భారతదేశంలో ప్రతి పేద, మధ్యతరగతి ప్రజలు లింగ భేదం లేకుండా తమ పాదాలను అన్ని కాలాల్లో రక్షించుకునేందుకు చెప్పులు ధరిస్తారు. పసిఫిక్ మహాసముద్రంలోని అగ్ని పర్వత ద్వీపాల మధ్యలో ‘హవాయిద్వీపం’ ఉన్నది. ఈ ద్వీపంలోని ఒక ప్రత్యేక రబ్బర్‌తో షీట్లు తయారు చేస్తారు. దీంతో చెప్పులను తయారు చేయడంతో హవాయి చెప్పులుగా ప్రసిద్ధి చెందాయి. అలాంటి చెప్పుల పరిశ్రమలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల మూసివేతకు చేరువవుతున్నాయి.
‘ఎల్మార్ స్కాట్’అనే వ్యక్తి అక్కడి తోటల్లో పని చేసే కార్మికుల కోసం రబ్బర్ బూట్లు తయారు చేసేవాడు. రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా బూట్ల తయారీకి ఉపయోగించే ముడి పదార్థం దొరకకపోవడంతో బూట్లకు బదులు చెప్పులు తయారు చేశాడు. అతని మరణానంతరం అతని కుమారుడు స్టీవ్స్కాట్ స్థాపించిన ‘హవాయి’ రబ్బర్ చెప్పుల పరిశ్రమ ఎంతో పేరు గాంచింది. 1931లో మనదేశంలో పశ్చిమబెంగాల్లో స్థాపించిన బాటా కంపెనీ ఈ స్లిప్పర్స్ ను ప్రవేశపెట్టింది. కానీ నేడు కేంద్ర ప్రభుత్వం హవాయి చెప్పులపై 5శాతం ఉన్న జీఎస్టీని 12 శాతానికి పెంచింది. దీంతో ఒక్క పంజాబ్‌లోని జలంధర్ నగరంలోనే 325 హవాయి చెప్పుల పరిశ్రమలు మూత పడ్డాయి.
కేంద్ర ప్రభుత్వం విధించే పన్నుల వల్ల ఇటు ఉత్పత్తిదారులు, అటు వినియోగ దారులు ఇబ్బందులు పడుతున్నారు. పెరిగిన ధరల కారణంగా చెప్పులు కూడా ధరించలేని పరిస్థితికి చేరుకుంటున్నారు. ఇప్పటికైనా సామాన్య పేద, మధ్య తరగతి ప్రజలు వినియోగించే నిత్యావసర వస్తువులపై జీఎస్టీని రద్దు చేసి ప్రజలను ఆదుకోవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే.