ఏదైనా జాతీయపార్టీ అధ్యక్షుడు మాట్లాడుతుంటే కాస్త బాధ్యత, వివేకం, హుందాతనాన్ని ఆశిస్తాం. కానీ, మన అంచనాలను బీజేపీ ఎప్పుడూ తలకిందులు చేస్తూనే ఉంటుంది. ఆ పార్టీ రాష్ట్ర స్థాయి నేతలే కాదు, జాతీయస్థాయి నేతలు కూడా ఈ విషయంలో ఒకరితో ఒకరు పోటీ పడుతుంటారని నడ్డా మాటలతో మరోసారి రుజువైంది. ఒమిక్రాన్ కారణంగా దేశంలో కరోనా థర్డ్‌వేవ్ మొదలైందని, అనేక రాష్ర్టాలు మళ్లీ లాక్డౌన్లు, ఆంక్షల బాట పడుతున్నాయని నడ్డాకు తెలియదా? ఇటువంటి సమయంలో నిరసనకు దిగి, జనాల్ని పోగేసే బాధ్యతారహితమైన పనికి తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాల్పడితే తప్పని చెప్పి, మొట్టికాయలు వేయాల్సిన బాధ్యత నడ్డాది. ఆ పని చేయకపోగా నిబంధనల ప్రకారం అరెస్టు చేసిన పోలీసులను తప్పుపట్టటం, కువిమర్శలు చేయటం ఏమి సంస్కారం?
బండి సంజయ్ అరెస్టు వ్యవహారం చూసిన నడ్డాకు ఇది 21వ శతాబ్దమేనా అని అనుమానం వచ్చిందట! 21వ శతాబ్దం గురించి మాట్లాడే స్థాయి బీజేపీ నేతలకు ఉందా అనేది అసలు ప్రశ్న. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడేండ్లలో తినే తిండి, కట్టుకునే బట్టలు, పుట్టిన కులం, అనుసరించే మతం ఆధారంగా కూడా అమాయకుల్ని కొట్టిచంపిన ఘటనలు ఎన్ని జరిగాయో లెక్క ఉందా? ఇది 21వ శతాబ్దపు పాలనా? ప్రభుత్వ విధానాలపై తమ అభిప్రాయాలు చెప్పటానికి, ఓ విమర్శ చేయటానికి సామాన్య జనం సంగతి సరేసరి, పారిశ్రామికవేత్తలు కూడా భయపడే పరిస్థితి ఉందని రాహుల్ బజాజ్ అంతటి వ్యక్తి బహిరంగంగా ఆందోళన వ్యక్తం చేశారంటే ఇది 21వ శతాబ్దపు పాలనా? అమర్త్యసేన్, రఘురామ్ రాజన్, రొమిల్లా థాపర్ వంటి విశ్వవిఖ్యాత మేధావులు కూడా దేశం తిరోగమనంపై విచారం వ్యక్తం చేస్తున్నారంటే ఇది 21వ శతాబ్దపు పాలనా? సమాధానం చెప్పగలరా నడ్డా?
దేశంలో ఎమర్జెన్సీని మించిన ప్రజాస్వామ్య హననం సాగిస్తున్న బీజేపీ పాలకులా తెలంగాణలో ‘ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర’ చేపట్టేది? ప్రపంచ ప్రజాస్వామ్య సూచీలో భారతదేశం మోదీ రాకముందు 2014లో 27వ స్థానంలో ఉంటే 2020లో 53వ స్థానానికి దిగజారింది. భారతదేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలు ఎన్నడూ లేనంత ఒత్తిడికి గురవుతున్నాయని అంతర్జాతీయ సంస్థలు ప్రకటిస్తున్నాయి. 116 దేశాలతో ప్రపంచ ఆకలి సూచీ తయారైతే దాంట్లో భారత్ 101వ స్థానంలో నిలబడింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్ కూడా మనకంటే మెరుగైన స్థితిలో ఉన్నాయి. ఇవన్నీ మోదీ పాలనకు ‘కీర్తి కిరీటాలు’. అర్ధరాత్రి నోట్లరద్దు, ఆకస్మిక లాక్డౌన్ వంటి పనులు నాటి తుగ్లక్ పాలనను తలపించిన ఘటనలు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లు తెలంగాణ గురించి నడ్డా అడ్డదిడ్డంగా మాట్లాడినా, ఇది తెలంగాణ అని గుర్తుంచుకుంటే మంచిది. వేల విషనాగులతో తలపడి, కలబడి, నిలబడిన తెలంగాణ ఇది.