నడక నేర్పిన నాటకం
రంగస్థలం అనే ప్రత్యేక వేదిక లేకుండా బాగోతాల ప్రదర్శనలు ప్రజల మధ్యలోనే పాత్రలకు తగిన దుస్తులతో ఆయుధాలు ధరించి సంభాషణలతో ప్రజలను అలరిం చేవారు. ‘రామాయణం’, ‘మహాభారతం’, ‘అల్లిరాణి’, ‘పరుశురామ పరాక్రమం’ మొదలైన పౌరాణిక కథలను ప్రదర్శించేవారు
రంగస్థలం అనే ప్రత్యేక వేదిక లేకుండా బాగోతాల ప్రదర్శనలు ప్రజల మధ్యలోనే పాత్రలకు తగిన దుస్తులతో ఆయుధాలు ధరించి సంభాషణలతో ప్రజలను అలరిం చేవారు. ‘రామాయణం’, ‘మహాభారతం’, ‘అల్లిరాణి’, ‘పరుశురామ పరాక్రమం’ మొదలైన పౌరాణిక కథలను ప్రదర్శించేవారు. ఈ నాటకాల ప్రదర్శన సంప్రదాయ భరతునికన్నా ప్రాచీనమైనవేమో. దళితులు అయిననూ చిందు భాగవతులు చాలా చక్కటి సంభాషణలతో వేషాలతో చూపరులను రక్తి కట్టించేవారు. అసలు భారతదేశంలో ఆదివాసులే నాటక ప్రదర్శనకు మూలకారకులు కావచ్చును.
తెలంగాణలో దేశీ రూపకమైన నాటకాలు వెలువడినంత విస్తృతంగా సాహిత్య సంబంధమైన నాటక రచన జరగలేదు. తెలంగాణలో మొట్టమొదటి నాటక రచయిత సోమరాజు రామానుజరావు (1896-1934). ఆయన ఖమ్మం జిల్లా భద్రాచలం ప్రాంతంలోని దుమ్ముగూడెం గ్రామ భూస్వామి. ఆయన జాతీయోద్యమ ప్రభావంతో 1921లో ‘స్వరాజ్య రథం’ అనే నాటకాన్ని రాశాడు. ఆ నాటక ప్రదర్శన ప్రజలను ఎంతో ప్రభావితం చేసింది. ఈ నాటకాన్ని 1922లో బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. జైలుశిక్షను తప్పించుకోవటానికి ఆయన రంగూన్ చేరుకొని అక్కడ ‘తెలుగు’ పత్రికను స్థాపించాడు. ఆ పత్రికలో ‘రంగూన్ రౌడీ’ అనే నాటకాన్ని సీరియల్గా ప్రచురించాడు. ఈ నాటకం కూడా ప్రజల అభిమానాన్ని పొందింది. ఆయన 50 వరకు నవలలు, కథలు రాశాడు. కానీ ఆ సాహిత్యమంతా 1970లో ఆయన ఇంటికి జరిగిన అగ్ని ప్రమాదంలో కాలిపోయినట్లు తెలుస్తున్నది. ఈ మధ్యనే 2002లో శ్రీధర్-నాగవాణి దంపతులు హైదరాబాద్ ప్రాచ్యలిఖిత భాండాగారంలో జీర్ణావస్థలో ఉన్న ‘స్వరాజ్య రథం’ నాటకాన్ని పరిష్కరించి వెలుగులోకి తెచ్చారు.
ఒద్దిరాజు సోదరులు చాలా నాటకాలను రచించారు. ఆ నాటకాలు తర్వాత 2012లో మూడు సంపుటాలుగా ప్రచురింపబడ్డాయి. కానీ ఇవి ఎక్కడా ప్రదర్శింపబడిన దాఖలాల్లేవు. 1920 నుంచి తెలంగాణ రచయితల దృష్టి నాటక రచనపై ప్రసరించింది. సురవరం ప్రతాపరెడ్డి గద్యం, పద్యాత్మకమైన ‘ఉచ్ఛల విషాదం’(1921), ‘భక్త తుకారం’ (1924) నాటకాలను రచించాడు. ‘భక్త తుకారం’ రంగస్థల ప్రదర్శన జరిగినట్లు తెలుస్తున్నది. కొల్లాపురం మఠం రాజయ్య (1900-1975) ప్రభుత్వ నిషేధాజ్ఞలను ధిక్కరించి 1933లో గుంటూరు పోయి గాంధీని కలిసి, ఆ స్ఫూర్తితో ‘శ్రీ మహాత్మా గాంధీ’ అనే నాటకాన్ని రచించాడు. 1949 నుంచి ఈ నాటకం వంద ప్రదర్శనలకుపైగా జరిగింది. ఇది 2012లో ముద్రించబడింది. మార్బాల రంగాచార్యు లు ‘కాకాసుర గర్వ సంహారం’, ‘లీలావతి విజయం’, ‘చండ భార్గవం’ మొదలైన నాటకాలు రచించాడు. ఈయన గోలకొండ కవుల సంచిక ముఖచిత్రకారుడైన రామాచార్యుల సోదరుడు.
