కొలంబియాలోని కాలీలో 2024 అక్టోబర్ 28న జరిగిన జీవవైవిధ్య సదస్సులో ఐయూసీఎన్ (ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్) తన మొదటి ప్రపంచ వృక్ష అధ్యయన నివేదికను విడుదల చేసింది. ప్రపంచంలోని 38 శాతం వృక్షజాతులు కనుమరుగయ్యే స్థితిలో ఉన్నాయని తన ‘రెడ్ లిస్ట్’లో తెలిపింది.
ప్రతి మూడింటిలో ఒక వృక్షజాతి అంతర్ధానమయ్యే పరిస్థితి దాపురించడం జీవజాతులన్నింటినీ పెను ప్రమాదంలో పడవేయబోతున్నది. పక్షి, జంతు, సరీసృప, ఉభయచర జాతుల కంటే ఎక్కువ వృక్షజాతులు నశించే ప్రమాదం పొంచి ఉండటం తీవ్రంగా ఆందోళన కలిగించే పరిణామం. దాదాపు 38 శాతం వృక్షజాతులు అంతరించనున్నాయనే ఐసీయూఎన్ ‘రెడ్ లిస్ట్’ జీవవైవిధ్యానికి, పర్యావరణ సమతుల్యతకు జరుగబోయే విధ్వంసాన్ని కళ్లకు కట్టినట్టు చూపుతున్నది.
1948లో స్థాపించిన ఐయూసీఎన్ సంస్థ ప్రకృతి పరిరక్షణ, సహజవనరుల సమర్థ వినియోగంపై అంతర్జాతీయ స్థాయిలో పనిచేస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి స్థితిని, దాన్ని కాపాడటానికి అవసరమైన చర్యలు చేపట్టేందుకు ఇది కృషి చేస్తున్నది. పర్యావరణ పరిరక్షణకు సంబంధించి సమాచార సేకరణ, విశ్లేషణ, పరిశోధన తదితర అంశాలపై జరిగే సమావేశాల్లో పాల్గొని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ సంస్థలకు దిశానిర్దేశం చేస్తుంది. ఈ సంస్థ అక్టోబర్ 28న విడుదల చేసిన రెడ్ లిస్ట్ ఇప్పుడు పర్యావరణ శాస్త్రవేత్తలను, ప్రకృతి ప్రేమికులను ఆందోళనకు గురిచేస్తున్నది. మొత్తం 47,282 వృక్షజాతులపై మదింపు జరుగగా.. 16,425 జాతులు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నట్టు తేలింది. అలాగే ఈ విధ్వంసం బారినపడ్డ వృక్షాల సంఖ్య, అంతరించిపోయే పక్షి, జంతు, సరీసృప, ఉభయచర జాతుల సంఖ్యకు రెండింతలకు పైగా ఉండటం గమనార్హం.
భూగోళ పర్యావరణ వ్యవస్థలో చెట్ల పాత్ర ఎంతో కీలకమైనది. అవి బతుకుతున్నాయడం కంటే మనల్ని బతికిస్తున్నాయనడం ఉత్తమం. భూమిపై జీవం వర్ధిల్లడానికి, కోట్లాది మంది (1600 కోట్లు) మానవుల ప్రాణాలకు, వారి జీవనోపాధికి ప్రత్యక్షంగా, పరోక్షంగా వృక్షాలు దోహదపడుతున్నాయి.
2020లో ప్రపంచ అటవీ విస్తీర్ణం 4.06 బిలియన్ హెక్టార్లు (1000 కోట్ల ఎకరాలు)గా ఉంది. మొత్తం భూ విస్తీర్ణంలో ఇది 31 శాతం. ఇందులో 54 శాతం కేవలం ఐదు దేశాల్లో (బ్రెజిల్, కెనడా, చైనా, రష్యా, అమెరికా) ఉంది. అటవీ విస్తీర్ణం పరంగా రష్యాది ప్రథమ స్థానం. 2009లో మూడింట రెండొంతుల అటవీ విస్తీర్ణం 10 దేశాల్లోనే ఉండేది. అవి బ్రెజిల్, కెనడా, చైనా, రష్యా, అమెరికా, ఆస్ట్రేలియా, కాంగో, భారత్, ఇండోనేషియా, పెరూ.
