హైదరాబాద్ ఒక నగరం కాదు. ఇది తెలంగాణ ఆర్థిక శ్వాస. ఈ నగరం కేవలం భవనాలు, రోడ్లు, ఫ్లైఓవర్లు మాత్రమే కాదు. ఇది లక్షలాది యువతకు ఉపాధి, వేలాది పరిశ్రమలకు ఆధారం, కోట్లాది కుటుంబాలకు జీవనాధారం. హైదరాబాద్ బలంగా ఉంటే తెలంగాణ బలంగా ఉంటుంది, కుంగితే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలవుతుంది. అందుకే ఈ నగరంపై తీసుకునే ప్రతి రాజకీయ నిర్ణయం, ప్రతి విధాన మార్పు కేవలం రాజకీయ ప్రభావం మాత్రమే కాదు, సామాజిక, ఆర్థిక ప్రభావం కూడా కలిగిస్తున్నది. రాజధాని స్థిరత్వం అంటేనే రాష్ట్ర స్థిరత్వం.
హైదరాబాద్ విశ్వసనీయత అంటేనే.. తెలంగాణ విశ్వసనీయత. అయితే ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి సన్నిహిత శిష్యుడు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయాలు, రాజకీయ ధోరణి, ప్రచార సరళి అన్నీ హైదరాబాద్ గ్లోబల్ ఇమేజ్ను దెబ్బతీస్తున్నాయి.ఇది రేవంత్ పాలన లోపమా? లేక హైదరాబాద్‌ను రాజకీయ ప్రతీకారానికి వేదికగా మార్చే ప్రమాదకర ప్రయోగమా? ఇది రాష్ట్ర రాజకీయాల్లో వినిపిస్తున్న ప్రశ్న. రాజకీయాల్లో వ్యక్తుల మార్పు సహజం. పార్టీలు మారుతాయి, సిద్ధాంతాలు మారుతాయి, వ్యూహాలు మారుతాయి. కానీ రాజధాని నగరాన్ని ఒక రాజకీయ ప్రయోగశాలగా మార్చడం అత్యంత ప్రమాదకరం. ఇది కేవలం పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ లోపం కాదు. హైదరాబాద్‌ను ఒక రాజకీయ గేమ్‌లో బలి పెట్టే ప్రమాదకర వెండెట్టా (ప్రతీకార రాజకీయాలు) అని తెలుస్తున్నది.
హైదరాబాద్ మాడల్‌ను రాజకీయ వేదికగా మార్చడం, ‘గురువు’ కోసం రేవంత్ హైదరాబాద్‌ను బలి చేస్తున్నాడా? హైబాద్లోని ఐటీ, ఫార్మా కంపెనీలు చంద్రబాబు, రాజశేఖరరెడ్డి వల్ల వచ్చాయని, కేసీఆర్ ఏమీ చేయలేదని రేవంత్ వాదన. ఇది కేవలం కేసీఆర్‌పై విమర్శ కాదు.. హైదరాబాద్ అభివృద్ధికి తెలంగాణ నాయకత్వానికి క్రెడిట్ ఇవ్వకుండా, ఆంధ్ర నాయకుల పేరే ముందుకు తెచ్చే ప్రయత్నం. ఇదే కథ 2025 నవంబర్ 16న జరిగిన రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల్లో పునరావృతమైనది. రేవంత్ అక్కడ కూడా రామోజీ ఫిల్మ్ సిటీని ‘నాలుగో వండర్’ అంటూ పొగిడాడు. ఇది పూర్తిగా చంద్రబాబు- రామోజీ మీడియా బంధాన్ని బలోపేతం చేసే రాజకీయ సందేశం.
