కృత్రిమ మేధ లేదా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (క్లుప్తంగా ఏఐ) ఇటీవలి కాలంలో జనోపయోగంలోకి వచ్చిన అత్యాధునిక సాంకేతికత. సాంఘిక మాధ్యమాల్లో వింత వింత ఫొటోలు, వీడియోల రూపంలో ఇది వినోదం కలిగిస్తున్నది. అయితే కృత్రిమ మేధ అనేది అంత సరదా సంగతేమీ కాదని, రాబోయే రోజుల్లో దీనివల్ల పెను ముప్పే ఎదురు కాబోతున్నదనే హెచ్చరికలు అంతకంతకూ తీవ్రతరమవుతున్నాయి. ముఖ్యంగా ఉపాధి నష్టాలపై మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన వ్యాఖ్యలు ఐటీ, దాని అనుబంధ రంగాల్లో ఆందోళనకు దారితీశాయి. ఏఐ సృష్టించబోయే సునామీలో కోట్లాది ఉద్యోగాలు గల్లంతైపోతాయనేది వారి జోస్యాల సారాంశం.
గత వందేండ్లలో ఎన్నడూ చూడని ఉపాధి ఉత్పాతం చూడబోతున్నట్టు గేట్స్ ఓ బీభత్స భయానక దృశ్యాన్ని ఆవిష్కరించారు. వివిధ అంచనాల ప్రకారం ఏఐ దెబ్బతో 2030 నాటికి 40 కోట్ల నుంచి 80 కోట్ల దాకా ఉద్యోగాలు గల్లంతైపోతాయి. ఈ కోణంలో చూస్తే ఏఐ అనేది ఉద్యోగాలను అమాంతంగా మింగేసే విపత్కర అదృశ్యశక్తిగా కనిపిస్తుంది. ఐటీ పరిశ్రమలో, విశేషించి, ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు కనుమరుగవుతున్నాయి. ఉద్యోగులు జాబ్స్ కోల్పోతున్నారు. కొత్త ఉద్యోగాలు ఏర్పడటం లేదు. అతి త్వరలో కోడింగ్ ఉద్యోగాల్లో చాలామేరకు కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తున్నది. భారతదేశంలో ఆర్థిక వృద్ధికి చాలా కాలంగా మూలస్తంభంగా ఉన్న ఐటీ రంగం, లక్షలాది మందికి స్థిరమైన, అధికాదాయ ఉద్యోగాలను సమకూరుస్తున్నది. ఇకముందు ఈ పరిస్థితి ఉండకపోవచ్చు.
అయితే, మానవ చరిత్రలో ఇలాంటి సంధి దశ పూర్తిగా కొత్త సంగతేమీ కాదు. పారిశ్రామిక విప్లవంతో చేతివృత్తులు కల్లోలం కావడం మొదలుకొని, కంప్యూటర్ యుగం ఆవిర్భావంతో కార్యాలయాల పనితీరు సమూలంగా మారిపోవడం దాకా ఎన్నో పెనుమార్పులు ఉపాధి రంగంలో చోటుచేసుకున్నాయి.అయితే, కాలానుగుణంగా వచ్చే మార్పులను, మరీ ముఖ్యంగా సాంకేతిక ఊర్ధ్వ గమనం వల్ల కలిగే ప్రకంపనలు మొదటగా ఆందోళన కలిగించినప్పటికీ, అవి సర్దుకున్న తర్వాత సకలజనులకూ మేలే జరుగుతుందనేది చరిత్ర అనుభవం.
ఏఐతో వచ్చే మార్పు అనేది కేవలం ఉద్యోగాలు పోవడానికి సంబంధించినదే కాదు. విద్య, వైద్యం వంటి ఐటీయేతర రంగాల తీరుతెన్నులూ మారిపోతాయి. విజ్ఞానం విశ్వవ్యాప్తమై అందరికీ అందుబాటులోకి వస్తుందని వినిపిస్తున్నది. ఇది ఏఐ అనే నాణేనికి మరోవైపు చూపే సానుకూల పరిణామమే అవుతుందని భావించవచ్చు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) అంచనా ప్రకారం 2027 నాటికి 8.3 కోట్ల ఉద్యోగాలు ఏఐ వల్ల గల్లంతైపోతే, అదే ఏఐ విస్తరణ కారణంగా 6.9 కోట్ల ఉద్యోగాలు కల్పించబడుతాయి. అంటే నికర ఉపాధి నష్టం 1.4 కోట్ల ఉద్యోగాలు. ఇక ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ 2025 నివేదిక ప్రకారం 2030 నాటికి నికరంగా 7.8 కోట్ల ఉద్యోగాలు పెరుగుతాయి. ఇక్కడ ఒక్కటి గుర్తుంచుకోవాలి. పాత నీరు పోయి కొత్త నీరు వచ్చినట్టుగా పాత నైపుణ్యాలకు కాలం చెల్లిపోయి, కొత్త నైపుణ్యాల అవసరం ఏర్పడుతుంది. ఎంత త్వరగా నూతన నైపుణ్యాలు సంతరించుకుంటే అంత మంచిదనే సూత్రాన్ని ఒంట పట్టించుకుంటే మేలు.