2023లో ప్రపంచం 6.37 మిలియన్ హెక్టార్ల అటవీ విస్తీర్ణాన్ని కోల్పోయింది. 2030 వరకు అటవీ నిర్మూలనను పూర్తిగా అరికట్టాలనే 140 దేశాల లక్ష్యం కంటే ఇది 45 శాతం అధికం కావడం గమనార్హం. వివిధ కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా భూగోళం పెద్ద విస్తీర్ణంలో అటవీ భూమిని కోల్పోతున్నది. ప్రాంతం, దేశాలను బట్టి ఆ కారణాలు మారుతున్నాయి. వ్యవసాయ భూమి విస్తరణ, వివిధ అవసరాలకు చెట్ల నరికివేత, పట్టణీకరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, గనులు, దావానలాలు వాటిలో ప్రధానమైనవి. అటవీ నిర్మూలన భ యంకరమైన వాతావరణ మార్పులకు దారితీస్తుండటం ఇప్పుడు ప్రపంచాన్ని కలవరపరుస్తున్నది.
మన దేశంలో పరిస్థితులు ఇంకా దారుణంగా ఉన్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం 2021 వరకు భారత్‌లో అటవీ విస్తీర్ణం 80.0 మిలియన్ హెక్టార్లు(20 కోట్ల ఎకరాలు)గా ఉండేది. ఇది దేశ భూ భాగంలో 21.71 శాతం. అయితే, 2015-2020 మధ్యకాలంలో ఏటా 6,68,000 హెక్టార్ల మేరకు అటవీ నిర్మూలన జరిగింది. దీని వల్ల భారత్ భారీగా అటవీ భూ భాగాన్ని కోల్పోయింది. 2000 సంవత్సరం నుంచి చూసుకుంటే 23.3 లక్షల హెక్టార్ల అటవీ భూమిని మన దేశం కోల్పోయింది. ఇది ఏడాదికి 6 శాతం.
సుస్థిర వ్యవసాయ పద్ధతులను అవలంబించడం, పంటల మార్పు, పునర్వనీకరణ, అటవీ వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయ పద్ధతులు అడవుల విస్తీర్ణం తగ్గిపోవడాన్ని నిరోధించగలవు. వ్యవసాయం కోసం జరిగే భూవిస్తరణను ఇవి అరికడతాయి. తత్ఫలితంగా అడవుల నరికివేత తగ్గిపోతుంది. మనకు ఇప్పుడు అందుబాటులో ఉన్న వ్యవసాయ భూమినే సమర్థవంతంగా వాడుకోవడం, మరింత ఎక్కువ దిగుబడి సాధించడమే పై పద్ధతుల ప్రధాన ఉద్దేశం. వాణిజ్యపరంగా, కట్టడాల నిర్మాణానికి కలపను వాడకుండా ప్రత్యామ్నాయ వనరులు వినియోగించడం, కాగితపు వాడకానికి చెక్క గుజ్జుకు బదులు వేరే పద్ధతులను అన్వేషించడం లాంటివి చెట్లను రక్షింపగలవు. నరికివేతను పూర్తిగా తగ్గించి, పునర్వనీకరణ అంటే అడవులను తిరిగి పెంచడం అంత సులభమేమీ కాదు, అలాగని అసాధ్యం కూడా కాదు. ఉదాహరణకు, కోస్టారికా ఎప్పుడో కోల్పోయిన వర్షాధార ఉష్ణమండల అడవిలో కొంతభాగాన్ని విజయవంతంగా పునరుజ్జీవింపజేయగలిగింది. అయితే, దీనికి 50 ఏండ్లు పట్టింది. అలాగే పునర్వనీకరణలో భాగంగా 1950 నుంచి ఇప్పటివరకు చేపట్టిన పలు కార్యక్రమాల ద్వారా దక్షిణ కొరియా అటవీ విస్తీర్ణం 35 నుంచి 64 శాతానికి పెరిగింది. లక్ష్యాలను సాధించడానికి దశాబ్దాల సమయం పట్టవచ్చేమో గానీ, సానుకూల ఫలితం మాత్రం తప్పకుండా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
తెలంగాణ రాష్ట్రం చేపట్టిన హరితహారం కార్యక్రమం అందుకు చక్కటి ఉదాహరణ. దేశంలో అటవీ విస్తీర్ణం పెంపుదలలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉన్నది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ), డౌన్ టు ఎర్త్ నివేదిక ప్రకారం.. 2019 నుంచి 2021 వరకు రాష్ట్రంలో 7 శాతం అటవీ విస్తీర్ణం పెరిగింది. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ‘హరితహారం’ కార్యక్రమమే దీనికి ప్రధాన కారణం.
