పాలస్తీనా భూభాగాల్లో నెత్తుటేర్లు పారిస్తూ, బూడిదకుప్పగా మారుస్తున్న ఇజ్రాయెల్ ఇప్పుడు అసలు పాలస్తీనా రాజ్య అస్తిత్వమే కుదరదని తెగేసి చెప్పడం ఎవరినీ దిగ్భ్రాంతికి గురిచెయ్యలేదు. ‘రెండు రాజ్యాల పరిష్కారం’ తమకు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో ప్రకటించడం దురాక్రమణవాదానికి పరాకాష్ఠ. పాలస్తీనా మనుగడను సమర్థిస్తే ఉగ్రవాదానికి ఊతం అందించినట్టేననేది ఆయన వితండవాదం. నిజానికి ఉగ్రవాదాన్ని సాకుగా తీసుకొని గాజాలో ఎడతెగని ఘోరకలి సృష్టిస్తున్న ఇజ్రాయెల్ భూమిపుత్రులైన పాలస్తీనియన్లను సర్వనాశనం చేసి శ్మశాన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నది. ఇప్పుడు మరింత బరితెగించి మొత్తంగా పాలస్తీనాకే ఎసరు పెట్టాలని చూడటం ఏ రకంగానూ సమర్థనీయం కాదు.
అంతర్జాతీయ న్యాయస్థానం ముందు మారణహోమం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్ ఉగ్రవాదం గురించి నీతులు చెప్పడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగానే ఉంటుంది. ఇజ్రాయెల్ ఇష్టారాజ్యంగా సాగిస్తున్న దమనకాండ సహజంగానే ప్రపంచ దేశాలకు వెగటు పుట్టిస్తున్నది. ఇజ్రాయెల్ వెంట నిలిచిన పశ్చిమదేశాలు ఒక్కొక్కటిగా రెండురాజ్యాల సిద్ధాంతం వైపు, అంటే, నిజమైన అర్థంలో పాలస్తీనాను గుర్తించడం వైపు అడుగులు వేస్తున్నాయి. అమెరికా అందుకు మినహాయింపు అనేది వేరే విషయం. బ్రిటన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, స్పెయిన్ తదితర దేశాలు పాలస్తీనాకు మద్దతు తెలుపడమే కాకుండా ఐక్యరాజ్య సమితి వేదిక మీదే ఆ సంగతిని వెల్లడిస్తున్నాయి. వేగంగా చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు ఇజ్రాయెల్‌కు నిస్పృహ కలిగిస్తున్నాయనేది వాస్తవం. నెతన్యాహూ స్పందనలో ఇది వ్యక్తమవుతున్నది.
ఇప్పుడు గాజాలో ఇజ్రాయెల్ అనుసరిస్తున్న జాతిహనన ఊచకోత ఇజ్రాయెల్ అమానవీయ విధానాలకు పరాకాష్ఠ. ఎప్పుడో వందలు, వేల ఏండ్ల కిందట యూదులు జెరూసలేం చుట్టుపక్కల ప్రాంతం నుంచి తరిమివేయబడ్డారని చరిత్ర చెప్తున్నది. యూదులు తమను తాము ‘దేవుడు ఎంపిక చేసిన మనుషులు’గా చెప్పుకుంటారు. ఇజ్రాయెల్ అనేది ‘దేవుడు హామీ ఇచ్చిన రాజ్య’మనీ అంటుంటారు. దేశదేశాల్లో బతుకుతున్న యూదుల కోసం ఓ రాజ్యం ఏర్పాటు చేయాలనే ప్రయత్నాలు 19వ శతాబ్ది చివరనే ప్రారంభమయ్యాయి. పాలస్తీనా భూభాగంలో పశ్చిమ దేశాల వత్తాసుతో ఇజ్రాయెల్ ఏర్పాటు ప్రయత్నాలు మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ముమ్మరమయ్యాయి.
చివరికి రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఐక్యరాజ్య సమితి ‘రెండు దేశాల’ తీర్మానం ఆధారంగా 1948లో ఇజ్రాయెల్ ఏర్పాటైంది. అప్పటి నుంచి పాలస్తీనా ప్రజలు యూదు విస్తరణవాద పడగనీడలో నిత్యనరకం అనుభవిస్తున్నారు. మతం పేరిట జరిగిన దేశ విభజన గాయాలు ఇంకా మరిచిపోని భారత్ మొదటినుంచీ పాలస్తీనా పంపకాన్ని అయిష్టంగానే చూసింది. బాధిత పాలస్తీనియన్లకు కాలక్రమంలో బలమైన మద్దతుదారుగా నిలిచింది. అయితే దేశంలో మారిన రాజకీయ సమీకరణాల ఫలితంగా భారత దౌత్యనీతి లోతైన మార్పులకు గురవుతున్నది. పాలస్తీనా సమస్య కీలకదశకు చేరుకున్నట్టుగా కనిపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఇజ్రాయెల్ వైపు భారత్ మొగ్గడం ఓ విరోధాభాస.