తెలంగాణ తొలి దశ ఉద్యమ నేపథ్యంలో ఉద్భవించిన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం జాతీయస్థాయిలో ఒక ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ. అనేక ఆవిష్కరణలకు ఆలవాలంగా ఉన్న ఈ విశ్వవిద్యాలయం దురదృష్టవశాత్తు మొదటిసారిగా ‘కులవివక్ష’ కారణంగా వార్తల్లోకి ఎక్కగా నేడు పాలకుల వివక్ష లేదా ప్రభుత్వ ధనాపేక్ష కారణంగా రెండవసారి జాతీయస్థాయిలో చర్చల్లోకి వస్తున్నది.
కోర్టులకు, విశ్వవిద్యాలయాలకు సెలవులు వచ్చిన నేపథ్యంలో భారీసంఖ్యలో పోలీసు పహారాలో బుల్డోజర్లు దింపడం దుర్మార్గం. ఆ 400 ఎకరాల భూమి హైదరాబాద్ నగరానికి ముఖ్యంగా పశ్చిమ ప్రాంతానికి ఊపిరితిత్తుల్లాగా పని చేస్తున్నాయనేది వాస్తవం. ఇదంతా బాహాటంగా జరుగుతుంటే కాంగ్రెస్ ప్రభు త్వం రావాలని కాళ్లకు బలపాలు కట్టుకుని తిరిగిన మేధావులు తమకు పదవులు రాగా నే మౌనాన్ని ఆశ్రయించడం అవకాశవాదమే! ప్రభుత్వ చర్యలను నిరసించిన విద్యార్థినీ విద్యార్థులను విచక్షణారహితంగా కొడుతూ జైల్లో వేయడం ప్రజాస్వామ్య వాదులకు, హక్కుల సంఘాలకు ఏ రకంగా మింగుడు పడుతున్నదో అర్థం కావడం లేదు.
వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటానికి ముందుకు రావడం లేదు. అంటే పరోక్షంగా ప్రభుత్వ దుర్మార్గాన్ని వారు సమర్థిస్తున్నట్టే! దేశవ్యాప్తంగా కూడా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న అరాచకం అటు మేధావులను, ప్రకృతి ప్రేమికులను, సెలబ్రిటీలను కదిలిస్తున్నది. కానీ మన రాష్ట్రంలో కొత్తగా పదవి పొందిన ఒక ‘పెద్ద’మనిషికి అక్కడ ఏం జరుగుతున్నదో తెలియదట. రాష్ట్రవ్యాప్తంగా కూడా విశ్వవిద్యాలయాల్లో పట్టణాల్లో ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు నిర్వహిస్తుంటే సదరు మేధావికి చీమకుట్టినట్టయినా లేకపోవడం ఆశ్చర్యకరం! 12 ఏళ్ల క్రితం అంతర్జాతీయ జీవవైవిధ్య మహాసభలు హైదరాబాద్లో జరుపుకోవడాన్ని మనం మర్చిపోకూడదు.
కానీ ఆ వేదికకు కూతవేటు దూరంలోనే నేడు ఈ ప్రకృతి విధ్వంసం జరగడం శోచనీయం. అరుదైన జంతు, పక్షి జాతులు, ఔషధ మొక్కలు విధ్వంసానికి బలవుతున్నాయి. ప్రకృతి ప్రేమికులు మాత్రం ఈ మూగజీవాల మృతికి ‘సంతాపం’ ప్రకటిస్తున్నట్లుగా మౌనం వహిస్తున్నారు. ఒకరిద్దరు సన్నాయి నొక్కులతో సరిపెట్టుకోగా, కవులు, కళాకారులు, రచయితలు అందరికీ ‘రియల్ రేవంత్’లో స్వార్థం కనబడడం లేదు.
అభివృద్ధి కాముకుడు దర్శనమిస్తున్నాడు. ప్రభుత్వ లబ్ధిని పొందినవారు ప్రజాపక్షం వహించకపోవడం ప్రజాద్రోహమే అవుతుంది. ఒకపక్క హైడ్రాను సృష్టించి సహజ వనరుల్లోని ఆక్రమణలు కూల్చేస్తానంటున్న ముఖ్యమంత్రి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పర్యావరణ రక్షణను పక్కకు పెట్టి, ప్రకృతి విధ్వంసానికి పూనుకోవడం రెండు నాలుకల ధోరణే! విశ్వవిద్యాలయాన్ని అష్టదిగ్బంధనం చేసి మరీ ఈ బీభత్సానికి పాల్పడటం వెనుక ఎంత కుట్ర దాగి ఉందో విద్యార్థులు గమనించారు. మేధావులు, కవులు, కళాకారులు మాత్రమే గ్రహించలేకపోతున్నారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం తక్షణమే కల్పించుకొని ‘స్టే’ ఇవ్వకపోతే వికాసం మాటున ఈ విధ్వంసం పరిపూర్ణమయ్యేది. దీనిని ప్రజాస్వామ్య వాదులందరూ ఖండించి ప్రతిఘటించవలసిన తరుణం ఆసన్నమైంది. సామాన్యుడు సైతం ప్రశ్నిస్తున్న వేళ మేధావుల మౌనం మంచిది కాదు.
– శ్రీ శ్రీ కుమార్