భారత్- పాకిస్థాన్ మధ్య ఇటీవల జరిగిన పరిణామాలు యావత్ ప్రపంచం మన వైపు చూసేలా చేశాయి. ఆపరేషన్ సిందూర్ వల్ల భారత ఆర్మీ పరాక్రమాన్ని, మన ఆయుధ సంపత్తిని చూసి ప్రపంచం ఆశ్చర్యపోయింది. అదే సమయంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) రూ.8,400 కోట్ల నిధులు ఇవ్వడం విస్మయానికి గురిచేసింది.
ఐఎంఎఫ్ విధానాలు కొన్ని దేశాల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నాయి. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఐఎంఎఫ్ విధిస్తున్న ఆర్థిక కట్టుబాట్లు ప్రజల జీవన ప్రమాణాలను దెబ్బతీసేలా ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. పశ్చిమ దేశాల ఐడియాలజీతో ఐఎంఎఫ్ పని చేస్తున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. ఋణ భారంతో బాధపడుతున్న దేశాలకు ఖర్చులు తగ్గించే దిశగానే ఐఎంఎఫ్ సలహాలు ఉంటాయి. దీని వల్ల సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వాలు తగ్గించాల్సి వస్తున్నది. ఇది ప్రజల జీవన ప్రమాణాలపై ప్రభావం చూపుతున్నది. శ్రీలంక, అర్జెంటీనా వంటి దేశాల్లో ఇది స్పష్టంగా కనిపించింది.
కొన్ని దేశాలకు ఆర్థిక సంస్థలు ఇస్తున్న రుణాల్లో సింహభాగం ఉగ్రవాద సంస్థలకు వెళ్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) అనే సంస్థ గతంలో హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాద చర్యలను కట్టడి చేయాలని ప్రపంచ దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తుంటే ఐఎంఎఫ్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌కు తాజాగా భారీగా నిధులు సమకూర్చడం ఆ సంస్థ ద్వంద్వ వైఖరికి నిదర్శనం. ప్రపంచీకరణ తర్వాత బ్రెజిల్, భారత్, జర్మనీ, జపాన్, చైనా లాంటి దేశాలు అమెరికాతో ఆర్థికంగా పోటీ పడుతున్నాయి. ఈ తరుణంలో ఐఎంఎఫ్ రుణాలపై ఎవరూ ఆధారపడటం లేదు. కొన్ని మిత్ర దేశాలు కలిసి ఐఎంఎఫ్‌కు పోటీగా ఆర్థిక సంస్థలను నెలకొల్పుతున్నాయి. బ్రిక్స్ బ్యాంకు ఆసియాలోని దేశాలతో పాటు ఇతర దేశాలకు రుణాలు ఇస్తున్నది. ఐఎంఎఫ్ లాంటి సంస్థలకు దీటుగా ఏఐఐబీ, బ్రిక్స్ బ్యాంకులు పనిచేస్తున్నాయి.
ఐఎంఎఫ్ తాజా చర్యల నేపథ్యంలో భారతదేశం తన అంతర్జాతీయ విధానాలను మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అమెరికా ద్వంద్వ వైఖరి, చైనా దూకుడు, పాక్ ఉగ్రవాద ప్రోత్సాహం నేపథ్యంలో భారత్ ఆర్థికంగా పుంజుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇందులో భాగంగా దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలి. తద్వారా అమెరికాపై ఆధారపడాల్సిన ఆవశ్యకత తగ్గుతుంది. అదే సమయంలో పశ్చిమ దేశాల విషయంలో తటస్థ వైఖరిని పాటించాలి. ఆర్థిక నిపుణుల సూచనల మేరకు విదేశాంగ విధానాన్ని మనకు లాభం చేకూర్చే విధంగా రూపొందించుకోవాలి.