తెలంగాణకు ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా హైదరాబాద్ వెన్నెముక. ఐటీ హబ్, రియల్ ఎస్టేట్, పరిశ్రమలు, స్టార్టప్ ఎకోసిస్టం, గ్లోబల్ క్యాపిటల్, ఇవన్నీ హైదరాబాద్‌లో కేంద్రీకృతమయ్యాయి. అందుకే హైదరాబాద్ భూములపై విధానాలు అంటే రాష్ట్ర భవిష్యత్తును తేల్చే విధానాలు. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫార్మేషన్ పాలసీపై వచ్చిన ఆరోపణలు అత్యంత తీవ్రమైనవి. బాలానగర్, జీడిమెట్ల, సనత్‌నగర్, ఆజమాబాద్ వంటి ప్రధాన పారిశ్రామిక ప్రాంతాల్లో వేల ఎకరాల భూముల మార్కెట్ విలువ రూ.45 లక్షల కోట్లు. కేవలం పాత ఎస్ఆర్వో రేట్లకు 30% చెల్లించి రెగ్యులరైజేషన్ చేయడం అనేది రేవంత్‌రెడ్డి బంధువులకు, చంద్రబాబు అనుకూల కార్పొరేట్లకు పంచిపెట్టేందుకే. ఐటీ కారిడార్, భూమి అలాట్మెంట్లలో ఏపీ వ్యాపారులకు అనుకూల నిర్ణయాలు జరుగుతున్నాయి అనేది జగమెరిగిన సత్యం.
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో, ముఖ్యంగా గోపన్‌పల్లి వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో భూరిజిస్ట్రేషన్లను ఆపివేయడం, భూములను స్వాధీనం చేసుకోవాలనే ప్రభుత్వ ప్రయత్నాలు.. మధ్య తరగతి కుటుంబాల్లో తీవ్ర భయాందోళనలను సృష్టిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో చాలామంది సాధారణ ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, ప్రవాస భారతీయులు తమ జీవితకాలపు పొదుపులతో భూములు కొనుగోలు చేసి భవిష్యత్తు భద్రత కోసం పెట్టుబడి పెట్టారు. కానీ ఇప్పుడు ఆ భూములపై ప్రభుత్వ జోక్యం పెరగడం, చట్టపరమైన అస్పష్టతలు రావడం వల్ల వారి ఆస్తుల భద్రతపై అనిశ్చితి నెలకొంది. ఈ నిర్ణయాలు కొందరు పెద్ద రియల్ ఎస్టేట్ గ్రూపులు, రాజకీయనేతల సన్నిహితులైన వ్యాపారులకు లాభం చేకూర్చేలా రూపకల్పన జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన సుమారు 400 ఎకరాల భూమిని ప్రభుత్వమే వేలం వేయాలనే నిర్ణయం తీవ్ర వివాదానికి దారితీసింది. ఇది అభివృద్ధి పేరిట తీసుకున్న సాధారణ నిర్ణయంలా పైకి చూపించినా, వాస్తవంలో ఇది విద్యావ్యవస్థపై, హైదరాబాద్ నగర సంస్కృతిపై ఒక దాడి. ఈ భూమి కేవలం ఖాళీ స్థలం కాదు; అది పరిశోధన, విద్య, పర్యావరణం, సామాజిక చైతన్యానికి సంబంధించిన ఒక వారసత్వం. విద్యార్థులు ‘హెరిటేజ్‌ను నాశనం చేస్తున్నారు’ అంటూ బహిరంగ నిరసనలకు దిగడం ఈ ఆందోళన తీవ్రతను సూచిస్తున్నది.
ఒకవైపు ప్రభుత్వం పెట్టుబడులు, అభివృద్ధి పేరుతో భూములను వాణిజ్యీకరించడానికి ప్రయత్నిస్తుండగా, మరోవైపు విద్యాసంస్థల స్వాతంత్య్రం, పబ్లిక్ స్పేస్, అకడమిక్ కల్చర్ ప్రమాదంలో పడుతున్నాయి. గ్లోబల్ సిటీగా గుర్తింపు పొందిన హైదరాబాద్‌కు అవసరమైనది కేవలం కాంక్రీట్ అభివృద్ధి కాదు. జ్ఞానం, పరిశోధన, విద్యకు తెరిచి ఉన్న సంస్కృతి కూడా అంతే ముఖ్యమైనది. ఆ సంస్కృతిని దెబ్బతీసే విధానాలు నగర భవిష్యత్తుపై దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంది.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రకటించిన హైడ్రా పేరు వినడానికి ఆకర్షణీయంగా, చట్టపరమైన నియంత్రణ సంస్థలా అనిపించినా, దాని అమలు మాత్రం ప్రజల్లో తీవ్ర సందేహాలు కలిగిస్తున్నది. అనధికార నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలన్న లక్ష్యంతో ప్రారంభించిన ఈ వ్యవస్థ.. వాస్తవంగా మాత్రం పొలిటికల్ డెమాలిషన్ స్వాడ్‌లా పనిచేస్తున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా రియల్ ఎస్టేట్ విలువ ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, పెద్ద పెట్టుబడులు ఉన్న భూములు, రాజకీయంగా సున్నితమైన ప్రాజెక్ట్‌లు ఉన్నచోట హైడ్రా చర్యలు అత్యంత వేగంగా, తీవ్రంగా సాగుతున్నాయనే భావన ప్రజల్లో ఉన్నది. దీని ఫలితంగా హైదరాబాద్‌ను అంతర్జాతీయంగా బుల్డోజర్ క్యాపిటల్‌గా చూడటం మొదలైందనే విమర్శ కూడా వినిపిస్తున్నది. దావోస్‌లో రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌ను న్యూయార్క్, టోక్యోతో పోటీ పడే గ్లోబల్ సిటీగా మార్చుతామని ప్రకటించినా, ఈ తరహా విధానాలు పెట్టుబడిదారుల్లో అస్థిరత భావనను పెంచుతున్నాయనే ఆందోళనలు ఉన్నాయి.
