అమెరికా కల అనేది ఓ వందేండ్లుగా వాడుకలో ఉన్న మాట. ఇప్పుడు ఆ కలకు నూరేండ్లు నిండుతున్నట్టున్నాయి. ముఖ్యంగా భారతీయులకు. అధికారికంగా వెళ్లినవారికీ, అనధికారికంగా వెళ్లినవారికీ పెద్ద తేడా ఏం లేదు ఈ విషయంలో. అమెరికాకు పూర్వ వైభవం సాధిస్తాననే నినాదంతో పోటీ చేసి అసాధ్యమైన రీతిలో రెండో విడత అధికారం చేజిక్కించుకున్నారు డొనాల్డ్ ట్రంప్. ఆయన వైట్ హౌజ్‌లోకి అడుగు పెట్టీ పెట్టకుండానే ఫర్మానాలను శరపరంపరగా విసురుతున్నారు. అందులో అతి ముఖ్యమైనవి శరణార్థులకు, ప్రవాస జీవులకూ సంబంధించినవి.
దేశ దేశాల నుంచి ఎవరెవరో వచ్చి తిష్ఠ వేసి, సుష్టుగా డాలర్లు సంపాదించేసి అమెరికన్లకు ఆదాయం, ఉద్యోగాల్లేకుండా చేస్తున్నారనేది ఆయన బాధ. అందుకే అమెరికాలోకి అక్రమ వలసల నిరోధానికి సరిహద్దులను కట్టుదిట్టం చేశారు. నిబంధనలను కఠినతరం చేశారు. పత్రాల్లేకుండా దొరికినవాళ్లను దొరికినట్టు సైనిక విమానాల్లో పంపి ఆయా దేశాలకు అప్పగించేస్తున్నారు. బుధవారం అమృత్‌సర్‌లో దిగిన సీ-17 విమానంలో వంద మందికి పైగా భారతీయ అక్రమవలసదారులు ఆ కోవలోకే వస్తారు. వారి కాళ్లకు, చేతులకు సంకెళ్లు వేసి తీసుకువచ్చారు. ఇదంతా దొడ్డి దారిన వెళ్లినవారి గోల.
రాజమార్గంలో వెళ్లినవారిది వేరే కథ. వారినీ రకరకాల సమస్యలు వేధిస్తున్నాయి. కొన్నాళ్ల కిందటి వరకూ డెలివరీల సమయంలో తోడుగా ఉండేందుకు తల్లిదండ్రులను అమెరికాకు తీసుకువెళ్లే సంప్రదాయం జోరుగా సాగేది. ఆ గడ్డ మీద పురుడు పోసుకుంటే ఆటోమెటిక్‌గా అమెరికా పౌరసత్వం వస్తుందనే భరోసాయే అందుకు కారణం. ఇప్పుడా వెసులుబాటు లేదు. ఒక్క కలం పోటుతో ట్రంప్ దాన్ని రద్దు చేసేశారు. ఎప్పుడో 150 ఏండ్ల కిందట నల్లజాతి బానిసల కోసం రూపొందించిన నిబంధనను నాకంటే నాకని ఎగబడి వాడేసుకుంటున్నారని ట్రంప్ అక్కసు.
అమెరికా పౌరసత్వం తరతరాలుగా (కనీసం కొలంబస్ సముద్రమార్గం కనిపెట్టిన తర్వాత వచ్చిపడ్డ యూరోపియన్ వలసదారులకు) ఉంటున్నవారికే జన్మతః పౌరసత్వం చెందాలనేది ఆయనకు తోచిన దేశభక్తి. దాంతో ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ఈ సౌకర్యం నిలిపివేస్తున్నట్టు ఫర్మానా జారీచేశారు. అంతే. ఆ తేదీలోపు ఎన్నారైలు బలవంతపు డెలివరీలు ఆగమేఘాల మీద చేయించుకోవడం విడ్డూరమే. అయితే, ఇదంతా వృథాయాసమే అయ్యింది. ట్రంప్ ఫర్మానాలను కోర్టులు అంతే వేగంతో పక్కన పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు అమెరికన్లు ఎవరు? అనే మౌలిక ప్రశ్న కూడా ముందుకు వస్తున్నది.
తాజాగా భారతీయులు ఎంతగానో కోరుకునే వర్క్ వీసా వ్యవస్థను దెబ్బతీసే దిశగా ట్రంప్ నిర్ణయం తీసుకోబోతున్నారనే వార్తలు ఆ వీసా కింద అమెరికాలో నివసిస్తున్న వారిలో, ఆశావహుల్లో గుబులు పుట్టిస్తున్నది. ఇదివరకటి జో బైడెన్ హయాంలో కల్పించిన హెచ్-1 బీ, ఎల్-1 వీసాల ఆటోమెటిక్ రెన్యువల్ సౌకర్యాన్ని రద్దు చేస్తారని అంటున్నారు. ఈ వీసాల లబ్ధిదారుల్లో భారతీయులే అధికంగా ఉంటారు. కనుక వారి మీదే దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందనేది తెలిసిందే. అమెరికా రాజకీయాల్లో భారతీయుల ప్రభావం పెరిగిందని ఓ వైపు సంబురపడాలో, పౌరసత్వంలో పరాయీకరణ చెందడం గురించి ఆందోళన చెందాలో తెలియని పరిస్థితి వచ్చిపడింది. అమెరికా ముంగిట భారతీయత ఇలా అగ్ని పరీక్షకు గురవుతుంటే కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం మౌనముద్ర దాల్చడం మరో విషాదం.