ఇటీవల ఉత్తరప్రదేశ్లో, ప్రస్తుతం మహారాష్ట్రలోని నాందేడ్, థానే వంటి పట్టణాల ప్రభుత్వ దవాఖానల్లో పదుల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడ్డారు. ఇది దేశంలో ప్రభుత్వ వైద్యరంగం ఎంత బలహీనంగా ఉన్నదో తెలియజేస్తున్నది. కరోనా కాలంలో కూడా దేశవ్యాప్తంగా ప్రభుత్వ వైద్యం నాసిరకంగా ఉందనే విషయం బహిర్గతమైనా, అటు కేంద్ర ప్రభుత్వం గానీ, ఇటు వివిధ రాష్ర్టాల ప్రభుత్వాలు కానీ వైద్యరంగానికి సరైన ప్రాధాన్యం ఇవ్వ లేదు. నిధులు, మౌలిక సదుపాయాలు, సరిపడా డాక్టర్లు, నర్సులు, మందులు సమకూర్చకపోవడంతో వందల సంఖ్యలో రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
ఏ దేశమైనా అభివృద్ధి సాధించాలంటే విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రపంచ దేశాలన్ని గుర్తించాయి. ఆ దిశలోనే ముందుకుసాగుతున్నాయి. కానీ, మన దేశంలో మాత్రం పాలకులు ఓట్లు దండుకునే పథకాలకే ప్రాధాన్యం ఇవ్వటం గమనార్హం. ప్రపంచంలో నెదర్లాండ్స్, బ్రిటన్, జర్మనీ వంటి దేశాల్లో ప్రభుత్వ వైద్యరంగం బలంగా ఉన్నది. హెల్త్ ఇన్స్యూరెన్స్ ద్వారా ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తున్నాయి. దీనికి తోడు, నార్డిక్ దేశాలు మానవాభివృద్ధి సూచికల్లో గత దశాబ్ద కాలంగా ముందు వరుసలో ఉండటానికి ప్రధాన కారణం విద్య వైద్య రంగాలకు ప్రాధాన్యం ఇవ్వడమే అని తేటతెల్లమైంది.
ఇటీవల తెలంగాణ రాష్ట్రం జిల్లాకో వైద్య కళాశాల, అర్బన్ క్లినిక్స్ వంటి సౌకర్యాలతో ముందుకుపోతున్నది. దీనికి విరుద్ధంగా కేంద్రం దేశంలో విద్య, వైద్యరంగాల్లో భారీ ఎత్తున కార్పొరేట్లను ప్రవేశపెట్టి ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తున్నది. దీంతో దేశంలో పేదలకు ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం, వసతులు, మందులు దొరక్క మృత్యువాత పడుతున్నారు. ఆయుష్మాన్ భవ వంటి పథకాలు అమలు చేస్తున్నా, పేదలకు, బడుగు బలహీన, గిరిజనులకు వై ద్యం అందుబాటులో లేక, వ్యాధులు సోకినప్పుడు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.
నేటికీ అనేక గిరిజన ప్రాంతాల్లో, మారుమూల గ్రామాల్లో సరైన రహదారులు, ప్రయాణ సౌకర్యాలు లేకపోవడంతో డోలీల్లో రోగులను, గర్భిణీ స్త్రీలను మోసుకు పోతున్న సంఘటనలు చూస్తున్నాం. కొన్ని సమయాల్లో మధ్యలోనే ప్రసవాలు జరగటం, ప్రాణాలు పోవడం సర్వసాధారణమైపోయింది.
75 ఏండ్ల స్వతంత్ర భారత్లో మనం సాధించిన ప్రగతిని ఒకసారి విశ్లేషణ చేసుకోవాలి. దేశ ప్రజలకు అవసరమైన విద్య, వైద్యం, తిండి, గుడ్డ, గూడు సమకూర్చడం లో పాలకులు సాధించిన ప్రగతిని ప్రజల ముందుంచాలి. లోపాలు సరిచేసుకుంటూ ముందుకు సాగాలి… అంతేగానీ, ఎన్నికల ముందు ధరలు తగ్గించడం, కొత్త కొత్త పథకాలు ప్రకటించి ప్రజలను మోసం చేయటం మానుకోవాలి. కార్పొరేట్ వ్యక్తులకు ప్రోత్సాహం పేరుతో భారీ ఎత్తున రాయితీలు ఇవ్వడం మానుకోవాలి.
ప్రస్తుతం దేశంలో ప్రజలకు సరిపడా వైద్యులు, నర్సులు, దవాఖానలు, మందులున్నాయా? ఇంకా ఎంతఅవసరం బేరీజు వేసుకుని భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలు సిద్ధం చేసుకుని, ప్రజల ప్రాణాలను కాపాడాలి. వైద్య కళాశాలల సంఖ్య పెంచాలి. తక్కువ ఖర్చుతో కూడిన మందుల ఉత్పత్తి చేపట్టాలి. ముఖ్యంగా మౌలిక సదుపాయాలు కల్పించాలి.
పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వా లి. కాలుష్య నియంత్రణ చేపట్టాలి. స్వచ్ఛభారత్ కార్యక్రమాలు మొక్కుబడిగా చేపట్టరాదు. వైద్య సిబ్బందికి తగు శిక్షణ, ఆధునిక సౌకర్యాలు సమకూర్చాలి. ముఖ్యంగా మానవ వనరుల అభివృద్ధికి అధిక ప్రాధా న్యం ఇవ్వాలి. పారా మెడికల్ సిబ్బంది, ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికుల నియామకాలు భారీ ఎత్తున చేపట్టాలి. ముఖ్యం గా అన్ని కేటగిరీల ఉద్యోగ, కార్మికులకు నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేయాలి. సీజనల్ వ్యాధులపై ముందుగా అవగాహన, చైతన్యం కలిగించాలి. ఈగలు, దోమల నియంత్రణకు చర్యలు చేపట్టాలి. మురుగు కాల్వలు తరచూ శుభ్రం చేయాలి. డ్రైనేజీ నీరు, వర్షపు నీరు నిల్వ లేకుండా చూడాలి. ప్రజలు కూడా తమ తమ పరిసరాల్లో, పనిచేసే ప్రాంతాల్లో పరిశుభ్రతకు అందరూ కలిసి కృషిచేయాలి.
ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య రంగంలో ప్రైవేటీకరణకు స్వస్తి పలకాలి. బడ్జెట్లో నిధులు ఎక్కువగా కేటాయించి, ఖర్చుచేయాలి. వైద్య పరిశోధనకు, రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్కు బడ్జెట్లో నిధులు పెంచాలి. ఫార్మా స్యూటికల్ కంపెనీలకు అవసరమైన ముడి సరుకు ఇక్కడే తయారు చేసుకునే విధానాలు రూపొందించుకోవాలి. ప్రజలందరికీ ఆరోగ్యం గురించి అవగాహన కల్పించాలి. దేశంలో చాలామంది ప్రజలు తమ తమ ఆదాయంలో ఎక్కువ భాగం వైద్యం కోసం ఖర్చుచేయ డం వల్ల వారి వారి ఆర్థిక పరిస్థితి క్షీణించి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. దేశం వెనుకబడి పోతున్నది. ఆరోగ్య భారత్ ద్వారానే భారత్ సుస్థిరాభివృద్ధి సాధిస్తుందని ఇకనైనా పాలకులు గుర్తించి, తగిన రీతిలో భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించి, అమలు చేయాలని కోరుకుందాం.
– రావుశ్రీ 63056 82733