Shoebullah Khan | ‘మహా ఘనత వహించిన మన నిజాం ప్రభువుకు వ్యతిరేకంగా, అంతేగాక మనందరికి వ్యతిరేకంగా, మనవారే కొందరు భారత ప్రభుత్వ ఏజెంట్లుగా మారి, మన సమైక్యతను ధ్వంసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. జర్నలిస్ట్‌ల రూపంలో మనకు వ్యతిరేకంగా రచనలు చేస్తున్నారు. అలాంటి రాతలు రాస్తున్న ఆ చేతులు ఉండటానికి వీల్లేదు. అవి నరకబడాల్సిందే. అటువంటి ద్రోహులు బతకడానికి వీల్లేదు చావాల్సిందే..’ తన చుట్టూ చేరిన వందలాది మందిని రెచ్చగొడుతూ ఆవేశంగా ప్రసంగిస్తున్నాడొక బక్కపలుచని వ్యక్తి. తనలోని అణువణువునా మత దురహంకారాన్ని నింపుకొని, తన ప్రతి అడుగులో విషం వెదజల్లుతున్న వ్యక్తి మరెవ్వరో కాదు, ఆనాటి 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్‌ను తన చేతిలో కీలుబొమ్మగా మార్చుకొని సంస్థానమంతటా దారుణాలు కొనసాగిస్తున్న రజాకార్ల నాయకుడు ఖాసీం రజ్వీ. తన చుట్టూ చేరిన అనుచరులను రెచ్చగొడుతూ ఆయన చేసిన విషపూరిత ప్రసంగం 1948, ఆగస్టు 19న హైదరాబాద్‌లోని ఆనాటి జమ్రుద్ మహల్ సినిమా హాల్లో కొనసాగింది.
ఆయన తన ప్రసంగంలో వెళ్లగక్కిన అక్కసంతా, తన అక్షరాలను ఆయుధాలుగా మార్చుకొని ప్రభుత్వ దురాగతాలను ఎండగడుతూ రజాకార్ల దారుణాలను బయటపెడుతూ రచనలు చేస్తున్న ఆనాటి ప్రముఖ పాత్రికేయుడు, మానవతావాది షోయబుల్లాఖాన్ గురించే. ఖాసీం రజ్వీ ప్రసంగంతో రెచ్చిపోయిన ఆయన అనుచరులు, రజాకార్లు అక్షరాలా ఆయన ఆదేశాలను అమలుపరిచారు. ఫలితంగా ఒక గొప్ప పాత్రికేయుడైన షోయబుల్లా ఖాన్ మీద కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో గాయపడిన షోయబుల్లా ఖాన్ 1948, ఆగస్టు 22 రోజున తుదిశ్వాస విడిచారు. నవ సమాజ నిర్మాణం కోసం తన ప్రాణాలనర్పించిన అమరజీవి షోయబుల్లా ఖాన్ 1920, అక్టోబర్ 17న లాయహున్నిసా బేగం- హబీబుల్లాఖాన్ దంపతులకు ఖమ్మం జిల్లాలోని సుబ్రవేడులో జన్మించారు. ఆయన తండ్రి హబీబుల్లాఖాన్ మహాత్మాగాంధీకి వీరాభిమాని.
బాల్యం నుంచే సమాజం పట్ల అవగాహనను, అనుబంధాన్ని పెంచుకున్న షోయబుల్లా ఖాన్ సమాజంతో సాన్నిహిత్యం కోసం జర్నలిజాన్ని తన వృత్తిగా ఎంచుకొని ఓయూ నుంచి జర్నలిజంలో బీఏ డిగ్రీ తీసుకున్నారు. నిజాం నిరంకుశ పాలనలో రజాకార్ల దౌర్జన్యాలతో హైదరాబాద్ రాష్ట్రమంతా గజగజా వణికిపొతున్న రోజులవి. ఎటుచూసినా హత్యలు, దోపిడీలు, మానభంగాలు. వీటి మీద పోరాటం చేయాలనుకున్నారు షోయబుల్లాఖాన్. అంతే, అభిమన్యుడిలా సమరక్షేత్రంలోకి కాలు మోపారు. మొట్టమొదట తేజ్ అనే పత్రికలో చేరారు. ఆయన రాతలు నిజాం ప్రభుత్వానికి ఆగ్రహావేశాలను తెప్పించాయి. ఫలితంగా తేజ్ పత్రిక మూతపడింది. తర్వాత రయ్యత్ పత్రికలో సహాయ సంపాదకుడిగా చేరారు. ఇక్కడ కూడా ఆయన కలం నిప్పులని గక్కింది. ప్రభుత్వ ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. ఫలితంగా రయ్యత్ కూడా మూతపడింది.
ఇక లాభం లేదని భావించిన షోయబుల్లా ఖానే తన భార్య, తల్లి నగలను అమ్మి ‘ఇమ్రోజ్’ అనే పత్రికను 1947 నవంబర్‌లో ప్రారంభించారు. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా హైదరాబాద్ స్టేట్, ఇండియన్ యూనియన్‌లో కలవాలని తన పత్రికలో రాసేవారు. ఈ రాతలు ప్రభుత్వానికి, ఖాసీం రజ్వీకి ఆగ్రహం తెప్పించేవి. నయానో భయానో ఆయన రాతలకు అడ్డుకట్టవేయాలని ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే, మేరు నగధీరుడు షోయబుల్లా ఖాన్ వాటిని లెక్కచేయలేదు. చివరికి మత దురహంకారి, నర రూప రాక్షసుడు ఖాసీం రజ్వీ షోయబుల్లా ఖాన్‌ను అంతం చేసే బాధ్యతను తీసుకున్నాడు. జమ్రుద్ మహల్ రజాకార్ల సభలో ఒక గొప్ప జర్నలిస్ట్‌ని చంపాలని, ఆయన చేతులను నరకాలని ఆదేశించాడు.
ఆ రోజు ఆగస్ట్ 21 రాత్రి. పని ముగించుకొని తన ఇంటికి బయల్దేరిన షోయబుల్లా ఖాన్ మీద కాల్పులు జరిగాయి. కాల్పులతో షోయబుల్లా ఖాన్ కింద పడగానే ఆయన చేతిని నరికారు. స్థానికులు షోయబుల్లా ఖాన్‌ను దవాఖానకు తరలించారు. మృత్యువు తో రెండు గంటలు పోరాడిన షోయబుల్లాఖాన్ 1848, ఆగస్టు 22న మరణించారు. నిజాం ప్రభుత్వం ఆయన అంతిమయాత్రను నిషేధించింది.
గోషామహల్ మాలకుంట శ్మశానవాటికలో ఆయన ఖననం జరిగింది. కొద్దిమంది బంధుమిత్రులు చూడటానికి మాత్రమే ప్రభుత్వం అనుమతించింది. ఆ తర్వాత ఆయన కుటుంబం గురించి ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇక, స్వాతంత్య్ర సమరయోధులకు ఇచ్చే పింఛన్ ఆయన కుటుంబానికి అందడానికి నాలుగు దశాబ్దాలు పట్టింది. ఇదీ మన అమరవీరులకు మనమిచ్చే గౌరవం.
– బసవరాజు నరేందర్‌రావు
99085 16549