కురుల సిరులున్న అమ్మ కొప్పు ఎటువేసినా అందమే అన్నట్టు ఆదాయం పంచుకునే మార్గాలు తెలిసిన సర్కారు ఏది చేసినా కుదురుగానే ఉంటుంది. మన ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డికి ఈ విషయంలో పెద్దగా ప్రవేశం లేదని ఆయనే పరోక్షంగా చెప్పుకోవడం/ఒప్పుకోవడం మనం చూస్తున్నాం. పైసా అప్పు పుట్టడం లేదని ఆయన ఇటీవల సెల్ఫ్‌గోల్ తరహాలో ప్రకటించి రాష్ట్రం పరువు తీసిన సంగతి తెలిసిందే. ఆదాయం పెరుగదు, అప్పూ పుట్టదు, మరెలాగంటే ‘మద్యేమార్గం’ ఉంది కదా అని అంటున్నది సర్కారు. మందుబాబుల జేబుకు చిల్లుపెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నది. దీనిపై ఎక్సైజ్ శాఖ సర్క్యులర్ గాని, ఉత్తర్వులు గాని విడుదల చేయకుండానే దొంగదెబ్బ తీసినట్టు ‘టీజీ లిక్కర్ ప్రైస్ యాప్’లో పెంచిన ధరలు గుట్టుచప్పుడు కాకుండా అప్డేట్ చేయడం సర్కారు దివాళాకోరుతనానికి అద్దం పడుతున్నది. గత ఫిబ్రవరిలోనే బీర్ల ధరలు పెంచిన సర్కారు ఇప్పుడు లిక్క ర్ మీద పడ్డది. బీర్, బార్ ద్వారానే ఆదాయం పెంచుకోవాలని సర్కార్ చూస్తున్నట్టు కనిపిస్తున్నది. పైకి లేచిన తెలంగాణను విజయవంతంగా పడదోసిన సర్కారు ఈ మధ్య రైజింగ్ అనే మాటను తరచుగా ఉపయోగిస్తున్నది. ఆ రైజింగ్ ఎక్కడ ఉన్నా లేకపోయినా ఎక్సైజ్ ఆదాయంలో మాత్రం తప్పక ఉండాలని కోరుకుంటున్నట్టు కనిపిస్తున్నది.
మద్యం విధానంపై రేవంత్ ప్రభుత్వం మొదటినుంచీ గోప్యతనే పాటిస్తున్నది. ముందుగా రేట్లు పెంచబోమని ప్రకటించడం, తర్వాత లోపాయికారీగా పెంచడం ఇందుకు నిదర్శనం. మద్యం కంపెనీలతో దాగుడుమూతలు ఆడి దారికి తెచ్చుకోవడం వెనుక జరిగిన తతంగంపై ప్రజలకు అనుమానాలున్నాయి. బీఆర్ఎస్ పలు సందర్భాల్లో దీనిపై సర్కారును నిలదీసింది కూడా. ప్రజలను మరింతగా తాగుబోతులను చేసి, వారి జేబులకు చిల్లు వేసి, ఆ సొమ్ముతోనే యంత్రాంగం నడపాలని చూడటం క్షమార్హం కాదు. మొత్తంగా 420 హమీలను తుంగలో తొక్కిన సర్కారు.. మద్యం అంశాన్ని మాత్రం విడిగా చూస్తుందా? ‘అధికారం చేజిక్కించుకోవడానికి నోటికొచ్చిన హామీ ఇచ్చాం.. ఇప్పుడు అవన్నీ అమలు చేయాలని అడిగితే ఎలా?’ అని గడుసుగా ఎదురు ప్రశ్న వేస్తున్నారు సర్కారు పెద్దలు.
మద్యం పాలసీపై కాంగ్రెస్ గుప్పించిన హామీలు గుర్తుచేసుకుంటే ఆశ్చర్యం కలగకమానదు. మద్యం దుకాణాలు, పబ్బులను క్రమబద్ధీకరిస్తామని, రేట్లు తగ్గిస్తామని, బెల్ట్‌షాపులను ఎత్తివేస్తామని హస్తం నేతలు అన్నారు. కానీ, ఆ దిశగా ఎలాంటి చర్యలూ చేపట్టిన దాఖలాలు లేవు. మద్యం ప్రవాహాన్ని నియంత్రిస్తామని గొప్పగా చెప్పుకొన్నారు. ఇప్పుడేమో వంద మైక్రో బ్రూవరీలకు అనుమతులిస్తూ మద్యం ఏరులై పారేందుకు గేట్లు తెరుస్తున్నారు. దారీతెన్నూ లేని పరిపాలనలో ఆదాయం రోజురోజుకూ అడుగంటుతుంటే సర్కారు కాసుల వేటలో మద్యాన్నే నమ్ముకుంటున్నది. మద్యం వల్ల ప్రజలకు హాని జరుగుతున్నట్టుగా తెగ జాలి పడిపోయినోళ్లు ఇప్పుడు ‘ఆ కిక్కే వేరప్పా’ అన్నట్టు వ్యవహరించడం విడ్డూరం. ఏడాదికి రూ.2,500 కోట్ల ఆదాయం కోసం మందుబాబులపై అధిక ధరల భారం మోపుతున్నారు. అంతిమంగా ఇది పేద, మధ్యతరగతి కుటుంబాల దోపిడీకే దారితీస్తుందని చెప్పక తప్పదు.