సహకార బ్యాంకులను ప్రైవేటీకరించడంలో భాగంగా కేంద్రం 2020, సెప్టెంబర్‌లో ‘బ్యాంకింగ్ రెగ్యులేషన్ (అమెండ్మెంట్) చట్టం-2020’ను తీసుకువచ్చింది. ఈ చట్టం అమలు ద్వారా ఆయా బ్యాంకుల్లో సభ్యులైన 18 కోట్ల మంది రైతులు, బలహీనవర్గాలు తమ సొంత బ్యాంకులైన 33 రాష్ట్ర సహకార బ్యాంకులు, 351 జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, రూ.లక్షల కోట్ల స్థిర ఆస్తులను కోల్పోనున్నారు. అంతేకాదు, 75 ఏండ్లుగా రైతులు కడుపు కట్టుకొని నిర్మించుకున్న సహకార బ్యాంకులకు ప్రైవేటు వ్యక్తులు యజమానులు కాబోతున్నారు.
సహకార బ్యాంకులను ప్రైవేటుపరం చేస్తే వీటిని ప్రైవేటు వ్యక్తులు రూ.10 లేదా రూ.100తో వాటాలు కొంటారు. (ప్రైవేట్ కంపెనీలో 75 ఏండ్ల కింద ఒక్క వాటా రూ.10 ఉండగా, నేడు అది లక్ష దాటింది. కానీ సహకార సంస్థలో ఆ రోజు వాటా విలువ రూ.10 ఉంటే నేడు కూడా 10 రూపాయలే ఉన్నది.) ‘బ్యాంకింగ్ రెగ్యులేషన్ (అమేండ్మెంట్) చట్టం-2020’ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు నిరసనలు తెలిపాయి. సహకార సంస్థ లు, నాయకులు బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానాలు చేసి ఉద్యమించడానికి ఉపక్రమిస్తున్న సమయం లో కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్‌ను రంగంలోకి దింపి సహకార నాయకులను బెదిరించింది. వారిని భయపెట్టి మౌనంగా ఉండేలా చేసింది. ఈ విషయమై ఎన్సీపీ నాయకుడు శరద్‌పవార్, ప్రధాని మోదీని కలసి వినతిపత్రం కూడా అందజేశారు.
సహకార రంగం రాష్ట్ర పరిధిలోని అంశం. ఆర్టికల్-43 ప్రకారం.. సహకార విధానాన్ని గ్రామీణ వ్యవస్థలో అమలుచేయడం ప్రభుత్వాల బాధ్యత. రాజ్యాంగ పీఠిక, ఆర్టికల్-39 (సీ) లక్ష్యాల సాధనకు రూపాంతర వ్యవస్థనే సహకార విధానం. సంక్షేమ రాజ్యస్థాపన రాజ్యాంగ ధ్యేయంగా ఉన్నది. భారతదేశ ఆర్థికవ్యవస్థ మిశ్రమ ఆర్థిక విధానం. అంటే ప్రైవేట్, ప్రభుత్వ, సహకార రంగాల కలయిక. దేశ ఆర్థిక రంగ అభివృద్ధికి నీతి ఆయోగ్‌ల మార్గదర్శనం చేస్తున్నది. సహకార వ్యవస్థ రైతాంగ వ్యవసాయ అవసరాలకు 3 శాతం (1947) నుంచి 67 శాతం (1987) వరకు రుణాలిచ్చే స్థాయికి ఎదిగింది. తద్వారా భారత ఆర్థిక వ్యవస్థలో సహకార రంగం ప్రధాన భాగస్వామి అయింది.