కార్నింగ్, ఫాక్స్‌కాన్, కైన్స్ వంటి సంస్థలు తెలంగాణలో విధాన స్థిరత్వం, భూ భద్రత, పాలసీ నిశ్చితత్వంపై సందేహాలు వ్యక్తం చేసి ఇతర ప్రాంతాల వైపు దృష్టి మళ్లిస్తున్నాయనే వార్తలు కూడా ఈ అనిశ్చితిని మరింత బలపరుస్తున్నాయి. గ్లోబల్ సిటీగా ఎదగాలంటే కేవలం కఠిన చర్యలు కాదు, పెట్టుబడిదారులకు భరోసా ఇచ్చే పాలసీ స్థిరత్వం, పారదర్శక పాలన, న్యాయపరమైన స్పష్టత అవసరం. హైడ్రా అమలు, ప్రజల ఆస్తి హక్కులు, పెట్టుబడిదారుల విశ్వాసం, హైదరాబాద్ అంతర్జాతీయ ప్రతిష్ఠపై దీర్ఘకాలిక ప్రభావం చూపే అంశంగా మారుతున్నదని సర్వత్రా జోరుగా చర్చ జరుగుతున్నది.
రేవంత్‌రెడ్డి పాలనలో పెద్ద కార్పొరేట్ కంపెనీలపై ఒక విచిత్రమైన ప్రెషర్ ప్యాటర్న్ పనిచేస్తున్నదని పరిశ్రమ వర్గాలు చర్చించుకుంటున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం హోస్ట్ చేసిన ఫార్ములాఈ వంటి గ్లోబల్ ఈవెంట్‌ను కాంగ్రెస్ పాలకులు నెగెటివ్‌గా చిత్రీకరించడంతో, ఆ ఈవెంట్ ఆర్గనైజర్లు తెలంగాణ నుంచి వెళ్లిపోయారు.
ఫలితంగా గ్లోబల్ ఈవెంట్ హబ్ హైదరాబాద్ ఎదుగుదల దెబ్బతిన్నది. మెట్రో భూముల కోసం ఎల్అండ్టీ కంపెనీని భయపెట్టి, ప్రభుత్వంలో కలుపుకున్నది రేవంత్ సర్కార్. ఇలాంటి చర్యలు పరిశ్రమవర్గాల్లో కలవరం సృష్టించాయి. మెట్రో వంటి కీలక మౌలిక వసతి ప్రాజెక్ట్‌లకు భూమి సమస్యలు, ప్రభుత్వకార్పొరేట్ భాగస్వామ్యం అత్యంత సున్నితమైన అంశాలు. వాటిని రాజకీయంగా హ్యాండిల్ చేయడం వల్ల ప్రాజెక్ట్ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇది కేవలం ఒక కంపెనీ సమస్య కాదు, హైదరాబాద్ ట్రాన్సిట్ ఇమేజ్, నగర విశ్వసనీయత, పెట్టుబడిదారుల నమ్మకంపై పడే ప్రభావం.
