రేవంత్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘హైడ్రా’ జూలై 19 నాటికి ఏడాది కాలం పూర్తి చేసుకున్నది. తొలి వార్షికోత్సవం సందర్భంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మీడియాతో మాట్లాడారు. తాము సాధించిన ఘనతలను వివరించారు. ఈ వివరాల్లోకి పోయేముందు హైడ్రా ఆరంభశూరత్వం గురించి చెప్పుకోవాలి.
హైడ్రా పుట్టుక వెనుక ప్రభుత్వ రాజకీయ కుతంత్రం ఉన్నది. విపక్ష పార్టీకి చెందిన ఒకరి వ్యవసాయ క్షేత్రాన్ని ధ్వంసం చేయాలనే లక్ష్యంతో ఇది ఆవిర్భవించింది. వస్తూనే ఆ ఫామ్‌హౌజ్‌పై పడితే అభాసుపాలవుతామని తొలి అడుగుగా ఓ నటుడి ఫంక్షన్ హాల్‌ను నేలమట్టం చేసింది. దాంతో నగరంలోని కబ్జా భూములన్నీ ప్రభుత్వ స్వాధీనంలోకి వస్తాయని ప్రజలు ఆశించారు. మొదట్లో హైడ్రా తమ దాడుల నుంచి ఎవరికీ న్యాయసహాయం దొరికే అవకాశం లేకుండా కోర్టుకు వారాంతపు సెలవులైన శని, ఆదివారాల్లో కూల్చివేతలు చేపట్టేది. తెల్లవారకముందే బుల్డోజర్లను దింపేది. ఎంత పెద్దవారినైనా వదిలేది లేదంటూ ఎన్నో భవనాలకు మార్కింగ్ చేసి, ఆ ఇంటి గోడలకు నోటీసులు అతికించింది.
కానీ, చివరకు పైసా పైసా కూడబెట్టుకొని అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు కొనుక్కున్నవారిపై తమ ప్రతాపం చూపింది. చెరువు, నాలా పక్కన ఇండ్లు కట్టుకొని ఎన్నో ఏండ్లుగా బతుకుతున్నవారిని రోడ్డున పడేసింది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం, కోర్టు వరుస మొట్టికాయలు వేయడంతో రోజుకో కొత్త నియమావళిని ప్రకటించింది. చివరికి 2024 సెప్టెంబర్‌లో ఒక కీలక ప్రకటన విడుదలైంది. హైడ్రా ఏర్పాటుకు ముందు అనుమతులతో నిర్మించిన ఇండ్లను తాకేది లేదని ప్రకటించింది. అంటే ఆపరేషన్ చేశాక డాక్టర్ కోర్సు చదివినట్టుగా ఈ కొత్త నియమాలు వచ్చాయి. ఆఖరికి అనుమతులు లేకున్నా నివాసముంటున్న ఇండ్లను కూల్చివేయబోమని సెలవిచ్చారు.
ఈ ఏడాది కాలంలో తాము హైదరాబాద్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కుల స్థలాల కబ్జాలు, రహదారుల ఆక్రమణలను తొలగించామని, తద్వారా 500 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడినట్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ సందర్భంగా ప్రకటించారు. అయితే, ‘సల్కం చెరువులో ఉన్న ఫాతిమా కాలేజీని నేలమట్టం చేయవద్దని వందల సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. సామాజిక కోణంలో పాత విద్యాసంస్థలను వదిలేయాలని నిర్ణయించాం’ అని సెలవివ్వడం చర్చనీయాంశమైంది.
హైడ్రా విధానం చూస్తుంటే కూల్చాలనుకుంటే ఒక కారణం, కూల్చకూడదనుకుంటే మరో సామరస్య సమాధానం చెబుతున్నట్టుగా ఉంది. ఒక నికార్సైన పద్ధతి ఏదీ లేదు. మల్లంపేట చెరువు దగ్గర కట్టిన విల్లాల్లో నిర్మాణంలో, ఖాళీగా ఉన్నవాటిని కూల్చి, నివాసం ఉంటున్నవాటిని వదిలేశారు. ఒక ప్రాజెక్టులోని నిర్మాణాలకు ఒకే సూత్రం వర్తించాలి కదా! చెరువు భూముల్లో కట్టుకున్న స్కూళ్లు, అప్పటికే నివాసముంటున్న ఇండ్లు,
హైడ్రా ఏర్పాటు కన్నా ముందు కట్టిన నిర్మాణాలను కూల్చివేయడం జరగదని హైడ్రా పుట్టిననాడే ఎందుకు చెప్పలేదు? దానికి మూడు నెలల సమయం ఎందుకు పట్టింది? ఈ మధ్య కాలంలో అన్యాయంగా హైడ్రా కూల్చివేతల వల్ల నష్టపోయినవారికి దారేది? అనుమతులున్నాయని పత్రాలు చూపించినా, బుల్డోజర్లకు అడ్డంగా పండుకున్నా పోలీసులతో నెట్టేయబడ్డవారికి కొత్త నిబంధనలు వర్తించవా? అనుమతులు ఇచ్చిన అధికారులు హాయిగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కరెంటు, రెవెన్యూ, ఇరిగేషన్, వాటర్ సప్లయి ఉద్యోగులు హైడ్రా పరిధిలోకి రారు. హైడ్రా ఫిర్యాదు చేసినా శాఖాపరమైన విచారణ ముందుకు సాగదు.
ఈ కొత్త నియమావళి ఊరకే రాలేదు. సామాన్యుల నుంచి వ్యతిరేకత, వరుసగా హైకోర్టు నిలదీతలను తట్టుకోలేక ప్రభుత్వం దిగివచ్చింది. కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి కిష్టారెడ్డిపేటలోని నిర్మాణాలను ఎందుకు కూల్చివేశారని న్యాయమూర్తి ప్రశ్నిస్తే.. అమీన్పూర్ తహసీల్దార్ చెప్పారని ప్రభుత్వ కౌన్సిల్ సమాధానమిచ్చారు. ‘ఆయన చార్మినార్ కూల్చివేయమంటే వింటారా?’ అని న్యాయమూర్తి ప్రశ్నించారు. కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తే హైడ్రా రద్దుకు కూడా వెనుకాడబోమని కోర్టు ఓ దశలో హెచ్చరించింది. ఈ ప్రభుత్వంలో ప్రజల ఆస్తులను ఇలా కోర్టులు కాపాడే దుస్థితి వచ్చింది.
-బద్రి నర్సన్ 9440128169