తెలంగాణ రాష్ట్రం చేపట్టిన హరితహారం కార్యక్రమం అందుకు చక్కటి ఉదాహరణ. దేశంలో అటవీ విస్తీర్ణం పెంపుదలలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉన్నది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ), డౌన్ టు ఎర్త్ నివేదిక ప్రకారం.. 2019 నుంచి 2021 వరకు రాష్ట్రంలో 7 శాతం అటవీ విస్తీర్ణం పెరిగింది. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ‘హరితహారం’ కార్యక్రమమే దీనికి ప్రధాన కారణం. ఈ కార్యక్రమం కింద గత తొమ్మిదేండ్లలో (2015-2023) 273 కోట్ల మొక్కలు నాటారు. అంతేకాదు, తెలంగాణలో పుట్టి దేశవ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకున్న గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 19.5 కోట్ల మొక్కలను నాటడం ఒక రికార్డు. రాజ్యసభ మాజీ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన ఈ కార్యక్రమం దేశంలోని ప్రతీమూలకు చేరింది. సెలబ్రిటీలందరూ దీనిలో భాగస్వాములయ్యారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ కింద కొంతమంది ప్రముఖులు అడవులను దత్తత తీసుకోవడం విశేషం.
ఈ నేపథ్యంలో ఐయూసీఎన్ రెడ్ లిస్ట్‌ను ఇప్పుడు భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు మరో హెచ్చరికగా చూడాల్సిన అవసరమున్నది. 2030లోపు అటవీ నిర్మూలనను పూర్తిగా అరికట్టాలనే 140 దేశాల సంకల్పం నెరవేరే పరిస్థితులు కనిపించడం లేదు. అంతర్జాతీయంగా అందుకు కావాల్సిన చిత్తశుద్ధి కొరవడటమే అందుకు కారణం. అటవీ నిర్మూలనను అరికట్టే దిశగా కొంతమేరకు వృద్ధి కనిపిస్తున్నా, రెడ్ లిస్ట్ ప్రకారం చూస్తే అది ఏ మాత్రం సరిపోదు. ఇంకా వేగవంతంగా చర్యలు చేపట్టాలి. అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే ప్రణాళికలను కఠినంగా అమలు చేయాలి.
ఐయూసీఎన్ రెడ్ లిస్ట్‌లో ఉన్న వృక్షజాతులను పరిరక్షించడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. ప్రపంచ దేశాలు మేల్కొని ఈ విషయమై సంబంధిత ప్రభుత్వ సంస్థలతో చర్చించాలి. తగు చర్యలను సత్వరమే చేపట్టాలి. ప్రస్తుతం ఉన్న అడవులను కాపాడేందుకు వాటిని జాతీయ పార్కులుగా, రిజర్వ్ ఫారెస్టులుగా ప్రకటించాలి. తద్వారా చెట్ల నరికివేత ఆగుతుంది. అదే సమయంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేపట్టాలి. గ్రీన్ ఇండియా చాలెంజ్ లాంటి కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా రావాల్సిన అవసరమున్నది. సమాజాన్ని, స్వచ్ఛంద సంస్థలను, వివిధ సంఘాలను, కార్పొరేట్ కంపెనీలను, సెలబ్రిటీలను అందులో భాగస్వాములను చేయాలి. సామాజిక అడవుల నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించాలి.
మనిషి నివసించడానికి, జీవించడానికి ఒకవేళ మరో గ్రహం అనుకూలంగా ఉందంటే.. దానర్థం భూమిని నిర్జీవంగా వదిలేయాలని కాదు. ఈ పుడమిపై ఉన్న జీవవైవిధ్యాన్ని కాపాడటం ప్రతీ మానవుడి విధి. భూమి తనంతట తాను నిర్జీవమయ్యే పరిస్థితి రావడానికి ఇంకా కొన్ని వందల కోట్ల సంవత్సరాలు ఉన్నప్పటికీ, మానవ తప్పిదాల వల్ల అది నేడో రేపో అనే స్థితికి వచ్చింది. ఈ భూమిపైనున్న అన్ని జీవరాశులకు సమాన హక్కులున్నాయి. మానవులకు ఎంత హక్కుందో చెట్టు, పుట్ట, జంతువుకు అంతే హక్కుంది. వాటికి లేనిది మనిషికున్నది మేధస్సు మాత్రమే. తమ ఆవాసాన్ని కాపాడుకోవడానికి ఆ మేధస్సును వాడుకోవాలే గాని, నాశనం చేయడానికి కాదు. ఒక జాతి తప్పు మరో జాతికి మరణ శాసనాన్ని రాయకూడదు. దీన్ని గుర్తెరిగి మేలుకున్నప్పుడే మానవుడు తన బాధ్యతను నెరవేర్చినవాడవుతాడు.