ప్రపంచంలో అమెరికా ప్రభావం క్రమంగా తగ్గుతున్నదనే భావన స్పష్టంగా కనిపిస్తున్నది. ఒకప్పుడు ఏకైక మహాశక్తిగా ఉన్న అమెరికా, ఇపుడు చైనా వంటి దేశాల ఎదుగుదలతో పాటు బహుళధ్రువ ప్రపంచంలో సవాళ్లను ఎదుర్కొంటున్నది. దీర్ఘకాల యుద్ధాలు, వ్యూహపరమైన తప్పిదాలు, అంతర్గత రాజకీయ విభేదాలు అమెరికా ప్రతిష్ఠను దెబ్బతీశాయి. మిత్రదేశాలు స్వతంత్ర విధానాల వైపు మొగ్గుచూపుతుండగా, అభివృద్ధి చెందుతున్న దేశాలు కొత్త భాగస్వామ్యాలను అన్వేషిస్తున్నాయి. అయితే అమెరికా కథ ముగిసిందని అపుడే చెప్పేయడం తొందరపాటు అవుతుంది. అయితే అగ్రరాజ్యం పతనావస్థకు చేరుకున్నది అని మాత్రం ఘంటాపథంగా చెప్పవచ్చు. ఇరాన్ యుద్ధంలో చావుతప్పి కన్ను లొట్టపోయి ఒప్పందాలకు దేబిరించడం అస్తిత్వ సమస్యగానే చూడాలి. ఈ నేపథ్యంలో విశ్వవేదికపై భారత్ పోషిస్తున్న పాత్ర ఏమిటనేది ప్రశార్థకం అవుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.
ఇటీవలి కాలంలో, మరీ ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే పాలనలో విదేశాంగం నానాటికీ తీసికట్టు అవుతుండటం మనం చూస్తున్నాం. ‘సూటూబూటు’ విదేశీ పర్యటనలు క్రమం తప్పకుండా జరుగుతున్నప్పటికీ భారత్ ప్రభావ పరిధి ఆ నిష్పత్తిలో విస్తరించిందా? అనేది ప్రశ్న. తన వ్యక్తిగత స్థాయిని పెంచుకునే ఒక్క అవకాశాన్ని మోదీ వదులుకోవడం లేదు. అయితే ఈ అట్టహాసాలు, ఆడంబరాలు భారత్ దౌత్య ప్రాబల్యాన్ని పెంచాయా? అంటే..లేదనే సమాధానమే వస్తుంది. విశ్వవేదికలపై భారత్ ఒంటరిగా మారుతున్నదని చెప్పడం అతిశయోక్తి కాకపోవచ్చు. దౌత్యం అంటే కేవలం సంబంధాలను కొనసాగించడం మాత్రమే కాదు, ప్రపంచ ఘటనలపై ప్రభావం చూపించడం కూడా. ఇరాన్ విషయమే తీసుకుంటే యుద్ధ విరమణ చర్చల్లో పాక్ మధ్యవర్తిగా నిలిచింది. సంతకాల్లో కూడా పాల్గొన్నది. కానీ ‘మై ఫ్రెండ్ మోదీ’ అని అమెరికా అధ్యక్షుడు పదే పదే చెప్పుకొనే మోదీ నాయకత్వంలోని భారత్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఆ మాటకు వస్తే వినిపించలేదని కూడా చెప్పాలి. ఒకప్పుడు అలీనోద్యమానికి అధ్యక్షత వహించిన భారత్ ఇపుడు అంతర్జాతీయ నిర్ణయాల్లో అంటుకు లేకుండా పోవడం ఏమిటి? ఇక ప్రాంతీయ సంబంధాలు కూడా డోలాయమానంలోనే కొనసాగుతున్నాయి. ఇరుగుపొరుగు దేశాలన్నీ దాదాపుగా చైనా ప్రభావ పరిధిలోకి వెళ్లిపోయాయి.
ప్రపంచ ఘటనల్లో క్రియాశీలంగా నిలువాలంటే విశ్వసనీయతను పెంపొందించుకోవాలి. దౌత్యానికి పదును పెట్టుకొని ప్రపంచ దేశాలతో సుహృద్భావాన్ని పెంపొందించుకోవాలి. ప్రస్తుతం విదేశాంగంలో వేస్తున్న తప్పటడుగులు భారత్ ప్రభావాన్ని తగ్గించే అవకాశం ఉన్నది. ఇరాన్ యుద్ధానికి ముందు ప్రధాని మోదీ హుటాహుటిన ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లడం, ప్రపంచ దేశాలు వెలివేసిన దేశాన్ని పొగిడి రావడం వంటివి ఈ సందర్భంగా ఉదహరించవచ్చు. ఆర్థిక దౌత్యంలో కూడా మరింత చురుకుదనం అవసరం అని చెప్పక తప్పదు. అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన భారత్ వాణిజ్య ఒప్పందాల విషయంలో తరచూ తాత్సారం చేస్తున్నది. ప్రస్తుత ప్రపంచంలో దౌత్యానికి ప్రధాన ఆయుధాలుగా వాణిజ్యం, పెట్టుబడులు మారాయి. ఈ విషయంలో సాచివేత ధోరణి భారత్ వాణిజ్య అవకాశాలను తగ్గించే ప్రమాదం ఉన్నది. మరో ముఖ్యమైన అంశం అంతర్గత విధానాల ప్రభావం. దేశీయ విధానాలు, అంతర్జాతీయ ప్రకటనల మధ్య పొంతన లేకపోతుండటం వల్ల భారత్ పలుకుబడి తగ్గిపోతున్నది. అంతర్గత పరిణామాలు అంతర్జాతీయ అభిప్రాయాలను ప్రభావితం చేసే ఈ కాలంలో దీనిని నిర్లక్ష్యం చేయలేమనేది తెలిసిందే. సామర్థ్యానికి తగ్గ ఫలితాలు అందుకోలేకపోవడమే నేటి మన విదేశాంగ నీతిలో అసలు సమస్య. దౌత్య విధానంలో సున్నితమైన మార్పులు. ప్రాంతీయ సంబంధాలను బలోపేతం చేయడం, ఆర్థిక ఒప్పందాలను వేగవంతం చేయడం, అంతర్జాతీయ వేదికల్లో స్పష్టమైన వైఖరిని ప్రదర్శించడం ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసరం. స్పందనాత్మక దౌత్యం కంటే ముందస్తు ప్రణాళికతో దూసుకుపోయే దౌత్యమే దేశానికి ప్రపంచంలో సముచిత స్థానాన్ని సాధించి పెట్టగలదు.