ప్రపంచవ్యాప్తంగా ఆయుధ పోటీ క్రమంగా పెరుగుతుండటం ఆందోళనకరం. ఉక్రెయిన్‌కు అమెరికా సరఫరా చేసిన దీర్ఘకాలిక క్షిపణులు రష్యా భూభాగంపై ప్రయోగించేందుకు అనుమతిస్తూ అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల ఫర్మానా జారీచేయడంతో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. ఆ వెనువెంటనే ఉక్రెయిన్ కొన్ని క్షిపణులను రష్యాపై వేసింది కూడా. దీన్ని అమెరికా ప్రత్యక్ష దాడిగా భావిస్తామని, అణ్వస్త్ర వినియోగ విధానంలో మార్పులు చేస్తామని రష్యా వెల్లడించడం ఓ ప్రమాదకరమైన మలుపు. దీంతో అణ్వస్త్ర ముప్పు మరోసారి తెరమీదకు వచ్చింది. అణ్వస్త్ర పరిమితి ఒప్పందాలను తాము ఖాతరు చేయబోమని, అవి కాలగర్భంలో కలిసిపోయినట్టేనని రష్యా సైనికదళాల ప్రధానాధికారి జనరల్ వాలెరీ గెరాసిమోవ్ తేల్చిచెప్పడం గమనార్హం. పాశ్చాత్య ప్రపంచంపై నమ్మకం సన్నగిల్లడమే ఇందుకు కారణమని ఆయన తేల్చి చెబుతున్నారు.
2002లో విధ్వంసక క్షిపణుల ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడంతో అగ్రరాజ్యాల మధ్య ఆయుధ పోటీకి బీజం పడింది. అప్పటినుంచి ఒకదాని తర్వాత ఒకటిగా ఆయుధ పరిమితి ఒప్పందాలన్నీ కుప్పకూలుతూ వచ్చాయి. చివరగా మిగిలిన వ్యూహాత్మక ఆయుధ పరిమితి ఒప్పందం గడువు 2026 ఫిబ్రవరిలో ముగిసిపోతుంది. అంటే గత 50 సంవత్సరాల చరిత్రలో బడా అణ్వస్త్ర దేశాల మధ్య ఎలాంటి ఒప్పందాలు లేని పరిస్థితిని ప్రపంచం ఎదుర్కోబోతున్నది.
రష్యా చేసిన ప్రకటనతో అది అంతకంటే ముందే జరిగిపోతుందేమోననే భయాలు వెంటాడుతున్నాయి. నేటిరోజుల్లో అణ్వస్త్ర సమస్య అనేది అమెరికా రష్యాలకే పరిమితం కాలేదు. చైనా కూడా ఆయుధపోటీలోకి దూకుడుగా దిగడంతో పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా తయారైంది. ఈ సరికే చైనా 500 అణ్వస్ర్తాలు పోగేసుకున్నట్టు ఒక లెక్క. దశాబ్దం చివరి నాటికి ఆ సంఖ్యను వెయ్యికి, 2035 నాటికి అమెరికా, రష్యాలతో సమానంగా 1,500కు పెంచాలని చూస్తున్నది. దీనివల్ల అణ్వాయుధ పరిమితి చర్చల్లో పాల్గొనాల్సిన దేశాల సంఖ్య రెండు నుంచి మూడుకు పెరుగుతుంది.
అణ్వస్ర్తాల సమస్య భారత్ తలుపు తడుతున్న సూచనలూ కనిపిస్తున్నాయి. పొరుగున ఉన్న పాక్, చైనాలు ప్రకటిత అణ్వస్త్ర దేశాలు. ఇటీవల బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రజా తిరుగుబాటు ఫలితంగా షేక్ హసీనా ప్రధాని పదవి కోల్పోయి దేశం వదిలి పారిపోయిన తర్వాత భారత వ్యతిరేక శక్తులు అధికారాన్ని చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో గత సెప్టెంబర్‌లో షహీదుజ్జమాన్ అనే వివాదాస్పద ప్రొఫెసర్ బంగ్లా-పాక్ మధ్య అణ్వస్త్ర రక్షణ ఒప్పందం కుదిరితే బాగుంటుందని చేసిన సూచన సంచలనం కలిగించింది. సాధ్యాసాధ్యాల సంగతి అటుంచితే ఇది భారత్‌కు వ్యూహాత్మకంగా ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. అణుయుద్ధం ఎప్పుడు, ఎవరి మధ్యన జరిగినా విజేతలంటూ ఎవరూ మిగలరనేది నిర్వివాదాంశం. మూడు దశాబ్దాలుగా ఒప్పందాలు కలిగించిన భరోసా అంతమైపోతున్నది. 1962లో క్యూబా సంక్షోభం తర్వాత మళ్లీ అణ్వస్ర్తాల ఉపయోగం గురించిన మాటలు వినవస్తున్నాయి. ఇది ఎటు దారితీస్తుంది!