ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధి లాంటి అధికార యంత్రాంగానికి శిఖరాయమానమైన ఐఏఎస్ వ్యవస్థ ప్రస్తుతం వివాదాల్లో నలుగుతున్నది. ఓ కుర్ర ఐఏఎస్ నిర్వాకం ఇందుకు కారణం. పుణేలో ట్రైనీ ఐఏఎస్‌గా నియమితురాలైన పూజా ఖేడ్కర్ తనకు కావాల్సిన సౌకర్యాల గురించి హంగామా చేయడం, పూర్తిగా పదవిలోకి రాకముందే అధికార దుర్వినియోగానికి పాల్పడటం వార్తలకెక్కింది. అప్పుడే అడుగులు వేయడం నేర్చుకుంటున్న అధికారికే ఇంత డాబూదర్పం ఉంటే సీనియర్ల వైభవం ఎలా ఉంటుందోననే దిశగా ఆలోచనలు మళ్లాయి. ఈ లోగా ఓ సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద తీగ లాగితే డొంకంతా కదిలింది.
సదరు ట్రైనీ ఐఏఎస్ దివ్యాంగుల కోటాను ఉపయోగించుకున్నట్టు వెల్లడైంది. కానీ, ఆమె వైకల్యం బూటకమని తేలింది. అంతేకాకుండా ఓబీసీ కోటా కూడా ఉపయోగించుకున్నదనీ, అందుకు క్రీమీలేయర్ నిబంధన కింద కుటుంబ ఆదాయం చాలా తక్కువగా చూపిందనే సంగతీ వెలుగులోకి వచ్చింది. నిజానికి ఆమె కుటుంబానికి కోట్లలో ఆస్తులున్నాయి. తండ్రి మాజీ ఐఏఎస్ అధికారి. తన వైకల్యానికి సంబంధించి పూజ నకిలీ సర్టిఫికెట్లు సమర్పించిందనే సంగతి కూడా వెలుగులోకి వచ్చింది. పూజ వ్యవహారం బయటకు వచ్చింది కనుక మాట్లాడుకుంటున్నాం కానీ, బయటకు రానివి ఎన్ని ఉంటాయో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐఏఎస్ ఆశావహుల్లో ఈ వ్యవహారం తీవ్ర అసంతృప్తిని రాజేసింది.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఆధ్వర్యంలో జరిగే ఐఏఎస్ ఎంపిక పరీక్ష అనేది చాలా గుట్టుగా ఉంటుందని, అభ్యర్థి నేపథ్యాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తారని జనం చెప్పుకొంటారు. అలాంటప్పుడు తప్పుడు సమాచారం ఇచ్చి, నకిలీ సర్టిఫికెట్లు పెట్టి ఐఏఎస్ కావడం ఎలా సాధ్యమైంది? ఉన్నతస్థాయి అధికారుల ఎంపికలో ఈ తరహా లొసుగులు ఎలా చొరబడ్డాయి? వ్యవస్థలోని కుళ్లు బజారుకెక్కిన తర్వాత యూపీఎస్సీ ఆలస్యంగా మేలుకుని పూజపై వేటు వేయడమే కాకుండా ఆమెపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయించింది. ఈ నేపథ్యంలో యూపీఎస్సీ చైర్మన్ మరో ఐదేండ్ల పదవీకాలం ఉండగానే అర్ధాంతరంగా రాజీనామా చేసి వెళ్లిపోవడం ఎవరికీ ఆశ్చర్యాన్ని కలిగించలేదు. ఈ కేసులో తదుపరి ఏం జరుగుతుందనేది అప్రస్తుతం. పూజ వివాదం ఫలితంగా ఐఏఎస్ అనే హోదాకుండే గౌరవం మసకబారింది.
‘ఎంతో గొప్పగా ఊహించుకునే ఐఏఎస్ ఎంపిక విధానం ఇంతగా దిగజారిపోయిందా?’ అని దేశ ప్రజలు విస్తుపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదంతా గమనిస్తే యూపీఎస్సీ ఎంపిక విధానం లోపభూయిష్టంగా, అవినీతిమయంగా మారిందనే భావనలు సహజంగానే పొడసూపాయి. దేశ పరిపాలనా వ్యవస్థకు గుండెకాయ లాంటి ఐఏఎస్ విషయంలో ఇది ఏ మాత్రం క్షమార్హం కాదు. పూజ లాంటివాళ్లు అక్రమంగా ఐఏఎస్‌లోకి దూరేందుకు సహాయపడిన లొసుగులను తక్షణమే సవరించాలి. పూజతో పాటు ఆమెకు సాయపడినవారిపైనా చర్యలు తీసుకోవాలి. ఆమూలాగ్రం కుళ్లి కంపు కొడుతున్న వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయడం ఒక్కటే మార్గం. అన్ని స్థాయుల్లో పారదర్శకత, జవాబుదారీతనాన్ని ప్రవేశపెట్టడం ద్వారానే అది సాధ్యమవుతుంది.