వ్యాపార అభివృద్ధికి మూలం బ్యాంకింగ్ రంగం. సహకార వ్యవస్థ అభివృద్ధికి మూలం సహకార బ్యాంకింగ్ రంగం. ఇటువంటి ప్రధాన భూమిక నిర్వహించే సహకార బ్యాంకింగ్‌ను ప్రైవేటు రంగానికి అప్పజెప్తూ కేంద్రం చట్టం తీసుకురావడం విడ్డూరం. ఈ చట్టం రాజ్యాంగాన్ని అతిక్రమించడమే. రాష్ట్ర, పట్టణ సహకార బ్యాంకులు రాష్ట్ర సహకార చట్టం పరిధిలోకి వస్తాయి. రాష్ట్ర సహకార సంఘాలు రిజిస్ట్రార్ పర్యవేక్షణలో ఉన్నాయి. మరోపక్క సహకార సంస్థలు ప్రభుత్వ సంస్థలను నిర్వచించే ఆర్టికల్ 12 పరిధిలోకి రావని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంటే సహకార సంస్థలు ప్రభుత్వ సంస్థలు కావు. ప్రైవేట్ వ్యాపార సంస్థల్లాగే సహకార సంస్థలు ప్రత్యేక వ్యాపార సంస్థలు. అందువల్ల సహకార బ్యాంకుల్లో ప్రైవేట్ రంగాన్ని చేర్చుకొమ్మని చట్టం చేయడం రాజ్యాంగ విరుద్ధం. దీనివల్ల బలహీన వర్గాలు తాము నచ్చిన వ్యాపారం చేసుకొనే హక్కు ఆర్టికల్-19 (1) (జీ)ని కోల్పోనున్నాయి.
ఈ చట్టం అమలు వల్ల 75 ఏండ్లుగా రైతులు, గ్రామీణ చేతివృత్తుల వారు, బలహీన వర్గాలు, వ్యవసాయ కూలీలు మొదలైన 19 రకాల సహకార సంఘాలు నిర్మించుకున్న సహకార బ్యాంకింగ్ సౌధం కూలబోతున్నది. సహకారరంగాన్ని ప్రైవేటుకు అప్పజెప్పడమంటే ప్రజల ఆస్తులను ఆధునిక వడ్డీ వ్యాపారుల కు అప్పజెప్పడమే. వారి గడపలోకి బలవంతంగా నెట్టడమే. రైతులు, బలహీనవర్గాలు సమిష్టిగా సహకార సంఘాల సమాఖ్య ద్వారా సహకార బ్యాం కింగ్ వ్యా పారం నిర్వహించుకోలేరు. తమ రుణ అవసరాలను ప్రైవేట్ బ్యాంకుల ద్వారానే తీర్చుకోవాల్సి ఉం టుంది. అంటే కేంద్రం భారత గ్రామీణ వ్యవస్థను పూర్వపు వడ్డీ వ్యాపారుల గడపలోకి నెట్టబోతున్నది. ఇది తిరోగమన చర్య. ఈ కీలక సమయంలో భారత రాజకీయ వ్యవస్థ మౌనం వహించడం చారిత్రక తప్పిదం. సహకార వ్యవస్థ చిన్నాభిన్నం కాకముందే అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది.
ఈ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి సహకార ధర్మపీఠం ఆర్థికవేత్తలతో సమావేశం నిర్వహించింది. చట్టం ఉపసంహరించుకోవాలని ఉస్మానియా డిక్లరేషన్ ద్వారా కేంద్రాన్ని డిమాండ్ చేసింది. సహకార్ ధర్మ్ భారత్‌యాత్ర, ధర్మదీక్షలు, వినతి పత్రాల ద్వారా అన్ని రాజకీయ పార్టీలకు నివేదించింది. తద్వారా సహకారబ్యాంకుల ప్రైవేటీకరణను సహకార ధర్మపీఠం తాత్కాలికంగా ఆపగలిగింది. అయితే చట్టాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలంటే ప్రజా చైతన్యం ఒక్కటే మార్గం.
(వ్యాసకర్త: ధర్మకర్త, సహకార ధర్మపీఠం)
ప్రభుత్వ సంస్థలను నిర్వచించే ఆర్టికల్ 12 పరిధిలోకి సహకార సంస్థలు రావని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంటే సహకార సంస్థలు ప్రభుత్వ సంస్థలు కావు. ప్రైవేట్ వ్యాపార సంస్థల్లాగే సహకార సంస్థలు ప్రత్యేక వ్యాపార సంస్థలు. అందువల్ల సహకార బ్యాంకుల్లో ప్రైవేట్ రంగాన్ని చేర్చుకొమ్మని చట్టం చేయడం రాజ్యాంగ విరుద్ధం. దీనివల్ల బలహీన వర్గాలు తాము నచ్చిన వ్యాపారం చేసుకొనే హక్కు ఆర్టికల్-19 (1) (జీ)ని కోల్పోనున్నాయి.
సంభారపు భూమయ్య: 9999999