భారతదేశంలో ఆదివాసీ పోరాటయోధుల పరంపరకు చెందినవారు గురూజీ శిబూ సోరెన్. మైదాన ప్రాంతాల దమననీతి పాలనలో గిరిపుత్రులకు న్యాయం దక్కదని గొంతెత్తి ఘోషించిన ఉద్యమ కెరటం ఆయన. ప్రత్యేక రాష్ట్రమే శరణ్యమని చాటిన అలుపులేని తిరుగుబాటు శిఖరం ఆయన. బీహార్ భూభాగంలోని అడవిబిడ్డల వాటాను ఝార్ఖండ్ రూపంలో ప్రత్యేక రాష్ట్రంగా సాధించిన పోరాట యోధుడు. గిరిజన కుటుంబంలో జన్మించిన సోరెన్ తాను పుట్టిపెరిగిన అడవుల నుంచి ఢిల్లీ వరకు రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు.
బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన సంతాల్ తెగ వారసత్వాన్ని కొనసాగించిన ఈ అడవితల్లి బిడ్డ చిన్నప్పుడే తన తండ్రిని వడ్డీ వ్యాపారులు పొట్టన పెట్టుకున్నప్పుడే పోరాటదీక్ష పూనారు. 18వ ఏట సంతాల్ నవయువక్ సంఘ్ ఏర్పాటు చేసి గిరిజన హక్కుల కోసం మొదలుపెట్టిన పోరాటం చివరకు సొంత రాష్ట్రం సాధించే దాకా కొనసాగింది. శిబూ సోరెన్ ఒక నికార్సైన గిరిజన తిరుగుబాటుదారుడు. బ్రిటిష్ పాలకులకు సింహస్వప్నంలా నిలిచిన బిర్సా ముండా నిజమైన వారసునిగా గిరిజనుల హక్కుల కోసం శిబూ మొక్కవోని దీక్షతో నిలిచారు. బిర్సా విదేశీయులతో పోరాడితే శిబూ స్వదేశీ దోపిడీదారులపై అవిశ్రాంత పోరాటం సాగించారు.
వడ్డీ వ్యాపారుల దోపిడీకి గురై గిరిజనులు గిలగిలలాడుతుంటే ఆ దుర్మార్గాలపై శిబూ సోరెన్ గొంతెత్తారు. పిడికిలి బిగించారు. తిరుగుబాటు లేవనెత్తారు. కాకలు తీరిన యోధుడిగా నిలిచారు. గిరిజనుల దోపిడీకి వ్యతిరేకంగా శిబూ సోరెన్ ‘ధాన్ కాటో’ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇందులో, గిరిజన మహిళలు పొలాల నుంచి వరిని కోసేవారు, పురుషులు విల్లు బాణాలతో వారిని రక్షించేవారు. ఇది కేవలం ఒక ఉద్యమం కాదు, గిరిజనులను ఏకం చేసిన సామాజిక విప్లవం. శిబూ అజ్ఞాత జీవితం, అడవుల్లో అర్ధరాత్రి సంచారం గురించి గిరిజనులు ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకొంటారు.
ఝార్ఖండ్ ముక్తిమోర్చా వ్యవస్థాపకుల్లో ఒకరిగా ఆయన సుదీర్ఘకాలం పోరాటం నడిపారు. ఆయన పోరాటరూపాలు కూడా దెబ్బకు దెబ్బ అన్నట్టుగా సాగేవి. అందుకు తగ్గట్టుగానే జీవితాంతం ఆయనను కేసులు వెంటాడాయి. హక్కులు అడగడం ద్వారా కాదు, పోరాడటం ద్వారానే లభిస్తాయని శిబూ సోరెన్ గిరిజన యువతకు బోధించారు. ఒక వ్యక్తి దృఢ సంకల్పంతో ఉంటే, అతను మొత్తం సమాజపు దిశను మార్చగలరనడానికి ఆయన జీవితం ఓ ఉదాహరణ. శాసనసభ నుంచి పార్లమెంటు దాకా, ముఖ్యమంత్రి నుంచి కేంద్రమంత్రి దాకా ఎన్నో పదవులను నిర్వహించిన శిబూ మరణం దేశ రాజకీయాలకు తీరని లోటు.
శిబూను ఆయన అభిమానులు ‘దిశోం గురు’ అని ప్రేమతో పిలుచుకుంటారు. సంతాలీ భాషలో ఆ మాటలకు మార్గదర్శకుడైన గురువు అని అర్థం. అందుకు తగ్గట్టుగానే ప్రత్యేక రాష్ట్ర పోరాటాలకు శిబూ సోరెన్ మార్గదర్శిగా, గురుతుల్యునిగా నిలిచారు. ప్రత్యేక ఝార్ఖండ్ రాష్ర్టాన్ని కలగనడమే కాకుండా అవిశ్రాంత పోరాటంతో దానిని సాధించిన దార్శనిక నేత శిబూ సోరెన్. రాజీలేని పోరాటం జరపడం ఎలాగో ఆయనను చూసే నేర్చుకోవాలి. ఆయన ఉద్యమస్ఫూర్తితోనే కేసీఆర్ తెలంగాణ సాధనకు ఉద్యుక్తుడయ్యారు. మలిదశ ఉద్యమ ప్రస్థానానికి నాందీ ప్రస్తావనగా నిలిచిన కరీంనగర్ సింహగర్జన సభకు శిబూ స్వయంగా హాజరై మనస్ఫూర్తిగా ఆశీస్సులు అందించడం విశేషం. తెలంగాణ ఏర్పాటుకు ఆయన అడుగడుగునా సహాయ సహకారాలు అందించారు. ఆ మహానుభావుని స్ఫూర్తి తెలంగాణ ప్రజలకు చిరస్మరణీయం.