రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని రేవంత్‌రెడ్డి సర్కారు కొలువుదీరాక కాళేశ్వరం ప్రాజెక్టుకు మకిలిపట్టింది. ఆ ప్రభుత్వం కక్షపూరితంగా ప్రాజెక్టును పండబెట్టడంతో పంటలన్నీ ఎండిపోయాయి. తత్ఫలితంగా ఈ ఏడాది సాగు విస్తీర్ణం భారీగా పడిపోయింది. పంటలు ఎండిపోయి తెలంగాణ తల్లి తల్లడిల్లుతున్నది. అన్నపూర్ణగా వెలుగొందిన రాష్ట్రం కాస్త రైతన్న కన్నీటితో, ఆకలితో అల్లాడే దుస్థితికి చేరుకున్నది. కేసీఆర్ పేరును చెరిపివేయాలనే కుట్రలో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక వైఖరిని అవలంబిస్తున్నది.
‘పానీకి హర్ ఏక్ బూంద్ దేతీహై జిందగాని జల్ జో నహోతా తో ఏ జగ్ జాతా జల్…’అంటే ప్రతీ నీటి చుక్క మనకు జీవితాన్నిస్తుంది. జలం లేకపోతే జగం ఎండిపోతది, మండిపోతది’ అని దీనర్థం.
ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన గోదావరి గురించి పెద్దాయన సుందిల్ల రాజన్న రాసిన ఓ పాట గుర్తువస్తున్నది. ‘పుస్కరాలకొకసారి నీ వొడిలో స్తానమాడి పసివాన్ననుకుంటా తల్లి, జలాశయాలకు నిలయం జలచరాసుల సహవాసం పశువులు పక్షులకే కాదు జీవకోటికాధారం పుడమిని తరియింపజేసి పుష్కలంగ పారుతల్లి గోదారమ్మ ఓ గోదారమ్మ..’ జీవనది పుష్కలంగా పారుతూ బంగాళాఖాతంలో కలిసి వృథా కాకుండా ప్రతీ బొట్టును ఒడిసిపట్టుకొనే దృఢసంకల్పమే ఈ పాజెక్ట్.
కానీ, పుడమి ఏం పాపం జేసిందని నిర్దాక్షిణ్యంగా చుక్క చుక్క ఒడిసిపట్టుకున్న నీటిని వదిలేసిండు రేవంత్‌రెడ్డి. సహజమైన సర్వకోటి జీవరాశికి ఆధారమైన జలసంపదను నాశనం జేశాడు రేవంత్ రెడ్డి. అదీ కేసీఆర్ ఆనవాళ్లు ఉన్నాయనే గదా. రేవంత్ ప్రభుత్వానికి చేతనైతే ప్రజాపాలనలో ప్రజల యోగక్షేమాలే పరమావధి అయినప్పుడు నీళ్లిచ్చి నిరూపించుకోవచ్చు గదా ఈ రేవంత్. రైతుల ఆత్మహత్యలను ఆపాలని, ప్రజాసంక్షేమం కోసం చారిత్రక నిర్ణయంతో కేసీఆర్ నీరిచ్చారు. మరి రేవంత్ ప్రభుత్వమేం జేసింది? వ్యక్తిగత, రాజకీయ కక్ష కోసం నిండు గోదావరినే ఎండబెట్టింది కదా. దానిపై సవాలక్ష అభియోగాలు మోపుతుంది గదా.
బహుళార్థ సాధక ప్రాజెక్టుల నిర్మాణాల్లో ఆటంకాలు, అవరోధాలు, విధివంచితాలు, కష్టనష్టాలు అనివార్యంగా సంభవిస్తాయనేది చరిత్ర ఎరిగిన సత్యం. గత ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయాలను గాని, నిర్మించిన ఏ ప్రాజెక్టులను గాని పరిరక్షించి అనునిత్యం ప్రజలకు ఉపయోగంలో ఉంచే బాధ్యత ప్రస్తుత ప్రభుత్వానిదే. కానీ, ఈ ప్రభుత్వం అలా చేయడం లేదు. ఇది పేరుకే ప్రజాపాలన. నిజానికి అప్రజాపాలనే గాని ఇంకోటికాదు. ఓ దిక్కు పక్కరాష్ట్ర ముఖ్యమంత్రి గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టు ద్వారా 200 టీఎంసీల గోదావరి జలాలను మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకోసం 150 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో బొల్లపల్లి వద్ద ఒక భారీ కృత్రిమ బరాజ్‌ను నిర్మించడానికి ప్రతిపాదించారు. రూ.80 వేల కోట్ల ఖర్చుతో కూడుకున్న ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం అందించాలని చంద్రబాబు కోరిన వెంటనే మోదీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఏపీకి దీన్నొక గేమ్‌ఛేంజర్‌గా చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు అంతాఇంతా కాదు. కొంచెం నిగూఢంగా ఆలోచిస్తే పేరుకే 200 టీఎంసీల వరద నీళ్లని అంటున్నారు. కానీ, దీని ద్వారా ఊహించలేని జలదోపిడీ జరుగబోతుందన్నది వాస్తవం.
ఒకవేళ చంద్రబాబు చెప్తున్నట్టుగానే జీబీ లింక్ పూర్తయితే ఏపీలోని నలుమూలలకు గోదావరి పరవళ్లు తొక్కుతుంది. అందుకు అవసరమైన కెనాల్ వ్యవస్థను కూడా ఎప్పుడో సిద్ధం చేసుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు-మోదీ జతకట్టి మన నీటి హక్కులను హరించేందుకు విఫలయత్నం చేస్తున్నారు. ఒక జల గజ దోపిడీ. కానీ, ఏ మాటకామాట చెప్పుకోవాలి. ప్రజల ఆకాంక్షల ప్రకారం పాలన చేయడమనేది నాయకుడి లక్షణం. కానీ, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహారం మాత్రం ఇలా ఉంది. స్వరాష్ట్ర ప్రజలు నీరులేక కటకటలాడినా ఆయనకు పట్టదు. అంతేగాక, కాళేశ్వరం విషయంలో కేసీఆర్‌కు నోటీసులు పంపుతూ, తన సీటును కాపాడుకునేందుకు ఢిల్లీకి మూటలు మోసుకెళ్లడమే తప్ప అక్కడి నుంచి చిల్లిగవ్వ తెచ్చిన దాఖలాల్లేవు.
– ఆర్ఆర్ఆర్