Tribunals | ట్రిబ్యునళ్ల తీరుతోనే నీటి కష్టాలు
వందల నదులకు భారత్ పుట్టినిల్లు. అందుకే మన దేశాన్ని నదుల దేశంగా కూడా పిలుస్తారు. సింధు నుంచి కావేరి వరకు.. మొత్తం 400కు పైగా చిన్న, మధ్య తరహా, భారీ నదులు మన దేశంలో ఉన్నాయి. కానీ, గుక్కెడు నీటి కోసం తండ్లాట తప్పడం లేదు. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ లాంటి నగరాలు తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి.
వందల నదులకు భారత్ పుట్టినిల్లు. అందుకే మన దేశాన్ని నదుల దేశంగా కూడా పిలుస్తారు. సింధు నుంచి కావేరి వరకు.. మొత్తం 400కు పైగా చిన్న, మధ్య తరహా, భారీ నదులు మన దేశంలో ఉన్నాయి. కానీ, గుక్కెడు నీటి కోసం తండ్లాట తప్పడం లేదు. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ లాంటి నగరాలు తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ దుస్థితికి ప్రధాన కారణం ప్రభుత్వాలకు ముందుచూపు లేకపోవడమే. కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టులను నిర్మించకపోవడమే. ప్రభుత్వాలు మారుతున్నా, విధానాలు మారుతున్నా నీటి కష్టాలు మాత్రం తీరడం లేదు. రాష్ర్టాల మధ్య జల వివాదాలకు పరిష్కారం దొరకడం లేదు.
Tribunals | దేశ అవసరాలకు సరిపడా నీళ్లున్నా.. జల వివాదాల కారణంగా కొన్ని ప్రాంతాలు కరవు సీమలుగా మారుతుండటం బాధాకరం. జల వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వాలు నియమిస్తున్న ట్రిబ్యునళ్లు కోరలు లేని పులుల్లా మారిపోయాయి. ఇప్పటివరకు ఏ ఒక్క సమస్యను ట్రిబ్యునళ్లు పరిష్కరించకపోవడమే అందుకు నిదర్శనం.
ట్రిబ్యునల్ వ్యవస్థ పాక్షిక న్యాయ వ్యవస్థగా పని చేస్తుంది. రాష్ర్టాల మధ్య జల వివాదాలు తలెత్తినప్పుడు వీటిని కేంద్రం ఏర్పాటు చేస్తుంది. 262 అధికరణం ప్రకారం.. ట్రిబ్యునళ్లను నియమించే అధికారం పార్లమెంట్‌కు రాజ్యాంగం కల్పించింది. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం-1956 ప్రకారం.. రెండు లేదా మూడు రాష్ర్టాల మధ్య నెలకొన్న జల జగడాలను ఇవి పరిష్కరించాలి. కానీ, నేటి వరకు ఒక్క వివాదాన్ని కూడా ట్రిబ్యునళ్లు పరిష్కరించిన పాపానపోలేదు.
మన దేశంలో ఇప్పటి వరకు 8 ట్రిబ్యునళ్లు ఏర్పాటయ్యాయి. గోదావరి, కృష్ణా, వంశధార, బియాస్, కావేరి, మహదాయి నదులకు సంబంధించి జల వివాదాల పరిష్కారం కోసం ఆయా ట్రిబ్యునళ్లను కేంద్ర ప్రభుత్వం నియమించింది. కావేరి జల వివాదాన్ని పరిష్కరించడంలో ట్రిబ్యునల్ విఫలమవడంతో కర్ణాటక-తమిళనాడు రాష్ర్టాలు సుప్రీంకోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. కోర్టు ఆదేశాలతో 15,000 క్యూసెక్కుల నీరు తమిళనాడుకు వదిలారు. రావి-బియాస్ నదుల వివాదం హర్యానా, హిమాచల్‌ప్రదేశ్ రాష్ర్టాల మధ్య చిచ్చురేపింది. ఈ వివాదం తారస్థాయికి చేరింది. కృష్ణా జలాలను పంపిణీ చేయడంలో ట్రిబ్యునళ్లు విఫలమవడంతో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య జల వివాదాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. నర్మదా నది వివాదం కారణంగా సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నర్మదా ప్రాజెక్ట్టు పూర్తవడానికి దాదాపు 30 ఏండ్లు పట్టింది. ఈ విధంగా దేశంలో అనేక వివాదాలు చెలరేగుతున్నా ట్రిబ్యునళ్ల తీరు మారడం లేదు. జల వివాదాలను పరిష్కరించాలనే ధ్యాసే లేకుండాపోయింది. అనుమతులు, ఇతర రాష్ర్టాల పేచీల కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ప్రాజెక్టులను నిర్మించేందుకు జంకుతున్నాయి. తత్ఫలితంగా దేశంలో నీటి లభ్యత ఉన్నా.. సాగు, తాగునీటి కోసం కష్టాలు తప్పడం లేదు.
