‘కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మోసపోయాం. హస్తం పాలనలో గోస పడుతున్నాం’ అనే మాట తెలంగాణలోని ప్రతిఒక్కరి నోట వినిపిస్తున్నది. అనతికాలంలోనే ‘కేసీఆర్ సర్కారే ఉండుంటే మాకు ఈ కష్టాలు ఉండకపోవు’ అనే చర్చ కూడా ప్రజల్లో మొదలైంది.
Telangana | ఆరు గ్యారెంటీలను అమలు చేయలేక సతమతమవుతున్న రేవంత్‌రెడ్డి సర్కార్ ఆ నెపాన్ని కేసీఆర్‌పై నెట్టాలని చూస్తున్నది. అందుకే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. కేసీఆర్ సర్కార్‌పై లేనిపోని ఆరోపణలు చేస్తూ.. ఆయన గుర్తులను చెరిపేస్తాననే పాటందుకున్నారు. అయితే కాంగ్రెస్ పాలకులకు తెలియనిదేమిటంటే.. తెలంగాణ నుంచి కేసీఆర్‌ను వేరు చేయడం ఎవరి తరం కాదనే విషయం. కేసీఆర్‌ను, తెలంగాణను వేరు చేసి చూడలేం. పద్నాలుగేండ్ల పాటు ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్ ప్రజలతో అంతగా మమేకమయ్యారు. ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకున్నారు. తెలంగాణలో ఆయన నడవని నేల లేదు. తొక్కని గడప లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే.. తెలంగాణ అణువణువు ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు.
ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ అవతరించాక కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యమిచ్చింది. అందుకే తొమ్మిదేండ్ల స్వల్ప వ్యవధిలోనే మన రాష్ట్రం అనేక రంగాల్లో ప్రగతి సాధించింది. తెలంగాణను వివిధ రంగాల్లో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలపడమే కాకుండా, అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన కేసీఆర్ గుర్తులు చెరిపితే చెరిగేవి కావు. అధికారం కోల్పోయినంత మాత్రాన.. ప్రజల గుండెల్లో ఆయన వేసిన ముద్ర చెరిగిపోదు. తెలంగాణ ప్రజలను కంటికి రెప్పలా కాపాడిన నేతపై అభాండాలు వేయడం తగదు. ఏ గుర్తులను చెరుపుతారు? పాలమూరు వలసలకు అడ్డుకట్ట వేశారనే వాస్తవాన్నా? నల్లగొండ ఫ్లోరోసిస్‌ను తరిమికొట్టారనే నిజాన్నా?
కేసీఆర్‌పై నిందలేస్తూ కాలయాపన చేయడం మాని.. నీళ్లులేక ఎండిపోతున్న పొలాలపై పాలకులు ధ్యాస పెట్టాలి. 420 హామీలపై దృష్టి సారించాలి. పొద్దస్తమానం కేసీఆర్‌పై పడి ఏడ్వటాన్ని మేధావులు, బుద్ధిజీవులు గమనిస్తున్నారు. పంటలు ఎండిపోయి కడుపు మండుతున్న రైతులు కాంగ్రెస్‌పై ఆగ్రహంతో ఉన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అన్నదాతల ఆగ్రహజ్వాలల సెగ హస్తం పార్టీకి తగలడం ఖాయం.