వరంగల్ జిల్లావాడైన ఆయుర్వేద వైద్యుడు చొల్లేటి నర్సింహ రామశర్మ (1908-1984) ‘భిషగ్విజయం’, ‘చ్యవన ప్రాశ’ నాటకాలను రచించాడు.
ఆ తర్వాత తెలంగాణలో తెలంగాణ విమోచనోద్యమం, కమ్యూనిస్టుల సాయుధ పోరాటంతో ప్రభావితమై ప్రజల్లో చైతన్యాన్ని నింపుతూ ఎన్నో నాటకాలు రచింపబడినాయి, ప్రదర్శించబడినాయి. కానీ ఈ నాటకాలన్నీ కూడా నిషేధాజ్ఞలకు భయపడి ఆంధ్ర-తెలంగాణ పొలిమేర ప్రాంతంలో ప్రదర్శింపబడినాయి. 1943లో ‘ప్రజా నాట్యమండలి’ స్థాపించబడి ‘కళ కళ కోసం కాదు.. కళ ప్రజల కోసం’ అనే భావనతో నాటక ప్రదర్శనలను ప్రజల్లోకి తీసుకు వెళ్లింది. ప్రజా నాట్యమండలి కళాకారులు ప్రజలను పోరాట గమ్యం వైపుగా చైతన్యవంతులను చేశారు. అలాంటి నాటకాల్లో సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావు రచించిన ‘మా భూమి’ నాటకం ఒకటి. 1947లో రచింపబడిన ఈ నాటకాన్ని మొత్తం 125 దళాలు తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ప్రదర్శించాయి. దీనిలో నిత్య జీవితంలోని వ్యక్తులే పాత్రలుగా సజీవంగా కనిపిస్తాయి. ఈ నాటకంలో భూమిలేని నిరుపేదల కష్టాలు, శ్రమ దోపిడీ, భూమి కోసం జరిపే పోరాటం చిత్రీకరించబడింది.
వాసిరెడ్డి భాస్కరరావు 1953లో ‘పోతుగడ్డ’ నాటకం రచించాడు. ఇది కూడా ప్రజల్లో చైతన్యాన్ని నింపే నాటకం. 1973లో సుంకర సత్యనారాయణ ‘గెరిల్లా’ అనే నాటకం రచించాడు. ఇది ‘మా భూమి’ నాటకానికి కొనసాగింపు అని చెప్పాలి.
కథా రచయితగా పేరుపొందిన పొట్లపల్లి రామారావు 1948లో ‘పగ’, ‘సురభరాహి’, ‘న్యాయం’ (1949) నాటికలు రచించాడు. కానీ ఈ నాటికలు ప్రదర్శింపబడినట్లు లేదు. ఈ నాటకాలలో తెలంగాణ పోరాట పరిణామాలు చిత్రింపబడినాయి.
డాక్టర్ రాజారావు 1948 ఏప్రిల్లో ‘వీరనారి’ అనే నాటకం రచించాడు. 1947 ఆగస్టు 15 భారత స్వాతంత్య్రం తర్వాత భారత యూనియన్లో చేరటానికి నిజాం నిరాకరించినప్పుడు జాతీయ కాంగ్రెస్ సత్యాగ్రహ పోరాటం చేసింది. ఈ పోరాటాన్ని చిత్రిస్తున్న నాటకమే ‘వీరనారి’. సుంకర సత్యనారాయణ ‘వీర కుంకుమ’ నాటికను రచించాడు. దానిలోనూ భారత యూనియన్లో నైజాం చేరాలని ప్రజాతంత్ర ప్రభుత్వం ఏర్పడాలని కమ్యూనిస్టు పార్టీని కోరుతూ నైజాం వ్యతిరేక పోరాటాన్ని చిత్రీకరించబడింది.
సుంకర సత్యనారాయణ ‘కాంగ్రెసా-ఆంగ్రేజా’ అనే నాటకాన్ని రచించాడు. దీనిలో కూడా భారత యూనియన్లో నైజాం చేరాలనే పోరాటాన్ని, రజాకార్ల అణచివేతను చిత్రిస్తున్నది. మహీధర రామ్మోహనరావు 1948లో ‘శాంతి రక్షణ కోసం’, ‘రిపబ్లిక్ వెలిసింది’ అనే నాటకాలు యూనియన్లో నిజాం కలిసే నేపథ్యాన్ని చిత్రిస్తున్నవి.
– ముదిగంటి సుజాతారెడ్డి
99634 31606
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

