తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిర్వహించిన గ్రూప్-1 ప్రధాన పరీక్షలో తెలుగు మీడియంలో రాసిన అభ్యర్థులకు తక్కువ మార్కులు, ఇంగ్లీష్ మీడియంలో రాసిన అభ్యర్థులకు ఎక్కువ మార్కులు వచ్చాయని ఆరోపణలు వస్తున్నాయి. తెలుగు అధికార భాషగా ఉన్న రాష్ట్రంలోనే తెలుగు భాషకు అన్యాయం జరిగిందని అభ్యర్థులు వాపోతున్నారు. గ్రూప్-1 ప్రధాన పరీక్షలో ఎక్కువ మార్కులు సాధించినవారు నలభై ఏండ్లలోపు వారే ఉన్నారని ప్రధానంగా ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలలో నిజమెంత అనే అంశాలను టీజీపీఎస్సీ తేటతెల్లం చేయాలి.
టీజీపీఎస్సీ గ్రూప్-1 ప్రధాన పరీక్షల వాల్యుయేషన్‌పై ఒక ప్రెస్‌నోట్ విడుదల చేస్తూ అత్యధిక మార్కులు సాధించిన మొదటి వంద లోపు వారిలో కులాల వారీగా, జెండర్ వారీగా ఎంతమంది ఉన్నారో తెలియజేసింది. ఒక్కొక్క పేపర్లో అభ్యర్థులు సాధించిన గరిష్ఠ మార్కులు ఎంతనే విషయం కూడా నోట్లో తెలిపింది. మూల్యాంకనం ఎన్ని రో జులు జరిగింది, ఏ పేపర్‌ను దిద్దడానికి ఎంతమంది ప్రొఫెసర్లను తీసుకున్నారనే విషయం కూడా అందులో తెలిపింది. కానీ, అదే ప్రెస్‌నోట్‌లో గ్రూప్-1 ప్రధాన పరీక్షల ఫలితాల ఆలస్యానికి ఎంఎల్సీ ఎన్నికల ‘ఎన్నికల ప్రవర్తనా నియామవళి’ (ఎంసీసీ) ఒక కారణం అని తెలిపింది.
కానీ, ఎమ్మెల్సీ ఎన్నికల ఎంసీసీ అమలులో ఉన్న సమయంలోనే టీజీపీఎస్సీ సీడీపీఓ పరీక్షల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ (జీఆర్ఎల్)ను ప్రకటించడం గమనార్హం. అంటే సీడీపీఓ పోస్టుల ఫలితాలకు వర్తించని ‘ఎన్నికల ప్రవర్తనా నియమావళి’, గ్రూప్-1 ఫలితాలకే వర్తిస్తుందా? ఇక్కడనే టీజీపీఎస్సీ లోపభూయిష్టత బయటపడింది. గ్రూప్-1 మార్కుల విషయమై ప్రధాన మీడియా, సోషల్ మీడియాల్లో ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో టీజీపీఎస్సీ తన విశ్వసనీయతను, నిజాయితీని నిరూపించుకోవాలి.
గ్రూప్-1 ప్రధాన పరీక్షల ‘కీ’ని బహిరంగపరచాలి. వాల్యుయేషన్ చేసిన ప్రొఫెసర్ల వివరాలు ‘మీడియం’ వారీగా తెలియజేయాలి. మొదటి వంద మంది, వేయి మంది, అభ్యర్థుల్లో మీడియం వారీగా, వయస్సు వారీగా ఎంతమంది ఉన్నారో బహిర్గతం చేయాలి. ఈ వివరాలను గణాంకాలతో సహా తెలియజేయకుంటే ఆందోళనలు ఎక్కువై గ్రూప్-1 ఫలితాలు కోర్టు వివాదాల్లో చిక్కుకునే ప్రమాదం ఉన్నది. వీలైతే యూపీఎస్సీ సమక్షంలో యాదృచ్ఛికంగా మీడియం వారీగా కొన్ని పేపర్లను పునర్ మూల్యాంకనం చేయాలి. అప్పుడే తెలుగు మీడియం అభ్యర్థుల్లో విశ్వాసాన్ని ప్రోది చేసినవారవుతారు.
– శాగ శ్రీనివాస్