ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్ వ్యవస్థలో సెల్ఫోన్ల ఆగమనం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. దీనికి మన దేశమేమీ మినహాయింపు కాదు. సెల్ఫోన్లు అనేక ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ, బాల్యంపై పడుతున్న వాటి ప్రభావం ఆందోళన కలిగిస్తున్నది.
ఫోన్లకు సంబంధించిన అతిపెద్ద మార్కెట్లలో మన దేశం కూడా ఒకటి. నానాటికి పెరుగుతున్న యువ జనాభా అందుకు కారణం. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ప్రకారం.. దేశంలో 2023 నాటికి 100 కోట్లకు పైగా ఫోన్ వినియోగదారులు ఉన్నారు. వీరిలో అత్యధికులు యువకులే. ఇంటర్నెట్, మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) 2022లో నిర్వహించిన సర్వే ప్రకారం.. దేశంలోని ఇంటర్నెట్ వినియోగదారుల్లో 40 శాతం మంది 12-29 ఏండ్ల మధ్య వయసున్నవారే. ఇది పిల్లలు, యుక్తవయస్కులలో మొబైల్ ఫోన్ల వాడకాన్ని నొక్కి చెప్తున్నది. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్సీపీసీఆర్) 2023 నాటి సర్వే ప్రకారం.. పద్దెనిమిది ఏండ్ల కంటే తక్కువ వయసున్న పాఠశాల పిల్లల్లో 42.9 శాతం మంది సోషల్ మీడియా ఖాతాలను కలిగి ఉన్నారు. 79 శాతం మంది రోజులో కనీసం రెండు గంటలు ఫోన్లలో గడుపుతున్నారు. అంతేకాదు, 62.6 శాతం మంది తమ తల్లిదండ్రుల ఫోన్లను ఉపయోగిస్తుండగా.. 30.2 శాతం మంది ఇంటర్నెట్ ఆధారిత సొంత ఫోన్లను ఉపయోగిస్తున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్‌చాట్ వంటి మాధ్యమాల్లో చాటింగ్ చేయడానికి 52.9 శాతం మంది పిల్లలు స్మార్ట్‌ఫోన్ ఫీచర్లను ఉపయోగిస్తున్నారని సర్వేలో తేలింది.
సెల్ఫోన్ల వినియోగం అనేది ముఖ్యంగా విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వివిధ అప్లికేషన్లు విద్యా వనరులను అందుబాటులోకి తీసుకొచ్చాయి. అలాగే పట్టణ, గ్రామీణ విద్య మధ్య అంతరాన్ని తగ్గించాయి. మరీ ముఖ్యంగా కొవిడ్ సమయంలో అన్ని పాఠశాలలు, శిక్షణ కేంద్రాలు ఆన్లైన్ భోధనకు మారినందున ప్రతిఒక్కరికి ఫోన్ అనివార్యమైంది. 2021లో యూనిసెఫ్ జరిపిన ఒక అధ్యయనం ప్రకారం.. దేశంలోని 67 శాతం మంది పిల్లలు లాక్డౌన్ సమయంలో రిమోట్ లెర్నింగ్ కోసం మొబైల్ పరికరాలను ఉపయోగించారు.
విద్యాపరమైన ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఫోన్‌ను అదేపనిగా వాడటం వల్ల పిల్లల్లో అనేక మానసిక సమస్యలు వస్తున్నాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ 2020లో నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. సోషల్ మీడియా, గేమింగ్ యాప్‌లకు వ్యసనపరులు కావడమే ఈ మానసిక సమస్యలకు కారణం. కంటి అలసట, నిద్రలేమి లాంటి సమస్యలు సర్వసాధారణంగా మారాయి. శారీరక, మానసిక దుష్ప్రభావాలతో పాటు సామాజిక అభివృద్ధిని కూడా ఫోన్లు ప్రభావితం చేస్తున్నాయి. ఒంటరితనానికి అలవాటు పడి సామాజిక నైపుణ్యాలను కోల్పోతుండటం ఆందోళనకరం. ఈ తరహా మార్పులు భావితరాల అభివృద్ధికి నిరోదకంగా మారే ప్రమాదం లేకపోలేదు.
తల్లిదండ్రులు కూడా దీని గురించి ఆందోళన చెందుతున్నారు. కొంతమంది తల్లిదండ్రులు సమయపాలనకు సంబంధించి కొన్ని నిబంధనలు విధిస్తున్నప్పటికీ, వాటిని అమలు చేయడం సవాలుగా మారుతున్నది. చాలామంది ఆన్లైన్లో అభ్యసనం మాటున అశ్లీలం వీక్షించి, బంగారు భవితకు ఆదిలోనే సమాధి చేసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది.
ఈ వ్యసనానికి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులతో పాటు సమాజంపై ఉన్నది. అందుకు పెద్దల పర్యవేక్షణలో రోజూ 2 గంటలకు మించి ఫోన్లు వాడకుండా చూడాలి. దాంతో పాటు పిల్లలు ఆటలో నిమగ్నమయ్యేలా చేయడం ద్వారా వారిని యాంత్రిక జీవన విధానం నుంచి బయటకు తీసుకురావచ్చు. ఆటల ద్వారా వారిలో మానసికోల్లాసాన్ని కలిగించవచ్చు.
సవాల్‌గా మారుతున్న ఈ సమస్యను పరిష్కరించడానికి తల్లిదండ్రులు, విద్యావేత్తలు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, విధాన రూపకర్తలతో కూడిన బహుముఖ విధానం అవసరం. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమతుల్యంగా, బాధ్యతాయుతంగా ఉపయోగించడాన్ని ప్రోత్సహించడం ద్వారా పిల్లల అభ్యున్నతిపై ప్రతికూల ప్రభావాలను తగ్గించవచ్చు. డిజిటల్ యుగంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడటంతో పాటు యువ జనాభా ఆరోగ్యం, శ్రేయస్సు, సమగ్రాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం కుడా తప్పనిసరి.
– డాక్టర్ కొల్లు శ్రీనివాస్
80089 44045