ప్రవేశించడం నిష్క్రమించడమెపుడో
వాహనమేది వాడాలో ట్రాఫిక్కు రద్దీలెక్కడో
అపాయ హెచ్చరికలు, ఉపాయ ప్రవచనాలు
గమనించో గమనించకో, శిక్షణ పొందో పొందకో!
జీవిత వలయపు పద్మవ్యూహంలోకి చొచ్చుకొస్తూ
అనుకోని మలుపుల ఆటుపోట్లనెదుర్కొంటూ
ప్రమాదాల గోతులను భద్రంగా దాటేసుకుంటూ
అనుక్షణం అప్రమత్తతతో జీవితపు రేసులో!
సాటి బండొకటి ప్రమాదానికి గురైతే కుదేలై
అరక్షణం నిట్టూర్చి మరుక్షణం ప్రయాణం
మముబ్రోవమని భగవంతుని స్తోత్రం జేస్తూ
సమస్యల రద్దీ ఛేదనలో బతుకు రాస్తాలో!
ఒత్తిడుల ఘీంకార శబ్దాలు భరించలేక
ఆశల గమ్యానికి బండిలో ఇంధనం సరిపోక
దారిన విశ్రాంతికి బడాయిల కాలుష్యం పీల్చలేక
దారి దిగేద్దామంటే బయటకు దారెక్కడో తోచక!
ఎత్తుకున్న అంతులేని బాధ్యతలకు బద్ధుడై
సీటుకు స్టీరింగుకు మధ్య జీవితాన్ని బంధించుకొని
ఆశల వలయంలో నిట్టూరుస్తూ తెలియని గమ్యం వైపు
బతుకుబండిని లాగిస్తూ సగటు మనిషి!
రవికిశోర్ పెంట్రాల:లాంగ్లీ, లండన్