స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పెద్దలు అంటారు. దేశాల విషయంలో స్నేహాలు మరింత జాగ్రత్తగా, ఆచితూచి చేయాల్సి ఉంటుంది. నేతల మధ్య స్నేహాలు ముఖ్యమైనవే. కానీ, జాతీయ ప్రయోజనాలే అంతిమమైనవిగా నిలుస్తాయనడంలో సందేహం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన దోస్త్ అని ప్రధాని మోదీ తరచుగా చెప్తుంటారు. ఇప్పుడు ఇండో-పాక్ యుద్ధం నేపథ్యంలో తన దోస్త్ చేసిన పని వల్ల ప్రధాని మోదీ తీవ్ర ఇరకాటంలో పడ్డారు. ట్రంప్ గతంలో రష్యా-ఉక్రెయిన్ మధ్య సంధి కుదిర్చేందుకు వైట్‌హౌస్‌లో జరిపిన ప్రయత్నాలు హాస్యాస్పదంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇండియా వంతు వచ్చినట్టు కనిపిస్తున్నది. మధ్యవర్తిత్వ రభస కేంద్ర ప్రభుత్వం మెడకు చుట్టుకున్నట్టే కనిపిస్తున్నది. మంగళవారం విదేశాంగ ప్రతినిధి పత్రికా సమావేశంలో ఈ అంశమే ప్రధానంగా ప్రస్తావనకు రావడం గమనార్హం.
భారత్-పాక్ యుద్ధ విరమణకు చాలా చాలా చేసినట్టు అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్ చెప్పుకొంటున్నారు. వాణిజ్యాన్ని రాజకీయ అవసరాలకు వాడుకోవడంలో తనను మించినవాడు లేడని ఆయన అంటున్నారు. నిన్నటిదాకా టారిఫ్‌లనే అస్ర్తాలుగా వాడుకున్న ఈయన ఇండియా, పాకిస్థాన్‌లను యుద్ధం ఆపకపోతే మొత్తంగా వాణిజ్యమే ఆపేస్తానని బెదిరించారట. దాంతో ఇరుపక్షాలూ దారికి వచ్చాయట. ఇంకా ఆశ్చర్యకరమైన అంశమేమంటే భారత్-పాకిస్థాన్ దేశాల అణుయుద్ధం నివారించానని ఆయన చెప్పుకోవడం. ఒక మహా విధ్వంసాన్ని నివారించినందుకు తనకెంతో ఊరటగా ఉందని ట్రంప్ అంటున్నారు. ఇవన్నీ రకరకాల వేదికలపై ఆయన వెల్లడిస్తున్న విషయాలు. ఆయన ఒక్కో సంగతి వెల్లడిస్తున్నకొద్దీ పాకిస్థాన్ సంగతేమో గానీ, ఇండియాకు మాత్రం ఇరకాటం అంతకంతకూ పెరిగిపోతున్నది. అమెరికాకు ఈ ప్రకటనలపై అధికారికంగా నిరసన తెలిపారా? అనే ప్రశ్న ఎదురైనప్పుడు విదేశాంగ శాఖ ప్రతినిధి సూటిగా సమాధానం చెప్పకుండా దాటవేయడం ఇందుకు నిదర్శనం.
అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్షుడు డొనా ల్డ్ ట్రంప్ వ్యవహారంలో గాని, వ్యక్తీకరణలో గాని సంప్రదాయ రాజకీయాలకు భిన్నమైన నాయకుడు. తాజాగా ఇండియా-పాకిస్థాన్ రణ విరమణ విషయంలోనూ ఇది స్పష్టంగా వ్యక్తమవుతున్నది. అయితే, పాకిస్థాన్ మాత్రం అమెరికా మధ్యవర్తిత్వం గురించి బాహాటంగానే ఒప్పుకున్నదనేది వేరే విషయం. రెండు దేశాల సైనికాధికారుల చర్చల ద్వారా కాల్పుల విరమణ జరిగినట్టు, ఇండియా జరిపిన విధ్వంసాన్ని చూసి పాకిస్థాన్ కాళ్లబేరానికి వచ్చినట్టు మన విదేశాంగ శాఖ ప్రతినిధి చెప్తున్నారు. అమెరికా లేదా ట్రంప్ మధ్యవర్తిత్వం వహించిన మాట నిజమేనని అధికారికంగా ఒప్పుకోవడం భారత్‌కు సాధ్యపడదనే విష యం విదేశాంగ ప్రతినిధి ప్రకటన ద్వారా తేలిపోయింది. అదే సమయంలో అమెరికా అధినేత ట్రంప్ చేసిన ప్రకటనలపై నిరసన తెలపడమూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి సాధ్యపడకపోవచ్చు. ఈ నేపథ్యంలో మరికొన్నాళ్ల పాటురణ విరమణ వివాదం కేంద్ర ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉంటుంది. అనూహ్యమైన రీతిలో అమల్లోకి తెచ్చిన రణ విరమణ గురించి దేశ ప్రజలను విశ్వాసంలోకి తీసుకోకపోవడమే అందుకు ముఖ్య కారణం.