డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు, అభ్యంతరాలతో భారత యువత అయోమయంలో పడింది. ‘దూరపు కొండలు నునుపు’ అన్న ట్టు తయారైంది అగ్రరాజ్యంలోని ఉన్నత విద్య. ప్రపంచం మొత్తం తమ చెప్పుచేతల్లో ఉండాలని భావిస్తున్న ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇతర దేశాలకు మరణశాసనంగా మారుతున్నాయి.
2024, మే నాటికి దేశం వెలుపల నివసిస్తున్న భారతీయుల సంఖ్య దాదాపు 3.5 కోట్లు. ఇందులో సుమారు 1.58 కోట్ల మంది నాన్ రెసిడెంట్ ఇండియన్లు (ఎన్ఆర్ఐ). యూకే, కెనడా, అమెరికా, జర్మనీ, జపాన్, మలేషియా, దక్షిణాఫ్రికా, యూఏఈ, సౌదీ అరేబియా, సింగపూర్, మారిషస్, మయన్మార్ వంటి దేశాల్లో భారతీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఎక్కు మంది విద్యార్థులే. దశాబ్దాలుగా సాగుతున్న ఈ సంప్రదాయానికి ట్రంప్ మంగళం పాడారు. అమెరికాలో చదువుకొనే విద్యార్థులు బుద్ధిగా చదువుకోవాలి తప్పితే పార్ట్‌టైం ఉద్యోగాలు చేయడానికి వీల్లేదని తేల్చిచెప్పారు. ఇది భారత్ సహా అనేకదేశాల విద్యార్థులకు శరాఘాతంగా మారింది. వర్క్ వీసా తో అమెరికా వెళ్లి పనిచేస్తున్న వారి కంటే ఉన్నత విద్యనభ్యసించేందుకు వెళ్లి ఖర్చుల వెతలు తీర్చుకొనేందుకు పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నవారే ఎక్కువ. ఎలాంటి ధ్రువీకరణ పత్రాల్లేకుండా అక్కడ నివసిస్తున్న వందల మంది భారతీయులను ఇటీవల భారత్‌కు తరలించారు.
అమెరికా నుంచి పెద్ద ఎత్తున వెనక్కి వస్తున్న వారితో దేశంలో నిరుద్యోగ సమస్య మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. 2024, జూన్ నాటికి దేశంలో నిరుద్యోగిత రేటు 9.2 శాతంగా ఉన్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. జీ-20 దేశాల నిరుద్యోగిత రేటులో భారత్ మూడో స్థానంలో ఉన్నది. మరోవైపు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనూ నిరుద్యోగం క్రమంగా పెరుగుతూ వస్తున్నది. 2024, మేలో గ్రామీ ణ ప్రాంతాల్లో ఇది 6.3 శాతం ఉండగా, జూన్ నాటికి 9.3 శాతానికి ఎగబాకింది. పట్టణ ప్రాంతాల్లో అదే ఏడాది మే నెలలో 8.6 శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు జూన్ నాటికి 8.9 శాతానికి పెరిగింది. కార్మిక భాగస్వా మ్య రేటు (లేబర్ పార్ట్నర్షిప్ రేట్) మేలో 40.8 శాతం ఉండగా జూన్ నాటికి 41.4 శాతానికి పెరిగింది. 2024, జూన్‌లో ఉపాధి రేటు 38 శాతం నుంచి 37.6 శాతానికి దిగజారింది.
ఈ నేపథ్యంలో భారత్‌లో నిరుద్యోగ సమస్య మరోమారు భయపెట్టే అవకాశం కనిపిస్తున్నది. ఎన్నో ఆశలు పెట్టుకొని, ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి అమెరికా వెళ్లిన యువత ఇప్పుడు ఏం చేయాలో పాలుపోని స్థితిలో కూరుకుపోయింది. పార్ట్‌టైం ఉద్యోగాలతో చదువులు నెట్టుకొస్తు న్న యువత చదువు ముందుకుసాగేదెలానో తెలియక అల్లాడిపోతున్నా రు. ఇప్పటికే తమ కోసం ఎన్నో త్యాగాలు చేసిన తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టలేక తమలో తామే మథనపడుతున్నారు. అమెరికా నుంచి వచ్చిన వారి వివరాలు ప్రభుత్వం వద్ద ఉంటాయి కాబట్టి తక్షణమే వారిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి. భయాందోళనల మధ్య భారత్ చేరుకున్న వారిలోని నైపుణ్యాన్ని పరిగణనలోకి తీసుకుని స్టార్టప్‌లు నెలకొల్పేందుకు సాయం చేయాలి. అలా చేయడం వల్ల ఒకరిద్దరికే కాకుండా వారి ద్వారా మరెంతోమంది నిరుద్యోగులకు ఆసరా లభిస్తుంది. కాబట్టి ఈ విషయం లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన నిర్ణయం తీసుకోవాలి.
– వి.వి.వెంకటేశ్వరరావు 63008 66637