ధర్మం జయిస్తుందనేది చరిత్రలో పదేపదే రుజువవుతూనే ఉన్నది. ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా వెనుకడుగు వేయడం తాజా ఉదంతం. దక్షిణాది నగరం ఖెర్సాన్ నుంచి తమ బలగాలను ఉపసంహరించుకుంటున్నట్టు రష్యా ప్రకటించింది. పౌర నివాసాలపై, విద్యుత్ కేంద్రాల వంటి మౌలిక వసతులపై దాడి చేయడం ద్వారా ఉక్రెనియన్ల నైతిక ైస్థెర్యాన్ని దెబ్బతీయాలని రష్యా భావించింది. అణ్వస్త్ర దాడికి దిగుతామని కూడా బెదిరించింది. అయినా ఉక్రెయిన్ సైన్యం నిబ్బరంగా ఎదురు దాడి సాగిస్తూ రష్యా సైనికులను కలవర పెడుతున్నది.
ఏ అసమర్థ నాయకుడైనా దేశ సమస్యలను పరిష్కరించలేనప్పుడు ప్రజలలో ఉన్మాదాన్ని, విద్వేషాలను రెచ్చగొడుతాడు. పక్కదేశంపై దాడి చేయడం ద్వారా ప్రజల దృష్టిని మళ్ళించాలని యత్నిస్తాడు. పుతిన్ కూడా ఉక్రెయిన్ను ఆక్రమించుకొని తన ప్రతిష్ఠను పెంచుకోవాలనుకున్నాడు. కానీ ఈ దాడి వల్ల ఆంతరంగికంగా, అంతర్జాతీయంగా ప్రతికూల ఫలితాలే వచ్చాయి. భవిష్యత్తులో రష్యా అను కూల శక్తులు ఉక్రెయిన్ ఎన్నికలలో గెలిచే అవకాశం మూసుకుపోయింది. యూరప్‌లోని తటస్థ దేశాలు నాటోలో చేరడానికి సుముఖంగా మారాయి. అంతర్జాతీయ సమాజంలో రష్యా దోషిగా నిలబడి ఆంక్షలను ఎదుర్కొంటున్నది. దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. నిర్బంధంగా సైన్యంలో చేర్చుకుంటామని ప్రకటించడంతో లక్షలాది మంది యువకులు సరిహద్దులు దాటి వలస వెళ్ళారు. ఉక్రెయిన్ ఊబిలో కూరుకుపోయిన పుతిన్ ఇప్పుడు గౌరవంగా బయట పడలేక తంటాలు పడుతున్నాడు.
ఉక్రెయిన్‌కు చెందిన ఇంకా కొన్ని సరిహద్దు ప్రాంతాలు రష్యా అధీనంలోనే ఉన్నాయి. వాటిని విముక్తం చేయడానికి పోరాడవలసి ఉన్నది. కానీ ఆధునిక యుగంలో ఎంత పెద్ద దేశమైనా, తనకు ఎదురేమీ లేదని మరో దేశాన్ని ఆక్రమించుకొని గుప్పిట్లో పెట్టుకోవడం అసాధ్యమని ఇప్పటికే స్పష్టమైపోయింది. వియెత్నాంలు, అఫ్ఘానిస్థాన్‌ల వంటి ఉదాహరణలు మన ముందు అనేకం ఉన్నాయి. మాతృభూమి రక్షణ కోసం దేశమంతా ఏకమై నిలబడుతుంది. ఉక్రెయిన్‌లో జరుగుతున్నది ఇదే. మరోవైపు, రష్యా సైనికులకు నైతిక బలం లేదు. తాము అన్యాయంగా దాడి చేస్తున్నామని సైనికులకు అర్థమైంది. ఏ దేశమైనా కిరాయి సైనికులతో ఎంతకని పోరాడగలదు? ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ దేశాలకు గుణపాఠం కావాలి. దేశాల మధ్య విభేదాలను అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు అనుగుణంగా, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలే తప్ప ఘర్షణలకు దిగకూడదు. పుతిన్ ఇప్పటికైనా భేషజాలకు పోకుండా ఆక్రమిత ప్రాంతాలన్నిటి నుంచి ఎంత తొందరగా వైదొలగితే అంత మంచిది.