులుగా విరాజిల్లుతున్నారనడంలో అణుమాత్రం అతిశయోక్తి లేదు. ఇది గోల్కొండ కోటలో ఎగురుతున్న భవ్య బావుటా సాక్షిగా సాక్షాత్కరిస్తున్న సత్యం.
కాళోజీ తరం శ్రీకారం చుట్టిన ప్రత్యేక తెలంగాణ వాదం బాపు కేసీఆర్ గళం పలికిన జై తెలంగాణ నినాదమై కోటి గొంతుకలందు ప్రతిధ్వనించి, నాలుగు కోట్ల పిడికిళ్లు బిగిసి, నలుదిక్కులు పిక్కటిల్లి అరువదేండ్లుగా కంటున్న కల సాకారమై రాష్ట్రం ఆవిర్భవించింది. నేటి సర్వతోముఖాభివృద్ధిని కనులారా తిలకించి ఉంటే బాపు కేసీఆర్ భుజం తట్టి సెహబాసులు పలుకుతూ విశ్రమించి ఉండేవాడేమో కాళన్న.. తన తెలంగాణ వాదం జై తెలంగాణ నినాదమైందని సంతృప్తిగా శ్లాఘిస్తూ…
వ్యాసకర్త: తెలంగాణ రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షురాలు)
-మంత్రి శ్రీదేవి
98482 54678