మన దేశంలో ఏటా సగటు వర్షపాతం 900 సెంటీమీటర్లకు పైనే ఉంటుంది. రిజర్వాయర్లు, కాలువలు, ఎత్తిపోతల ప్రాజెక్టులు లేకపోవడంతో 70,000 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలిసిపోతున్నది. నీటి లభ్యత ఉన్నప్పటికీ, పక్కనే నదులు పారుతున్నా పొలాలకు నీటిని పారించుకోలేని దుస్థితిని మన తెలంగాణ అప్పట్లో ఎదుర్కొన్నది. నేడు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ర్టాలు తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. 2050 నాటికి భారత్‌లో తీవ్రమైన కరువు సంభవిస్తుందని యూఎన్డీపీ, డబ్ల్యూఆర్ఐ తదితర అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి.
కేంద్రీకృత వ్యవస్థ వల్ల రాష్ర్టాల స్వేచ్ఛను హరిస్తున్నాయని ట్రిబ్యునళ్లపై ఒక ఆరోపణ ఉన్నది. ఇది ప్రధానమైన సమస్య. రాష్ర్టాల మధ్య సఖ్యత కోసం ట్రిబ్యునళ్లు, కేంద్ర ప్రభుత్వాలు ఏనాడూ కృషి చేయలేదు. అధికారుల లోటు, రాజకీయ ఒత్తిడి కారణంగా జల వివాదాలు ఏటికేడు పెండింగ్ పడుతూనే ఉన్నాయి. సెంట్రల్ వాటర్ కమిషన్ నివేదికలను పరిగణనలోకి తీసుకోకపోవడం, నదీ జలాల బోర్డు సభ్యులతో సఖ్యత లేకపోవడం తదితర అంశాలు జల జగడాలను మరింత జటిలం చేస్తున్నాయి. ఈ విధంగా అనేక కారణాల వల్ల నీరు వృథాగా పోతున్నది. రాష్ర్టాలు సైతం ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. కుంటలు, చెరువులు, వాగులను పునరుద్ధరించి నీటి లభ్యతను పెంచేందుకు రాష్ర్టాలు కృషి చేయాలి. ఈ విషయంలో తెలంగాణ రాష్ర్టాన్ని, కేసీఆర్ విజన్‌ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. ఎత్తైన పీఠభూమిపై ఉన్న రాష్ర్టాలు తక్షణమే కాళేశ్వరం లాంటి భారీ ఎత్తిపోతల ప్రాజెక్టులను చేపట్టాలి. గంగా-కావేరి నదులను అనుసంధానం చేయాలి. నీటిపారుదల రంగంపై భారీగా మూలధన పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రతి ఇంటికి తాగునీరు అందించే బృహత్తర ప్రణాళికలను చేపట్టాలి. ఆయా రాష్ర్టాలు సఖ్యతతో నదీ జలాల మళ్లింపుపై దృష్టి సారించాలి. అందుకు పాలకులు, ప్రభుత్వాలు చొరవ చూపాలి. ఈ విధంగా చేసినట్లయితే జల జగడాలకు చోటు ఉండదు. ట్రిబ్యునళ్ల తీర్పులు ఆలస్యం అయినప్పటికీ రాష్ర్టాల మధ్య సఖ్యతతో సాగు, తాగునీరు అవసరాల కోసం నదీ జలాలను ఉపయోగించుకోవచ్చు.
అదే సమయంలో ట్రిబ్యునళ్ల వ్యవస్థలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. కేంద్రీకృత విధానాలను కాకుండా ఆయా వివాదాలు నెలకొన్న రాష్ర్టాల సభ్యులను నియమించాలి. పారదర్శకంగా నీటి కేటాయింపులు జరపాలి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మళ్లీ సుప్రీంకోర్టు మెట్లు ఎక్కాల్సిన అవసరం లేకుండా ట్రిబ్యునళ్లు వివాదాలను పరిష్కరించాలి. నదీ జలాల పంపకాల కోసం హెల్సింకి నియమాలను పాటించాల్సిన అవసరం ఉంది. నదీ జలాల వివాదాల చట్టాన్ని సైతం సవరణ చేయాలి. సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్తేనే దేశంలో జల జగడాలు పరిష్కారం అవుతాయి. తద్వారా తాగు, సాగునీటి కష్టాలు తీరుతాయి.
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sabitha Indrareddy | పాలన గాలికొదిలేసి తిరుగుతున్న రేవంత్ రెడ్డి.. మూసీ అంత అర్జెంట్ ఏముంది.. : మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
‘గర్భిణులకు ఇబ్బంది కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలి’
Mercedes hit-and-run: మెర్సిడీజ్ హిట్ అండ్ రన్ కేసు.. కొచ్చి పోలీసు కమీషనర్ బదిలీ
Ramayana | ‘రామాయణ’ చూసి ఆశ్చర్యపోయా.. ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’తో పోల్చిన హాలీవుడ్ విమర్శకుడు!
Avengers Dooms day | మార్వెల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. భారత్‌లో ఒక రోజు ముందుగానే ‘అవెంజర్స్: డూమ్స్‌డే’!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