గ్లోబల్ సిటీగా ఎదగాలంటే ప్రభుత్వం కార్పొరేట్ రంగంతో ఘర్షణ కాదు, స్థిరమైన, పారదర్శకమైన భాగస్వామ్య మాడల్‌ను నిర్మించాలి అనే అభిప్రాయం ఇప్పుడు పరిశ్రమ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నది. డెక్కన్ సిమెంట్స్, ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇతర ఇన్వెస్టర్లు రాజకీయ బెదిరింపులు, ఐటీ, ఈడీ దర్యాప్తుల కవర్లో క్యాష్-ఎక్స్టార్షన్ ప్రయత్నాల ఆరోపణలు పెరిగాయి. ఫలితంగా కంపెనీలు హైదరాబాద్‌ను ‘ప్రిడిక్టబుల్ మార్కెట్’గా కాకుండా ‘పొలిటికల్ రిస్క్ జోన్’గా చూడడం మొదలుపెట్టాయి. ఇది చంద్రబాబు ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ నాయకుడు అనే ఇమేజ్ పెంచేందుకు పక్కాగా రేవంత్ ప్లాన్ అమలు చేస్తున్నట్టే కనిపిస్తున్నది.
రేవంత్‌రెడ్డి రోజువారీ ప్రెస్ కాన్ఫరెన్సులు ఎక్కువగా కేవలం కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్, కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ వంటి రాజకీయ ఆరోపణలకే పరిమితమవుతున్నాయి . ఒక సీఎం ప్రధాన బాధ్యత నగర పరిపాలన, అభివృద్ధి. హైదరాబాద్‌లో గతంలో కొనసాగిన అనేక కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఇప్పుడు నిలిచిపోయినట్టుగా కనిపిస్తున్నాయి.
కొత్త ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, రోడ్ల రీకార్పెటింగ్ పనులు మందగించాయి. చెత్త నిర్వహణ సమస్యలు పెరిగాయి. హరిత హైదరాబాద్ వంటి పర్యావరణ కార్యక్రమాలు కనుమరుగయ్యాయి. ట్రాఫిక్ సమస్యలపై కూడా స్పష్టమైన పరిష్కార దిశ కనిపించడం లేదు. దీంతో నగరవాసులు నరకం అనుభవిస్తున్నారు. అంతేకాదు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ‘మాకు ఓటు వేయకపోతే వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వం’ అనే బెదిరింపు వ్యాఖ్యలు ప్రజాస్వామ్య సంస్కృతికి తీవ్ర విఘాతం. ప్రజా సంక్షేమ పథకాలు ఓట్లకు బందీ కావడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ఒక గ్లోబల్ సిటీకి అవసరమైనది రాజకీయ నినాదాలు కాదు, నిరంతర మౌలిక వసతుల అభివృద్ధి, పౌర జీవన నాణ్యతపై దృష్టి అది ఇప్పుడు కనబడటం లేదు.
రేవంత్‌రెడ్డి చర్యలు అభివృద్ధి కాదు, ఇది నగర ఇమేజ్ కోసం కృషి కాదు, ఇది ఒక రాజకీయ ఆట అని స్పష్టమైన సందేశం ఇస్తున్నాయి. ‘గురుశిష్య’ సంబంధాన్ని సజీవంగా ఉంచేందుకు జరుగుతున్న వెండెట్టా పాలిటిక్స్. హైదరాబాద్‌ను బెంగళూరు, దుబాయ్, సింగపూర్ లెవెల్లో నిలబెట్టిన బ్రాండ్‌ను కాంగ్రెస్ పాలకులు నాశనం చేస్తున్నారు. ఇక్కడి భూములు, అవకాశాలు ప్రజల భవిష్యత్తుకు సంబంధించినవి. కానీ హైదరాబాద్ అభివృద్ధి తెలంగాణ ప్రజల కోసమా? లేక చంద్రబాబు ప్రయోజనాల కోసమా? రేవంత్‌రెడ్డి నిజంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేయాలని అనుకుంటున్నారా? లేదా తన రాజకీయ గురువుకు రాజకీయ-ఆర్థిక గురుదక్షిణ చెల్లించాలని యోచిస్తున్నారా? హైదరాబాద్‌ను అమ్మితే, తెలంగాణ ఆత్మను అమ్మినట్టే.
(వ్యాసకర్త: రాజకీయ విశ్లేషకుడు)
-మహేంద్ర తోటకూరి ,97048 48648