భారత ప్రధాన న్యాయమూర్తి బాధ్యతల నుంచి విముక్తులైన జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, క్లుప్తంగా బీఆర్ గవాయ్ పదవీకాలం భారత న్యాయచరిత్రలో కీలక ఘట్టంగా గుర్తుండిపోతుందని చెప్పవచ్చు. అత్యున్నత న్యాయపీఠం అధిరోహించిన రెండో దళితుడు, తొలి బౌద్ధుడు కావడం ఓ విశేషమైతే, ఆయన తన పదవిని రాగద్వేషాలకు అతీతంగా నిర్వహించిన తీరు ప్రత్యేకతను చాటుకున్నది. ఆయన వ్యవహారశైలి, వెలువరించిన కీలక తీర్పులు అందుకు నిదర్శనంగా నిలుస్తాయి. సుమారు ఆరు మాసాల పదవీకాలంలో చట్టానికి పట్టం గట్టి, న్యాయానికి పెద్దపీట వేస్తూ ఆయన ఇచ్చిన తీర్పులు పదికాలాల పాటు గుర్తుండిపోతాయి. ముఖ్యంగా పరిపాలన ముసుగులో సాగుతున్న అరాచకాలను, అతిక్రమణలను ఆయన న్యాయమూర్తిగా, తర్వాత ప్రధాన న్యాయమూర్తిగా వెలువరించిన అనేక తీర్పుల్లో తూర్పారబట్టారు. న్యాయవ్యవస్థపై తనదైన ముద్ర వేశారు. అయితే బలమైన తీర్పులు వెలువరించినప్పటికీ వాటి అమలు విషయంలో పట్టుదల చూపకపోవడం గమనార్హం. న్యాయవ్యవస్థ అత్యుత్సాహానికి (జ్యుడీషియల్ యాక్టివిజం) తను వ్యతిరేకమని చెప్పకనే చెప్పారు. భావావేశంతో కాకుండా, ఆయా కేసుల వాస్తవికతను బుద్ధితో విశ్లేషించి తీర్పులు చెప్పాలని అంటారాయన.
నేరస్థుడు తప్పు చేస్తే అతడి కుటుంబాన్ని వీధిన పడేసే బుల్డోజర్ న్యాయం కుదరదని జస్టిస్ గవాయ్ తేల్చిచెప్పారు. కూల్చివేతలకు సంబంధించి మార్గదర్శకాలను జారీచేశారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం కింద ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా చేసే అరెస్టులకూ జస్టిస్ గవాయ్ ముకుతాడు వేశారు. లిఖిత ఆరోపణలు వెల్లడించకుండా ఆ చట్టం కింద అరెస్టులు కుదరవని నొక్కిచెప్పారు. న్యూస్‌క్లిక్ ప్రధాన సంపాదకుడు ప్రబీర్ పురకాయస్థ అరెస్టు అక్రమమని, వెంటనే విడుదల చేయాలని తీర్పునిచ్చారు. ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు తాము నిందితులుగా అరెస్టు చేసిన వ్యక్తుల పక్షాన వాదించే న్యాయవాదులకు ఇష్టారాజ్యంగా సమన్లను జారీచేసే ధోరణికి అడ్డుకట్ట వేశారు. అదేవిధంగా గిట్టని రాజకీయ నాయకులను పాలకులు కటకటాల్లోకి తోసే దుష్ట సంప్రదాయం వెర్రితలలు వేస్తున్న సమయంలో ఢిల్లీ లిక్కర్ కేసులో పలువురి విడుదలకు ఆదేశించి ‘బెయిల్ ఈజ్ ద రూల్ జెయిల్ ఈజ్ ఎక్సెప్షన్’ (బెయిలు ఇవ్వడం సాధారణం.. జైలుకు పంపడం అసాధారణం) అనే సూత్రాన్ని పునరుద్ఘాటించారు. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఫోర్జరీ పత్రాలను సమర్పించారన్న ఆరోపణల కింద అరెస్టయిన తీస్తా సెటల్వాడ్ వ్యవహారాన్ని పరిశీలించేందుకు శనివారం రాత్రి పొద్దు పోయేదాకా విచారణ నిర్వహించి, బెయిలు మంజూరు చేయడం ద్వారా ప్రజాస్వామిక హక్కుల పట్ల తన నిబద్ధతను చాటుకున్నారు. ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో కీలక తీర్పులు మనకు కనిపిస్తాయి. ఇందులో కొన్ని న్యాయమూర్తిగా ఇచ్చినవైతే, మరికొన్ని ప్రధాన న్యాయమూర్తిగా ఇచ్చినవి ఉన్నాయి. జస్టిస్ బీఆర్ గవాయ్ న్యాయనిర్వహణలో తెలంగాణకు సంబంధించి రెండు కేసులు ప్రత్యేకంగా నిలుస్తాయి. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ కంచ గచ్చిబౌలి భూముల్లో సాగించిన అటవీ విధ్వంసంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసి కడిగిపారేశారు. అటవీ పునరుద్ధరణ జరగాల్సిందేనని పట్టుబట్టారు. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎండగట్టి తలంటు పోశారు. స్పీకర్ పదవి న్యాయపరిశీలనకు అతీతమైనదే అయినప్పటికీ ఫిరాయింపుల విషయానికి వస్తే మాత్రం కోర్టు జోక్యం తప్పదని నొక్కిచెప్పారు. నిరంతర సాచివేత ధోరణి కుదరదని నిక్కచ్చిగా చెప్పారు.
జస్టిస్ గవాయ్ పదవీకాలం విధి నిర్వహణపరంగానే కాకుండా ఇతరత్రా కూడా సంచలనాత్మకంగానే గడిచింది. సీజేఐగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత సుప్రీంకోర్టు పరిసరాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారాయన. కారిడార్లలో గాలివెలుతురు జొరకుండా చేస్తున్న గాజు పలకలను తొలగించడం అందులో ఒకటి. అంతేకాకుండా సుప్రీంకోర్టు లోగోలో చేసిన వివాదాస్పద మార్పులను రద్దుచేసి పాత నమూనాను పునరుద్ధరించడం మరొకటి. న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడేందుకు ఆయన పలు చర్యలను చేపట్టారు. అందుకు ములాధారమైన కొలీజియం వ్యవస్థను బలంగా సమర్థించారు. అన్నిటికీ మించి న్యాయవ్యవస్థ నిబద్ధతపై అనుమానాల నీలినీడలు పరుచుకున్న కాలంలో ఆయన పదవీ విరమణ అనంతరం ఎలాంటి లాభసాటి పదవులను చేపట్టబోనని తెగేసి చెప్పడం ద్వారా సమున్నత ఆదర్శాన్ని నెలకొల్పారు. సుప్రీంకోర్టు నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ప్రవేశపెట్టడం ద్వారా సామాజిక న్యాయానికి సర్వోన్నత న్యాయస్థానంలోనూ చోటుకల్పించారు. తనలాగా దళిత బహుజనులు అత్యున్నత స్థానాలకు ఎదిగే అవకాశాన్ని అంబేద్కర్ రాజ్యాంగం కల్పించినప్పటికీ క్రీమీలేయర్ నిజమైన అభ్యున్నతి సాధించకుండా అడ్డు పడుతున్నదని కోర్టు లోపలా, వెలుపలా నిర్మొహమాటంగా కుండబద్దలు కొట్టారు. తనపై పాదరక్ష విసిరిన న్యాయవాదిని సైతం క్షమించడం ఆయన క్షమాగుణానికి, న్యాయవిజ్ఞతకు నిదర్శనం.